కొత్త బంగారం.. బిట్‌కాయిన్
⇒ పసిడి రేటును మించిన వర్చువల్ కరెన్సీ విలువ
⇒ 1,300 డాలర్ల దిశగా పరుగులు..
⇒ అమెరికాలో ఈటీఎఫ్‌కు అనుమతులపై ఆశలతో ఊతం
⇒ రిస్కులూ ఉన్నాయంటున్న విశ్లేషకులు
భారత్‌లో బిట్‌కాయిన్..
భారత్‌లో ప్రస్తుతం బీటీసీఎక్స్‌ఇండియా, కాయిన్‌సెక్యూర్, యునోకాయిన్, జేబ్‌పే వంటి బిట్‌కాయిన్ ఎక్సే్చంజీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. గతేడాది ఆగస్టు (డీమోనిటైజేషన్‌కి ముందు).. భారత్‌లో బిట్‌కాయిన్ యూజర్ల సంఖ్య సుమారుగా 50,000 పైచిలుకు ఉన్నట్లు అంచనా. మోదీ సర్కారు పెద్ద నోట్ల రద్దు తర్వాత బిట్‌కాయిన్ విలువ భారీగా పెరిగింది. గతేడాది అక్టోబర్‌లో రూ. 40,000 స్థాయిలో ఉన్న రేటు సుమారు రూ. 90,000 స్థాయికి ఎగిసింది.
న్యూఢిల్లీ: వర్చువల్ బంగారంగా పేరొందిన బిట్ కాయిన్ ప్రస్తుతం అసలు బంగారాన్ని మించి పరుగులు తీస్తోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న అంచనాలతో పసిడి ఈ మధ్య కాస్త తగ్గుతుండగా.. దానికి భిన్నంగా బిట్‌కాయిన్ మాత్రం దూసుకెడుతోంది. గడిచిన కొద్ది ట్రేడింగ్ సెషన్లలో వరుసగా కొత్త గరిష్ట స్థాయిల్ని తాకుతూ.. 1,300 డాలర్ల వైపు వెళుతోంది. కాయిన్‌డెస్క్ బీపీఐ ఎక్సే్ఛంజ్‌లో శుక్రవారం ఒక దశలో 1,293 డాలర్ల స్థాయిని తాకింది. మరోవైపు అదే సమయంలో ఔన్సు పసిడి ధర 1,227 డాలర్ల దగ్గర తిరుగాడుతుండటం గమనార్హం. 2008లో బిట్‌కాయిన్ తొలిసారిగా వెలుగులోకి వచ్చిన తర్వాత.. వెయ్యి డాలర్ల పైన ఇంత సుదీర్ఘ కాలం ట్రేడవుతుండటం ఇదే తొలిసారి.
అమెరికా వ్యాపారవేత్తలు కామెరాన్, టైలర్ వింకెల్‌వోస్‌లు తలపెట్టిన తొలి బిట్‌కాయిన్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్)కి అమెరికా ప్రభుత్వం ఆమోదముద్ర లభించగలదన్న ఆశలు ఈ వర్చువల్ కరెన్సీ వృద్ధికి ఇంధనంగా పనిచేస్తున్నాయి. ఈటీఎఫ్ లిస్టింగ్‌కి అనుమతులకు సంబంధించి అనుమతులు ఇచ్చే విషయంపై అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) మార్చ్ 11న తుది నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ ఈటీఎఫ్‌కు అనుమతులు లభిస్తే.. డిజిటల్ కరెన్సీగా బిట్‌కాయిన్ ఆమోదయోగ్యత, తదనుగుణంగా విలువ కూడా మరింతగా పెరుగుతుంది. మిగతా దేశాల్లోని మార్కెట్ నియంత్రణ సంస్థలు కూడా ఈ తరహా ఈటీఎఫ్ లిస్టింగ్స్‌ను పరిశీలించవచ్చు.
సురక్షితమైనదేనా ...
బిట్‌కాయిన్ విలువ అంతకంతకూ పెరిగిపోతున్నప్పటికీ.. ఇది సురక్షితమైన కరెన్సీయేనా అన్న సందేహాలు కొనసాగుతూనే ఉన్నాయి. బిట్‌కాయిన్ విలువ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుండటం ఒక కారణం కాగా, దీని ఆమోదయోగ్యతపై సందేహాలు మరో కారణం. రిస్కుల విషయానికొస్తే.. క్రూడాయిల్, బాండ్ల స్థాయిలో బిట్‌కాయిన్‌కూ రిస్కులు ఉంటాయి. హెచ్చుతగ్గుల సంగతి తీసుకుంటే పసిడి రేట్లు సగటున 1.2 శాతం మేర, ఇతరత్రా ప్రధాన కరెన్సీలు 0.5–1.0 శాతం మేర మార్పులకు లోనవుతుంటాయి. అదే బిట్‌కాయిన్‌కి సంబంధించి చూస్తే.. 2011లో అమెరికా డాలర్‌తో పోల్చి చూసినప్పుడు బిట్‌కాయిన్ హెచ్చుతగ్గుల సూచీ ఏకంగా 16.11 శాతం మేర మారింది. ప్రస్తుతం ఇది 2.25 శాతానికి దిగి వచ్చినప్పటికీ ఇంకా పూర్తిగా సర్దుకోలేదు. ఇలా తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే ధోరణి కారణంగా ఎక్కువగా స్పెక్యులేటర్స్ బిట్‌కాయిన్స్‌వైపు ఆకర్షితులవుతుంటారని, దీనితో హెచ్చుతగ్గులు మరింత ఎక్కువవుతుంటాయని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా సాధారణ ఇన్వెస్టర్లకు దీనిపై నమ్మకం కుదరడం కష్టంగా ఉంటుందని వివరించాయి.
ఇక, ఆమోదయోగ్యతపరంగా చూస్తే.. మిగతా కరెన్సీలలాగా అన్ని రకాల ఉత్పత్తులు, సర్వీసుల కొనుగోళ్లకు బిట్‌కాయిన్‌లను వినియోగించడం వాడుకలోకి రాలేదు. ఈ నేపథ్యంలో.. రేటుపరంగా పసిడికన్నా ఎక్కువ పలుకుతున్నా బంగారం తరహాలో పెట్టుబడికి సురక్షితమైన సాధనంగా దీన్ని పరిగణించడం తొందరపాటు చర్యే అవుతుందన్నది పరిశీలకుల అభిప్రాయం. ఇక వింకెల్‌వోస్ సోదరులు తలపెట్టిన ఈటీఎఫ్ ప్రయత్నాలు ఫలప్రదం కాకపోతే.. బిట్‌కాయిన్ రేటు మరింత పడిపోవచ్చన్న అంచనాలూ ఉన్నాయి. ప్రస్తుతం పన్నెండు వందల డాలర్ల పైన ట్రేడవుతున్న బిట్‌కాయిన్.. ఆ పరిస్థితుల్లో 1,000–1,100 డాలర్ల స్థాయికీ పడిపోయి కొంత కాలం పాటు అక్కడక్కడే తిరుగాడవచ్చని దేశీ బిట్‌కాయిన్ ఎక్సే్చంజ్ జేబ్‌పే వర్గాలు వెల్లడించాయి.
ఆర్‌బీఐ ఏమంటోంది..
బిట్‌కాయిన్ వంటి డిజిటల్ కరెన్సీలకు ఊతమిచ్చే క్రమంలో వివిధ దేశాల్లో నియంత్రణ సంస్థలు మార్గదర్శకాల రూపకల్పనపై కసరత్తు చేస్తున్నాయి. దేశీయంగా ఓవైపు ప్రభుత్వం నగదు వాడకాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. రిజర్వ్ బ్యాంక్ మాత్రం బిట్‌కాయిన్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటిదాకా ఎటువంటి వర్చువల్ కరెన్సీ వాడకానికీ లైసెన్సు ఇవ్వలేదని, ఎవరైనా దీన్ని వాడుతున్న పక్షంలో దానికి పూర్తి బాధ్యత వారిదేనంటూ ఈ మధ్యే స్పష్టం చేసింది. వర్చువల్ కరెన్సీల వాడకంలో అనేక రిస్కులు ఉన్నాయని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్‌ఎస్ గాంధీ ఇటీవలే హెచ్చరించారు కూడా.
నియంత్రణ సంస్థల పరిధిలో లేని ఈ తరహా కరెన్సీల వల్ల ఆర్థికంగా, చట్టపరంగా, వినియోగదారుల హక్కుల పరిరక్షణపరంగా, భద్రతాపరంగానూ పలు ముప్పులు ఉంటాయని ఆయన వివరించారు. అయితే, చైనా, రష్యా, సింగపూర్ తదితర దేశాలన్నీ కూడా ఈ తరహాలోనే ముందుగా హెచ్చరికలు వగైరా చేసినా.. ఆ తర్వాత వర్చువల్ కరెన్సీని ఎంతో కొంత నియంత్రించే దిశగా మార్గదర్శకాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఎంతో కాలం వేచి చూసే ధోరణి అవలంబించడం సరికాకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల వీటి గురించి ఎక్కువగా అవగాహన లేని సాధారణ ఇన్వెస్టర్లు నష్టపోయే ప్రమాదం ఉందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.