చుక్కలు చూపిస్తున్న బిట్‌కాయిన్‌ | Virtual currency Bit coin | Sakshi
Sakshi News home page

చుక్కలు చూపిస్తున్న బిట్‌కాయిన్‌

Published Mon, Jun 19 2017 12:01 AM | Last Updated on Tue, Sep 5 2017 1:56 PM

చుక్కలు చూపిస్తున్న బిట్‌కాయిన్‌

చుక్కలు చూపిస్తున్న బిట్‌కాయిన్‌

ఒకే వారంలో 22 శాతం పతనం   ∙
3,017 డాలర్ల నుంచి 2,529 డాలర్లకు..


(సాక్షి బిజినెస్‌ విభాగం)
అంతర్జాతీయంగా ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రపంచంలో ఇటీవల పెద్ద సంచలనంగా మారిన వర్చువల్‌ కరెన్సీ (డిజిటల్‌ రూపంలో ఉండేది) బిట్‌ కాయిన్‌ ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తోంది. ఈ నెల 12న 3,017.78 డాలర్ల స్థాయికి వెళ్లిన బిట్‌ కాయిన్‌... మూడు రోజులు తిరిగేసరికి జూన్‌ 15న ఏకంగా  2,120 డాలర్ల కనిష్ట స్థాయికి చేరింది. కాకపోతే అదే రోజు 2,290 డాలర్ల వద్ద క్లోజయింది. మళ్లీ 16న... అంటే శుక్రవారం 2,529 డాలర్ల స్థాయికి చేరుకుంది. భారతీయ కరెన్సీలో ఈ వారం బిట్‌ కాయిన్‌ క్లోజింగ్‌ ధర రూ.1,57,732.14.  ఈ వారంలో మొత్తం మీద బిట్‌ కాయిన్‌ విలువ గత వారం క్లోజింగ్‌తో చూస్తే 22 శాతం పతనమైంది. డిసెంబర్‌ 2013 తర్వాత ఒకే వారంలో ఈ స్థాయిలో క్షీణించడం ఇదే. ఇక ఈ ఏడాది జనవరి నుంచీ చూస్తే మాత్రం ఇప్పటికి బిట్‌ కాయిన్‌ విలువ 137 శాతం పెరిగింది.

ఎందుకీ హెచ్చుతగ్గులు?
బిట్‌ కాయిన్‌కు సంబంధించి ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సంస్థ గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌... బేరిష్‌ రిపోర్ట్‌ జారీ చేసింది. కొన్నాళ్లు క్షీణత కొనసాగవచ్చని అంచనా వేసింది. మరోవంక చైనాకు చెందిన బిట్‌మెయిన్‌ కొత్త వెర్షన్‌ బిట్‌ కాయిన్‌ బ్లాక్‌ చెయిన్‌ ఏర్పాటుకు ప్రణాళికలు చేస్తోం దంటూ వార్తలు వెలువడ్డాయి. నిజానికిది వర్చువల్‌ కరెన్సీ. మరో బిట్‌కాయిన్‌ వెర్షన్‌ అంటే... దీని విలువ తరిగిపోతుంది కదా! అందుకని ఇన్వెస్టర్లు లాభాలకు దిగారు. ఇవే బిట్‌ కాయిన్‌ క్షీణతకు ప్రధాన కారణాలని చెబుతున్నారు.

 ఎనిమిదేళ్ల బిట్‌ కాయిన్‌ చరిత్రలో ఒకే రోజులో గరిష్టంగా 18% పెరగ్గా, 13% తగ్గిన చరిత్ర కూడా ఉంది. గోల్డ్‌ మ్యాన్‌ శాక్స్‌ రిపోర్టే కరెక్షన్‌కు కారణమని బిట్‌ మెక్స్‌ బిజినెస్‌ డెవలప్‌ మెంట్‌ మేనేజర్‌ జఫారీ పేర్కొన్నారు. స్వల్ప కాలానికి 3,134 డాలర్లు గరిష్ట స్థాయి, 2,330 డాలర్లు కనిష్ట స్థాయిల మధ్య కదలాడే అవకాశాలున్నాయని, స్టాప్‌ లాస్‌ 1,915 డాలర్లుగా పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత బిట్‌ కాయిన్‌ నెట్‌వర్క్‌లో ఎన్ని కావాలంటే అన్ని బిట్‌కాయిన్లు సృష్టించటానికి వీల్లేదు.

 గరిష్ఠంగా 2,099 కోట్ల బిట్‌కాయిన్లను మాత్రమే సృష్టించగలరు. వీటిలో 72% ఇప్పటికే చలామణిలో ఉన్నాయి కూడా. అయితే ఒక్కో బిట్‌ కాయిన్‌ను కోటి భాగాలుగా విభజించొచ్చు. కోటి భాగంగా ఉండే బిట్‌కాయిన్‌ను ‘సతోషి’ పేరిట చలామణి చేస్తున్నారు. అంటే... కోటి సతోషిలు ఒక బిట్‌కాయిన్‌ అన్న మాట. ఈ దృష్ట్యా బిట్‌కాయిన్‌ రేటు పెరుగుతుండటంతో... దీనికి పరిష్కారంగా కొత్త వెర్షన్‌ బిట్‌ కాయిన్‌ సృష్టించే ఆలోచనలో చైనా బిట్‌ మెయిన్‌ ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement