ముంబై: బిట్ కాయిన్ వంటి వర్చువల్ కరెన్సీలతో లావాదేవీలు జరిపే సంస్థలతో సంబంధాలను తక్షణం తెంచుకోవాలని బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీ, చెల్లింపు సేవల సంస్థలను ఆర్‌బీఐ ఆదేశించింది. ఈ ఆదేశాలు అన్ని వాణిజ్య, సహకార, చెల్లింపు బ్యాంక్‌లకు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లకు కూడా వర్తిస్తాయని పేర్కొంది.
వర్చువల్ కరెన్సీలతో రిస్క్ పొంచి ఉన్నదని హెచ్చరించిన మరుసటి రోజే ఆర్‌బీఐ ఈ ఆదేశాలు జారీ చేయడం విశేషం. కాగా క్రిప్టో కరెన్సీలు చట్టబద్ధం కావని, వీటి వినియోగాన్ని తొలగించాలని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, సిటి తదితర బ్యాంక్‌లు, సంస్థలు క్రిప్టోకరెన్సీల సంబంధిత లావాదేవీలను నిలిపేశాయి. దీంతో వాటి ట్రేడింగ్ దాదాపు 90 శాతం తగ్గిపోయింది.
పేమెంట్ సంస్థలు డేటాను ఇక్కడే స్టోర్ చేయాలి..
రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) తాజాగా ఎండ్–టు–ఎండ్ ట్రాన్సాక్షన్స్ వివరాలు సహా యూజర్ల నుంచి సేకరించిన మొత్తం డేటాను భారత్‌లోనే స్టోర్ చేయాలని పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లను ఆదేశించింది. యూజర్ల సమాచారానికి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
డేటా స్టోరేజ్ సంబంధిత తాజా ఆదేశాలను పేమెంట్ సంస్థలు ఆరు నెలల్లోగా అమలు చేయాలని ఆర్‌బీఐ ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది. పేమెంట్ ప్రొవైడర్లందరూ పేమెంట్స్ సంబంధిత డేటాను భారత్‌లో స్టోర్ చేయడం లేదని తెలిపింది. ఆర్‌బీఐ నోటిఫికేషన్‌పై మొబిక్విక్ ఫౌండర్ బిపిన్ ప్రీత్ సింగ్ స్పందిస్తూ.. తమ సంస్థ వద్ద ఉన్న మొత్తం డేటాను ఇండియాలోనే స్టోర్ చేశామని తెలిపారు.
సాధారణంగా యూనిఫైడ్ సిస్టమ్స్‌ను కలిగిన, ఒకే అప్లికేషన్ సర్వర్లతో గ్లోబల్‌గా కార్యకలాపాలు నిర్వహించే విదేశీ కంపెనీలు భారత్‌లో ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు కొద్దిగా కష్టమౌతుందని పేయూ ఇండియా ఎండీ జితేంద్ర గుప్తా పేర్కొన్నారు. కాగా ఫేస్‌బుక్ డేటా లీక్ అంశంతో యూజర్ల డేటా భద్రత ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
బ్యాంకుల నగదు రవాణాపై కఠిన నిబంధనలు
బ్యాంకులు నగదు రవాణా సేవలను అవుట్‌సోర్స్ ఏజెన్సీలకు అప్పగిస్తున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను ఆర్‌బీఐ కఠినతరం చేసింది. బ్యాంకులకు ఈ సేవలు అందించే సంస్థల నెట్‌వర్త్ కనీసం రూ.100 కోట్లు ఉండి, నగదు రవాణాకు అనువైన 300 వ్యాన్లను కలిగి ఉండాలని స్పష్టం చేసింది.
ఆయా సేవల ఏజెన్సీల వద్ద ఉండే నగదు బ్యాంకుల ఆస్తియేనని, అందుకు సంబంధించి ఎదురయ్యే ఏ సమస్య అయినా బ్యాంకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది. నగదును తరలించే వ్యాన్లకు జీపీఎస్ ట్రాకింగ్ ఉండాలని, రాత్రి వేళల్లో తరలింపునకు దూరంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతమున్న అవుట్‌సోర్సింగ్ ఒప్పందాలను సమీక్షించి నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా 90 రోజుల్లోపు వాటిలో మార్పులు చేసుకోవాలని ఆర్‌బీఐ ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment