న్యూఢిల్లీ: బిట్‌కాయిన్, ఎథీరియం, రిపుల్ వంటి క్రిప్టోకరెన్సీలకు ఇటీవలి కాలంలో డిమాండ్ బాగా పెరిగిన నేపథ్యంలో బడా కంపెనీలు వర్చువల్ కరెన్సీ విభాగంలోకి దిగుతున్నాయి. తమ కస్టమర్ల కోసం బిట్‌కాయిన్‌లాంటి సొంత కరెన్సీని రూపొందించే పనిలో పడ్డాయి. టెలికం దిగ్గజం రిలయన్స్ జియో, ఫోటోగ్రఫీ ఉత్పత్తుల సంస్థ కొడాక్ వంటి కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. చౌక టారిఫ్‌లతో దేశీ టెలికం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో... ప్రస్తుతం జియోకాయిన్ రూపకల్పనపై కసరత్తు చేస్తోంది.
జియోకాయిన్ ప్రాజెక్టుకు స్వయంగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తనయుడు ఆకాశ్ అంబానీ సారథ్యం వహిస్తుండటం గమనార్హం. కాంట్రాక్టులు, సరఫరా మొదలైన కార్యకలాపాల నిర్వహణ కోసం బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఆధారిత అప్లికేషన్స్‌ను రూపొందించడం జియోకాయిన్ ప్రాజెక్టు లక్ష్యం. పనిలో పనిగా బ్లాక్‌చెయిన్ ఆధారిత జియోకాయిన్లను కూడా రూపొందించడంపై ఇది దృష్టి పెట్టనుంది. ఇందుకోసం ఆకాశ్ అంబానీ సారథ్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటవుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్టు కోసం సగటు పాతికేళ్ల వయసున్న యాభై మంది నిపుణులను తీసుకోవాలని కంపెనీ యోచిస్తోంది. వీరంతా ఆకాశ్ అంబానీ సారథ్యంలో వివిధ బ్లాక్‌చెయిన్ సాధనాలపై పనిచేస్తారు.
బ్యాంకులు వంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రెండు వర్గాలు తక్కువ వ్యయాలతో ఆన్‌లైన్‌లో లావాదేవీలు నిర్వహించుకునేందుకు ఈ బ్లాక్ చెయిన్ అప్లికేషన్స్ ఉపయోగపడతాయి. ఆర్థికపరమైన చెల్లింపులకు సంబంధించి బిట్‌కాయిన్ మొదలైన కరెన్సీలన్నీ ఇదే ప్రాతిపదికన రూపొందినవే. ఇదే కోవలో తమ కస్టమర్లకు లాయల్టీ పాయింట్స్ లాంటివి జియోకాయిన్‌ల రూపంలో అందించే అవకాశాలు ఉన్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి.
ఐవోటీలోకి కూడా జియో...: ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) విభాగంలోకి కూడా ప్రవేశించాలని రిలయన్స్ జియో యోచిస్తోంది. ఇందుకు కూడా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఉపయోగపడనుంది. స్మార్ట్‌ఫోన్లు, వేరబుల్ డివైజ్‌లు, గృహోపకరణాలు మొదలైన వాటన్నింటినీ ఒక నెట్‌వర్క్ కింద ఇంటర్నెట్ ద్వారా అనుసంధానం చేసే టెక్నాలజీని ఐవోటీగా వ్యవహరిస్తారు. ఈ టెక్నాలజీతో ఇవన్నీ పరస్పరం డేటాను ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా సందర్భానుసారంగా స్పందిస్తుంటాయి. ఐవోటీలో ఉండే భద్రతాపరమైన రిస్కులకు చెక్ చెప్పేందుకు కూడా బ్లాక్‌చెయిన్ ఉపయోగపడగలదని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఓవెపు కంపెనీలు కూడా సొంతంగా క్రిప్టోకరెన్సీలను రూపొందించుకోవడంలో నిమగ్నమవుతుండగా.. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం వర్చువల్ కరెన్సీలకు చట్టబద్ధత లేదని, వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది.
ఫొటోగ్రాఫర్లకు కొడాక్ కాయిన్..
ఫొటోగ్రాఫర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఫోటోగ్రఫీ ఉత్పత్తుల సంస్థ కొడాక్ కూడా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఆధారిత సాధనాలపై పనిచేస్తోంది. ఫోటో గ్రాఫర్లు తమ వర్క్ కాపీరైట్ చౌర్యానికి గురికాకుండా.. రిజిస్టర్ చేసుకునేందుకు ప్రత్యేక బ్లాక్‌చెయిన్ ఎక్సే్చంజీని రూపొందిస్తోంది. సదరు వర్క్‌ను ఉపయోగించుకోదల్చుకునే వారు సురక్షితంగా క్రిప్టోకరెన్సీ కొడాక్ కాయిన్‌ల రూపంలో చెల్లింపులు జరిపేలా ఈ మాధ్యమాన్ని తీర్చిదిద్దుతోంది. ఇందుకోసం వెన్ డిజిటల్ అనే సంస్థతో కలిసి పనిచేస్తోంది. సొంత క్రిప్టోకరెన్సీని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు ఐపీవో తరహాలో ఈ నెలాఖర్లో ఐసీవో (ఇనీషియల్ కాయిన్ ఆఫరింగ్) కూడా ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment