సాక్షి, బనశంకరి(కర్ణాటక): రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న బిట్‌కాయిన్ కుంభకోణంలో సొంత పార్టీ నేతలే విపక్షాలకు సమాచారం చేరవేస్తున్నారని బీజేపీ పెద్దల్లో అనుమానం ఏర్పడింది. దీంతో ఇద్దరు మంత్రుల కదలికలపై కేంద్ర బీజేపీ నేతలు ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రభుత్వాన్ని, పార్టీని నడిపించాల్సిన కొందరు మంత్రులే ప్రతిపక్షాలతో కుమ్మక్కైనట్లు బీజేపీ సందేహిస్తోంది.
హైకమాండ్‌కు సీఎం మొర
బిట్‌కాయిన్‌పై ఆ ఇద్దరే ప్రతిపక్ష నేతలకు లీక్‌లు ఇస్తున్నారని సీఎం బసవరాజబొమ్మై పార్టీ అధినేత జేపీ.నడ్డా, హోం మంత్రి అమిత్‌షా కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిని తీవ్రంగా పరిగణించిన హై కమాండ్ ఇద్దరు మంత్రుల కదలికలపై నిఘాపెట్టడానికి రహస్య బృందాన్ని బెంగళూరుకు పంపించినట్లు తెలిసింది.
బిట్‌కాయిన్ స్కాంలో ఎవరెవరి భాగస్వామ్యం ఉందనే సమాచారాన్ని విపక్షాలకు లీక్ చేస్తున్నారని గుసగుసలున్నాయి. ఇటీవల హానగల్ ఉప ఎన్నిక సమయంలో విపక్షనేత సిద్దరామయ్య ఈ కేసును ట్విట్టర్ ద్వారా లేవనెత్తాక పెను దుమారం మొదలైంది. సీఎం బొమ్మై ఢిల్లీ పర్యటనలో మంత్రుల నిర్వాకంపై హైకమాండ్ ముందు వాపోయారు. తనకు మంత్రుల మద్దతు దొరకడం లేదని ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment