క్రిప్టోకరెన్సీపై ఆర్‌బీఐ ‘నిషేధం’ ఎత్తివేత | Supreme Court Removes Ban on Cryptocurrency Transactions in India | Sakshi
Sakshi News home page

క్రిప్టోకరెన్సీపై ఆర్‌బీఐ ‘నిషేధం’ ఎత్తివేత

Published Thu, Mar 5 2020 4:59 AM | Last Updated on Thu, Mar 5 2020 5:01 AM

Supreme Court Removes Ban on Cryptocurrency Transactions in India - Sakshi

న్యూఢిల్లీ: వివాదాస్పద క్రిప్టోకరెన్సీ అంశంపై సుప్రీం కోర్టు బుధవారం కీలక తీర్పునిచ్చింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు.. ఈ కరెన్సీలకు సంబంధించిన సేవలను అందించవచ్చని పేర్కొంది. ఈ విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ 2018లో జారీ చేసిన సర్క్యులర్‌ను పక్కన పెట్టింది. క్రిప్టోకరెన్సీలపై ఆర్‌బీఐ ’నిషేధా’న్ని సవాల్‌ చేస్తూ .. ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐఎంఏఐ) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. ఓవైపు వర్చువల్‌ కరెన్సీలను నిషేధించలేదని ఆర్‌బీఐ చెబుతోందని, మరోవైపు అనేక కమిటీలు వేసినా కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోలేకపోతోందని.. ఈ నేపథ్యంలో క్రిప్టోకరెన్సీలపై రిజర్వ్‌ బ్యాంక్‌ సర్క్యులర్‌ సరికాదని జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌ సారథ్యంలోని త్రిసభ్య బెంచ్‌ ఉత్తర్వులిచ్చింది.  

వివరాల్లోకి వెడితే.. బిట్‌కాయిన్ల వంటి వర్చువల్‌ కరెన్సీలతో ఆర్థిక నష్టాలతో పాటు అనేక రిస్కులు పొంచి ఉన్నాయని 2013లో ఆర్‌బీఐ హెచ్చరించింది. ఆ తర్వాత 2018 ఏప్రిల్‌ 6న మరో కీలక సర్క్యులర్‌ జారీ చేసింది. దీని ప్రకారం వర్చువల్‌ కరెన్సీ లావాదేవీలు జరిపే ఎవరికీ సర్వీసులు అందించరాదంటూ తన పరిధిలో పనిచేసే బ్యాంకులు, ఆర్థిక సంస్థలను ఆదేశించింది. దీంతో క్రిప్టోకరెన్సీలపై నిషేధం విధించినట్లయింది. దీన్ని సవాలు చేస్తూ 2018 జూలై 3న ఐఎంఏఐ.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎకానమీపై క్రిప్టోకరెన్సీల ప్రభావాల గురించి గతంలో అధ్యయనాలేమీ జరగలేదని, కేవలం నైతికత ప్రాతిపదికగా ఆర్‌బీఐ వీటిని నిషేధించిందని వాదించింది. అయితే, ఆర్‌బీఐ సర్క్యులర్‌పై స్టే విధించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా ఆర్‌బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ, కేంద్ర సమాచార..సాంకేతిక శాఖను ఆదేశించింది. ఈ కేసులోనే తాజా తీర్పునిచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement