బ్లాక్ & వైట్
‘నల్ల’ రాకాసికి తెల్లరంగు వేసే మార్గాలెన్నో!
పెద్ద నోట్ల రద్దు కష్టాలు సామాన్యులకే..
►దర్జాగా దందా నడిపిస్తున్న నల్లకుబేరులు
►కోట్లకు కోట్లు మార్చుకుంటున్న అక్రమార్కులు
►ఇప్పటివరకు పట్టుబడిన నల్లడబ్బులో రూ. 400 కోట్లు కొత్త నోట్లే
‘నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడం ఎలా?’ నోట్ల రద్దు
ప్రకటన అనంతరం గూగుల్‌లో భారత్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన అంశమిది. అందులో అగ్రస్థానంలో ఉన్నది ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్. ఆ తర్వాతి స్థానాల్లో.. మహారాష్ట్ర, హరియాణా, పంజాబ్, ఢిల్లీలు ఉన్నాయి. ఇప్పటిదాకా ఏయే మార్గాల్లో నల్లధనాన్ని ‘తెల్ల’గా మార్చారో ఓసారి చూద్దాం...
(సాక్షి నాలెడ్జ్‌సెంటర్) : శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు – అనే మన సామెత ఊరకే పుట్టలేదు. ‘నల్లధనాన్ని, అవినీతిని ఊడ్చిపారేస్తా’నంటూ మోదీ సర్కారు పెద్ద నోట్లను రద్దుచేశారు. దీంతో అమాయకులైన సామాన్యులు నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల ముందు బారులు తీరుతున్నారు. ఒక్క కొత్త నోటు కోసం రోజూ గంటల తరబడి కిలోమీటర్ల క్యూల్లో నిలువుకాళ్లపై నిలుచుంటున్నారు. ఈ క్రమంలో అల్పజీవులు ప్రాణాలూ కోల్పోతున్నారు. కానీ.. ఒక్క అక్రమార్కుడూ ఆ క్యూల్లో కనిపించడు. ఒక్క అవినీతి పరుడూ నోట్ల రద్దుకు వెరవలేదు. తమ నల్లరాశులను దొడ్డిదారుల్లో దర్జాగా మార్పిడి చేసుకుంటున్నారు. అందుకు అనేక మార్గాలను కనుగొంటున్నారు. వారికి బ్యాంకు అధికారులు, పోలీసుల నుంచీ కావలసినంత సాయం లభిస్తోంది. దేశవ్యాప్తంగా ఆదాయ పన్ను శాఖ, సీబీఐ, పోలీసు అధికారుల దాడుల్లో కట్టల కొద్దీ బయటపడుతున్న నల్లధనంలో కొత్త నోట్ల వాటా భారీగానే కనిపిస్తోంది.
అనేక ఆంక్షలతో పరిమితంగా విడుదల చేసిన కొత్త నోట్లు అనతికాలంలో నల్లకుబేరుల భోషాణాలకు కోట్లల్లో చేరడం విస్తుగొలుపుతోంది. నోట్లు రద్దు చేసిన నవంబర్ 8వ తేదీ తర్వాత డిసెంబర్ 19వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా 677 దాడులు నిర్వహించారు. పాత, కొత్త నోట్లు, బంగారం అన్నీ కలిపి దాదాపు రూ. 3,185 కోట్ల విలువైన లెక్కలో లేని ఆదాయం (నల్లధనం) దొరికిందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇలా చిక్కిన నల్లధనంలో రూ. 400 కోట్లు కొత్త నోట్లే ఉన్నాయని అంచనా. అయితే.. ప్రభుత్వ వర్గాలు మాత్రం కొత్త నోట్ల మొత్తం రూ. 86 కోట్లుగా లెక్కిస్తున్నాయి. ఏదేమైనా.. ఈ దాడుల్లో దొరుకుతున్న కొత్త నోట్లను చూస్తే.. పెద్ద నోట్ల రద్దు అనంతరం నల్లధనం భారీ స్థాయిలోనే రూపు మార్చుకుందని నిపుణులు చెప్తున్నారు. అయితే.. మొత్తంగా ఎంత నల్లధనం రంగు మారివుంటుందన్నది మాత్రం అంచనా వేయలేకపోతున్నారు.
హుండీల్లో ‘గుప్త’ దానం..
దేవుడి గుళ్లలోని హుండీల్లో రహస్యంగా దానం చేయడం ఒక మార్గం. వెండి, బంగారం, పాత నోట్లను ఈ హుండీల్లో పెద్ద ఎత్తున సమర్పించారు. హుండీల్లో డబ్బుకు ఎలాంటి పన్నూ ఉండదు. దీంతో పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశవ్యాప్తంగా దేవాలయాల ఆదాయం ఒక్కసారిగా పెరిగిపోయింది. నవంబర్ 8వ తేదీ తర్వాత పది రోజుల్లో తిరుమలలో హుండీ విరాళాలు రూ.30.36 కోట్లు వచ్చాయి. గత ఏడాది అదే పది రోజులకన్నా రూ.8 కోట్లు పెరిగింది. ముంబైలోని సిద్దివినాయక ఆలయంలో ఆదాయం రెట్టింపయింది. కేరళలోని శబరిమల ఆలయంలో గతేడాది ఇదే కాలానికన్నా రూ.2 కోట్లు అధికంగా రూ.13 కోట్ల ఆదాయం వచ్చింది. వెల్లూరులోని జలకంఠేశ్వరాలయానికి సాధారణంగా రూ.10 వేల చొప్పున విరాళాలు లభిస్తాయి. నోట్ల రద్దు అనంతరం హుండీలో రూ.500, రూ.1000 నోట్ల కట్టల రూపంలో రూ.44 లక్షలు ప్రత్యక్షమయ్యాయి. హుండీలో పడే ఈ నల్లధనాన్ని ఆలయాల నిర్వాహకులు గుప్త దానాలుగా చూపిస్తాయి. వాటిని కొత్త కరెన్సీ నోట్లలోకి మార్చుకుంటాయి. అందులో కొంత మొత్తాన్ని కమీషన్‌గా ఉంచుకుని.. మిగతా మొత్తాన్ని సంబంధిత ‘గుప్తదాత’కు తిరిగి ఇచ్చేస్తాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా చోట్ల ఈ హుండీ దందా నడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కార్మికులను క్యూల్లో నిల్చోబెట్టి..
పంజాబ్‌లోని లూధియానాలో బజాజ్ అండ్ సన్స్ అనే ఆటోమొబైల్ విడిభాగాల తయారీ సంస్థ యజమాని వద్ద రూ.1.2 కోట్ల నల్లడబ్బు దొరికింది. అందులో రూ.72 లక్షలు కొత్త నోట్లు. తన సంస్థలో పనిచేసే కార్మికులను బ్యాంకులకు పంపించి, వారి పేర్లతో పాత నోట్లను మార్చినట్లు ఆ సంస్థ యజమాని ఎస్.బజాజ్ వెల్లడించినట్లు చెప్తున్నారు. దినసరి వేతన కార్మికులకు రోజువారీ కూలీ చెల్లించి ఇలా క్యూల్లో నిల్చోబెట్టి పాత నల్ల నోట్లను మార్చుకున్న ఉదంతాలు కోకొల్ల లుగా ఉన్నాయి.
వ్యాపారుల ‘చేతి’లో డబ్బు..
నిర్మాణ రంగం, ఆటోమొబైల్ రంగం వంటి చాలా వ్యాపార సంస్థలకు రోజువారీ లావాదేవీల కోసం డబ్బు రూపంలో పెద్ద మొత్తాలను ఉంచుకునే వెసులుబాటు ఉంది. వాటికి నగదు రూపంలో చెల్లింపులు భారీగా వస్తుంటాయి. ఇటువంటి సంస్థలు.. రద్దయిన నోట్ల రూపంలోని నల్లధనాన్ని తీసుకుని ‘చేతిలో డబ్బు’పేరుతో బ్యాంకుల్లో జమచేస్తున్నాయి. ఇలా మార్పిడి చేసినందుకు 20 నుంచి 40 శాతం కమీషన్ తీసుకుంటున్నాయి. ఇలాంటి సంస్థలు తమ త్రైమాసిక పద్దులను సమర్పించడానికి డిసెంబర్ 30 వరకూ సమయముంది. కాబట్టి అలాంటి సంస్థలు తమ పద్దులను ‘సరి’చేసుకోవడానికి ఇంకా ఐదు రోజుల సమయముంది.
ఎన్నికల్లో పంపిణీ..
మహారాష్ట్రలో ఇటీవల 147 పురపాలక సంఘాలకు జరిగిన ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు.. పాత నోట్ల రూపంలో ఉన్న నల్లధనాన్ని ఓట్ల కొనుగోలుకు పెద్ద ఎత్తున పంపిణీ చేశారు. ఒక్కో ఓటుకు రూ.2,000 నుంచి రూ.2,500 వరకూ పంచారు. ఈ నోట్లు అందుకున్న వారు వాటిని తమ తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకున్నారు.
బ్యాంకుల నుంచే నేరుగా..
నల్లధనాన్ని తెల్లగా మార్చడం లో జాతీయ బ్యాం కులు, సహకార బ్యాంకుల పాత్ర కూడా ఉంది. రాజస్తాన్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీ ర్ అండ్ జైపూర్ దౌసా బ్రాంచిలో నకిలీ ఐడీ కార్డు లు ఉపయోగించి రూ.కోటి మేరకు పాత నోట్లను కొత్త నోట్లుగా మార్చిన ఆరోపణలతో బ్యాంక్ హెడ్ క్యాషియర్‌ను నవంబర్ 30న సస్పెండ్ చేశారు. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా ఉద్గిర్‌లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉద్యోగులు నలుగురు 30 శాతం కమీషన్ తీసుకుని.. ఇతర వినియోగదారుల ఖాతాల్లో లెక్కరాసి.. రూ. 20 లక్షల విలువైన పాత నోట్లను కొత్త నోట్లుగా మార్చారు. ప్రైవేట్ కార్పొరేట్ బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంకు నోయిడా బ్రాంచిలో నకిలీ సంస్థల డైరెక్టర్ల పేర్లతో 20 బ్యాంకు ఖాతాలను తెరిచి రూ. 60 కోట్ల నల్లధనాన్ని డిపాజిట్ చేసినట్లు, చాందినీ చౌక్ (ఢిల్లీ) బ్రాంచిలో 44 నకిలీ ఖాతాలు తెరిచి రూ.100 కోట్ల మేర డిపాజిట్ చేసినట్లు ఐటీ దాడుల్లో వెలుగుచూడటం సంచలనం సృష్టించింది. ఇక రాజకీయ నియంత్రణలో ఉండే సహకార బ్యాంకుల్లో పాత నోట్ల డిపాజిట్లు అమాంతం పెరిగిపోయాయి. ఈ బ్యాంకుల్లో ఖాతాదారుల పూర్తి వివరాలు నమోదు చేసేదే తక్కువ. పశ్చిమబెంగాల్ లోని రాణిగంజ్‌లో ఒక సహకార బ్యాంకులో పది రోజుల్లోనే రూ.42 కోట్లు డిపాజిట్ అయ్యాయి. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో రూ.47 కోట్లు ఎలాంటి ఆధారం లేకుండా మార్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డి వద్ద దొరికిన రూ.100 కోట్ల నల్లధనంలో రూ.10 కోట్లు కొత్త కరెన్సీ నోట్లే. అవి నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక బ్యాంకు నుంచే అతనికి అందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలోని కోటక్ మహీంద్రా బ్యాంక్ కస్తూర్బా గాంధీ మార్గ్ బ్రాంచిలోనూ అక్రమ లావాదేవీల ఆరోపణలపై ఐటీ దాడులు నిర్వహించింది.
