
అంతర్జాతీయ న్యూయార్క్ మర్కెంటైల్ ఎక్స్చేంజి– నైమెక్స్‌లో పసిడి ఐదు వారాల పరుగుకు 19వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో కాస్త బ్రేక్ పడింది. ఔన్స్ (31.1గ్రా) ధర వారంలో దాదాపు నాలుగు డాలర్లు తగ్గి 1,331 డాలర్ల వద్ద ముగిసింది. అయితే వారంలో పసిడి 1,346 డాలర్ల గరిష్ట స్థాయిని తాకి అటు తర్వాత 1,326 డాలర్లకు కూడా పడింది. ఇకపై పసిడి దారి ఎటువైపు అన్న ప్రశ్నకు పలువురు విశ్లేషకుల నుంచి ‘బులిష్’ అనే మాటే వినిపిస్తోంది. డాలర్ ఇండెక్స్ బలహీన ధోరణిని వారు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.
డాలర్... మూడేళ్ల కనిష్టం
గత వారం ఒక దశలో 89.96 స్థాయిని (మూడేళ్ల కనిష్ట స్థాయి) కూడా చూసిన డాలర్ ఇండెక్స్ శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 90.49 వద్దకు చేరింది. 52 వారాల గరిష్టం చూస్తే... 102 డాలర్లపైన ఉన్న డాలర్ ఇండెక్స్ ఒడిదుడుకులతో ఏడాదిగా క్రమంగా పతనం అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ధోరణి కొనసాగితే, పసిడి బులిష్ ధోరణి కొనసాగుతుందన్నది నిపుణుల వాదన.
అమెరికాలో రాజకీయ, బడ్జెట్ సంబంధ అనిశ్చితి కొనసాగితే, డాలర్ మరింత పతనం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. కాబట్టి పసిడి ధర మున్ముందు పైకి కదిలే అవకాశాలే ఉన్నాయని శాక్కో బ్యాంక్‌లో కమోడిటీ వ్యూహ విభాగం చీఫ్‌గా వ్యవహరిస్తున్న ఓలీ హ్యాన్‌సన్ పేర్కొన్నారు. అయితే సోమవారం నుంచి ప్రారంభమయ్యే మార్కెట్‌లో కొంత లాభాల స్వీకరణకు అవకాశం ఉందని కూడా కొన్ని వర్గాలు భావిస్తున్నాయి.
దేశంలో ధరలు ఇలా...
ఇక దేశీయంగా ఎంసీఎక్స్‌లో పసిడి ఫ్యూచర్స్ ధర శుక్రవారంతో ముగిసిన వారంలో 10 గ్రాములకు స్వల్ప నష్టంతో రూ. 29,773 వద్ద ముగిసింది. ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్‌లో పసిడి 99.9 స్వచ్ఛత, 99.5 స్వచ్ఛత ధరలు 10 గ్రాములకు వరుసగా రూ.30,175, రూ.30,025 వద్ద ముగిశాయి. వెండి కేజీ ధర రూ. 38,885కు చేరింది. కాగా వారంలో రూపాయి విలువ 64.84 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment