ముంబై: కెనడాకు చెందిన బంబార్డియర్ దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ల మధ్య భారీ ఒప్పందం కుదిరింది. సుమారు రూ.10,900 కోట్ల విలువైన 50 టర్బో ప్రాప్ జెట్స్ విమానాలను బంబార్డియర్ సరఫరా చేయనుంది. తొలుత 25 విమానాలను స్పైస్‌జెట్ కొనుగోలు చేస్తుండగా, మరో 25 విమానాలను కొనుగోలు చేసే హక్కులను కలిగి ఉంటుంది. వీటి సరఫరా అనంతరం 90 సీట్ల టర్బో ప్రాప్ విమానాలను నడిపే ప్రపంచంలో తొలి విమానయాన సంస్థగా స్పైస్‌జెట్ నిలుస్తుంది.
అయితే, ఇందుకు నియంత్రణ సంస్థల ధ్రువీకరణ రావాల్సి ఉందని బంబార్డియర్ తెలిపింది. 50 బంబార్డియర్ క్యూ400 విమానాలను కొనుగోలు చేయనున్నట్టు స్పైస్‌జెట్ చీఫ్ అజయ్‌సింగ్ గతంలో పారిస్ ఎయిర్‌షో సందర్భంగా ప్రకటించడం తెలిసిందే. స్పైస్‌జెట్‌తో ఒప్పందం కుదిరినందుకు గర్వంగా ఉందని, ఈ ఆర్డర్‌తో వేగంగా వృద్ధి చెందుతున్న బారత మార్కెట్‌లో క్యూ400 విమానాల ప్రాతినిధ్యం పెరగనుందని బంబార్డియర్ వాణిజ్య విమానాల ప్రెసిడెంట్ ఫ్రెడ్ క్రోమర్ వ్యాఖ్యానించారు.
90 మంది ప్రయాణించే మోడల్‌ను కూడా విడుదల చేయనున్నామని చెప్పారు. ప్రస్తుతానికి స్పైస్‌జెట్ నిర్వహణలో 78 సీట్ల సామర్థ్యంగల క్యు400 మోడల్ విమానాలు 20 ఉన్నాయి. వీటితోపాటు బోయింగ్ 737 మోడల్ విమానాలు 35 వరకు ఉన్నా యి. తాజా కొనుగోలు ఆర్డర్ ప్రాంతీయ మార్గాల్లో అనుసంధానత పెంచేందుకు దోహదపడుతుందని స్పైస్‌జెట్ చైర్మన్, ఎండీ అజయ్‌సింగ్ పేర్కొన్నారు.