బంగారంలోకి మార్పిడి..
నోట్ల రద్దు ప్రకటన వెలువడిన రోజు రాత్రి హైదరాబాద్ సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో బంగారం కొనుగోళ్లు, అమ్మకాలు పెద్ద ఎత్తున సాగాయి. నగల దుకాణాల్లో పాత నోట్లను తీసుకుని.. పాత తేదీలతో విక్రయాలు జరిపినట్లు పద్దులు రాసేశారు. అయితే.. మార్కెట్ రేటుకన్నా అధికంగా రేట్లు తీసుకున్నారు. ఉదాహరణకు.. ఒక వ్యాపారి 5,000 మంది కస్టమర్లు ఒక్కొక్కరూ 5 లక్షల బంగారం కొనేందుకు రూ. 2 లక్షల చొప్పున అడ్వాన్సులు ఇచ్చారని లెక్క రాసి రూ. 100 కోట్ల మేర పాత నోట్లను చిన్న మొత్తాలుగా బ్యాంకుల్లో జమ చేస్తారు. రాజస్తాన్‌లో రశీదులు లేకుండా వ్యాపారం చేసే కొందరు నగల వ్యాపారులు ఇలాంటి నల్లకుబేరులకు నకిలీ బంగారాన్ని అంటగట్టిన ఉదంతాలూ వెలుగుచూశాయి. ఢిల్లీలోని బంగారం మార్కెట్‌పై ఐటీ విభాగం తాజాగా నిర్వహించిన సోదాల్లో రూ. 250 కోట్ల విలువైన బంగారం విక్రయాలు అక్రమంగా సాగినట్లు గుర్తించారు.
677
నవంబర్ 8 నుంచి
డిసెంబర్ 19 వరకూ ఐటీ,
పోలీస్, సీబీఐ తదితర సంస్థలు చేసిన దాడులు
రూ.3,185 కోట్లు
ఈ దాడుల్లో స్వాధీనం
చేసుకున్న లెక్కలో లేని నగదు, బంగారం
రూ.400 కోట్లు
ఇప్పటి వరకు స్వాధీనం
చేసుకున్న కొత్త నోట్ల విలువ
ఇంకా ఎన్నెన్ని దారులో..
రాజకీయ పార్టీలు నల్లధనాన్ని పాత తేదీలతో విరాళాలుగా రాసేసి బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. పోస్టాఫీసుల్లో తప్పుడు ధ్రువపత్రాలతో భారీగా పాత నోట్లను మార్చిన ఉదంతాలు చాలా వెలుగుచూశాయి. ఆర్‌టీసీ బస్సుల్లో వచ్చే చిన్న నోట్లు, చిల్లర స్థానంలో రద్దయిన పెద్ద నోట్లు పెట్టేసి లెక్కలు రాసిన ఉదంతాలూ ఉన్నాయి. ఇక చాలా మంది ఛోటా మోటా నల్లకుబేరులు తమ బంధువులు, స్నేహితుల బంగారు రుణాలు, బ్యాంకు అప్పులను పాత నోట్లతో తీర్చేసి.. ప్రామిసరీ నోట్లు రాయించుకున్నారు. ఇంకొందరు పాత నోట్లను కొత్తగా తక్కువ వడ్డీకి అప్పులు ఇచ్చి జాగ్రత్తపడ్డారు. ఇలా అనేకానేక మార్గాల్లో నల్లధనం తెల్లగా మారిపోతోంది.
కాలేజీలే ఫీజులు కట్టేశాయ్..
ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులను అందించే ప్రొఫెషనల్ విద్యా సంస్థలు కొన్ని.. డొనేషన్ల రూపంలోని నల్లధనాన్ని మార్చుకునేందుకు విద్యార్థులు తమకు నగదు రూపంలో ఫీజులు చెల్లించినట్లు పద్దుల్లో పాత తేదీలతో లెక్కలు రాసి, బ్యాంకుల్లో డిపాజిట్ చేశాయి. కానీ.. తమ పేరుతో ఇలా ఫీజులు కట్టిన విషయం విద్యార్థులకు తెలియదు. అంతేకాదు కాలేజీ యాజమాన్యాలు తమ సంస్థల్లో పనిచేసే లెక్చరర్లు, ఉద్యోగులకు నాలుగైదు నెలల జీతాలను ముందుగానే పాత నోట్లతో చెల్లించిన ఉదంతాలూ బయటపడ్డాయి.
పెట్రోలు, మందుల షాపుల్లో జమ
పాత నోట్ల చెల్లుబాటును అనుమతించిన పెట్రోల్ బంకులు, ఆస్పత్రులు, మందుల షాపులు, టోల్‌గేట్లను సైతం నల్లధనం మార్పిడికి వినియోగించుకున్నారు. ఆయా దుకాణాల్లో కొనుగోళ్ల కోసం, ఆస్పత్రుల్లో చికిత్స కోసం చెల్లించిన కొత్త నోట్లు, రూ.100 నోట్లు, అంతకన్నా చిన్న నోట్లను ఉంచేసుకుని.. ఆ స్థానంలో రద్దయిన నోట్లను పెట్టేసి బ్యాంకుల్లో జమ చేసే అవకాశం చాలా మందికి లాభించింది.
అద్దె చెల్లింపులతో..
కోల్‌కతాలో చాలా మంది తమ ఇళ్లకు ఆరేడు నెలల నుంచి మూడేళ్ల వరకూ అద్దెను ముందుగానే పాత నోట్లతో చెల్లించేశారు. నెలకు రూ.10 వేలు అద్దె ఉంటే.. దానిని రూ.50 వేలుగా చూపుతూ మూడేళ్ల పాటు ఆ అద్దె కింద రూ.18 లక్షలు కట్టేశారు. అలా నల్లధనాన్ని తెల్లగా మార్చుకున్నారు. దీనికి పలువురు చార్టర్డ్ అకౌంటెంట్లు సహకారాలు అందించారు.
కార్ల కొనుగోళ్లలో..
బ్రోకర్ల ద్వారా పాత కార్ల కొనుగోలు ఒక్కసారిగా పెరిగిపోయింది. కొందరు ఐదారు పాత కార్లను బుక్ చేసుకుని.. ఒక్కో దానికి రూ.2 లక్షల వరకూ అడ్వాన్సు చెల్లించారు. బ్రోకర్లు పాత డేట్లతో బిల్లులు ఇచ్చి, ఒక్కో డీల్‌కు 10 శాతం కమీషన్ తీసుకున్నారు.
బకాయిల చెల్లింపులు..
నోట్ల రద్దు నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, కార్పొరేట్ బకాయిల చెల్లింపులూ భారీగా పెరిగిపోయాయి. ఆస్తి పన్ను, కరెంటు బిల్లు, నీటి బిల్లు వంటి బకాయిలన్నింటినీ పాత నోట్లతో కట్టేందుకు అన్ని రకాల ప్రభుత్వ సంస్థలూ అవకాశం ఇవ్వడంతో నల్ల డబ్బును ఈ చెల్లింపుల కోసం వినియోగించారు.
ముందస్తు వేతనాలు..
నగదు రూపంలో వేతనాలు చెల్లించే చాలా చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో.. యజమానులు నవంబర్, డిసెంబర్‌లతో పాటు మూడు, నాలుగు నెలల జీతాలను రద్దయిన నోట్ల రూపంలో ముందుగానే చెల్లించిన ఉదంతాలు ఉన్నాయి.