బీజేపీ విజయంతో సంస్కరణలకు బూస్ట్
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించడాన్ని కార్పొరేట్ ఇండియా స్వాగతించింది. రానున్నరోజుల్లో కేంద్రంలోని మోదీ సర్కారు ఆర్థిక సంస్కరణలను మరింత ముందుకు తీసుకెళ్లడంలో తాజా ఎన్నికల ఫలితాలు దోహదం చేస్తాయని పారిశ్రామిక మండళ్లు వ్యాఖ్యానించాయి. ఇరు రాష్ట్రాల్లో బీజేపీ పైచేయితో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరింత బలపడనుందని... దీనివల్ల వస్తు-సేవల పన్ను(జీఎస్‌టీ), సబ్సిడీ యంత్రాంగాన్ని మెరుగుపరచడం, కార్మిక చట్టాల్లో సరళీకరణ వంటి కీలక సంస్కరణలకు మోక్షం లభించవచ్చని అసోచామ్ ఒక ప్రకటనలో పేర్కొంది.
రాజ్యసభలో కూడా బీజేపీ పట్టు పెరిగేందుకు తాజా ఎన్నికల ఫలితాలు తోడ్పడనున్నట్లు తెలిపింది. ఆర్థికపరమైన చట్టాలకు ఆమోదం పొందడానికి ఈ పరి ణామం కీలకంగా మారనుందని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ పేర్కొన్నారు. ఉపాధి కల్పన, వృద్ధి పెంపునకు వీలుగా పారిశ్రామిక రంగంపై కొత్త సర్కారులు దృష్టిపెట్టాల్సి ఉందని పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ శరద్ జైపూరియా వ్యాఖ్యానించారు.