న్యూఢిల్లీ: బిట్‌కాయిన్ వంటి వర్చువల్ కరెన్సీలు ఎలాంటి చట్టపరమైన చెల్లుబాటు, రక్షణ లేని పోంజీ స్కీముల్లాంటివని కేంద్రం వ్యాఖ్యానించింది. వీటి విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే కష్టార్జితం హరించుకుపోయే ప్రమాదం ఉందని ఇన్వెస్టర్లను హెచ్చరించింది. కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘పోంజీ స్కీముల తరహాలోనే వర్చువల్ కరెన్సీలు కూడా బుడగల్లాగా పేలిపోయే రిస్కులు ఎక్కువగా ఉన్నాయి.
దీంతో ఇన్వెస్టర్లు.. ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్ల కష్టార్జితమంతా హరించుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి పోంజీ స్కీముల వలలో పడకుండా వినియోగదారులు జాగ్రత్త వహించాలి‘ అని పేర్కొంది. వీటిపై ఆర్‌బీఐ ఇప్పటికే మూడుసార్లు హెచ్చరించిందని ఆర్థిక శాఖ తెలిపింది. డిజిటల్ ఫార్మాట్‌లో ఉండే క్రిప్టో కరెన్సీలు హ్యాకింగ్‌కు, మాల్‌వేర్ దాడులకు గురయ్యే అవకాశం ఉందని, ఫలితంగా పెట్టిన పెట్టుబడంతా శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉందని వివరించింది.
బిట్‌కాయిన్‌లాంటి ఇతర వర్చువల్ కరెన్సీలకు భరోసానిచ్చేటువంటి అసెట్స్ ఏమీ లేవని, వీటి విలువ భారీగా పెరిగిపోవడానికి.. తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవడానికి స్పెక్యులేషనే కారణమని ఆర్థిక శాఖ తెలిపింది. మరోవైపు, బిట్‌కాయిన్ లాంటి కరెన్సీల పర్యవేక్షణకు అంతర్జాతీయంగా ఉన్న వ్యవస్థలను పరిశీలించి తగు సిఫార్సులు చేసేందుకు ఆర్థిక వ్యవహారాల విభాగం ప్రత్యేక కమిటీ వేసినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ లోక్‌సభకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment