
ఏప్రిల్ 1 నుంచి వాహన బీమా ప్రియం
50 శాతం వరకూ ప్రీమియం పెంచేందుకు ఐఆర్‌డీఏ ప్రతిపాదన
న్యూఢిల్లీ: వాహన యజమానులపై బీమా బాదుడుకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 1 నుంచి వాహన బీమా ప్రీమియంను 50 శాతం వరకూ పెంచాలని నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏ ప్రతిపాదించింది. ప్రీమియం కార్లు, మోటారు సైకిళ్లు, వాణిజ్య వాహనాలన్నింటికీ ఇది వర్తిస్తుంది. అయితే, చిన్న కార్లకు (ఇంజిన్ సామర్థ్యం 1,000 సీసీ వరకూ) మాత్రం థర్డ్‌పార్టీ బీమా ప్రీమియం విషయంలో పెంపు నుంచి మినహాయింపునిచ్చారు. ప్రస్తుతం ఉన్న ప్రీమియం రేటు 2,055 కొనసాగుతుంది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐఆర్‌డీఏ ఈ ప్రతిపాదనల ముసాయిదాను విడుదల చేసింది. దీనిపై వివిధ పక్షాలు తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు ఈ నెల 18 వరకూ గడువు ఇచ్చింది. వివరాలు ఇవీ...
మధ్య స్థాయి కార్లు(1,000 సీసీ నుంచి 1,500 సీసీ), పెద్ద కార్లతో పాటు ఎస్‌యూవీలకు సంబంధించి బీమా ప్రీమియం 50 శాతం పెరుగుతుంది. 1,000 సీసీ వరకూ ఉన్న కార్లకు ప్రీమియం రూ.3,345కు చేరుతుంది. పెద్ద కార్లకైతే రూ.9,246 కట్టాల్సి ఉంటుంది.
75 సీసీ వరకూ ఇంజిన్ సామర్థ్యం ఉన్న ద్విచక్ర వాహనాల బీమా ప్రీమియంలో ఎలాంటి మార్పులు లేవు. 77 –150 సీసీ బైక్‌లు, స్కూటర్లు, 150–350 సీసీ కేటగిరీలోని పెద్ద బైక్‌ల ప్రీమియం పెరుగుతుంది. ఇక స్పోర్ట్స్, సూపర్ స్పోర్ట్స్ బైక్స్(350 సీసీపైన) ప్రీమియం 50 శాతం వరకూ(రూ.796 నుంచి రూ.1,194కు) పెరుగుతుంది.
ఇక సరుకు రవాణా వాహనాల విషయంలో కూడా వివిధ కేటగిరీల్లో బీమా ప్రీమియం 50 శాతం వరకూ ప్రియం అవుతుంది. ప్రీమియం ట్రాక్టర్లకు (6 హెచ్‌పీ వరకూ) బీమా ప్రీమియం ఇప్పుడున్న రూ.510 నుంచి రూ.765కు చేరుతుంది. అదేవిధంగా ఈ–రిక్షాలకు కూడా ప్రీమియం రేట్లను పెంచాలని ప్రతిపాదించింది.