వృద్ధికి సంబంధించి అంతర్జాతీయంగా నెలకొన్న ఆందోళనలు సమీప కాలంలో పసిడి డిమాండ్‌కు దోహదపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీర్ఘకాలిక పెట్టుబడులు, రాబడులపై మాత్రం సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికా–చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే సద్దుమణగని ధోరణి, డాలర్ బలహీన పరిస్థితి, అమెరికా వడ్డీరేట్ల పెంపుదలకు సంబంధించి స్వయంగా అధ్యక్షుడు ట్రంప్ నుంచే వస్తున్న వ్యతిరేకత, ఈక్విటీ మార్కెట్ల నష్టాలు వంటివి సమీప భవిష్యత్తులో బంగారం ధర పెరుగుదలకు దోహదపడతాయని వారి అభిప్రాయం.
అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యవంతమైన వృద్ధి బాటలోనే పయనిస్తున్నా... ఇంకా ఇబ్బందులు పొంచివున్నాయని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ పావెల్ డల్లాస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొనడం పసిడి కదలికకు సంబంధించి చర్చనీయాంశం అవుతోంది. అంతర్జాతీయ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్‌లో నైమెక్స్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర శుక్రవారంతో ముగిసిన వారంలో ఒకశాతం పెరిగి 1,223 డాలర్ల వద్ద ముగిసింది.
డాలర్ ఇండెక్స్ 96.31 వద్ద ముగిసింది. వచ్చేవారం అమెరికా హౌసింగ్ మార్కెట్ గణాంకాలు రాబోతుండటం పసిడి కదలికలను కొంతమేర నిర్దేశిస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వెళ్లడానికి సంబంధించిన అంశాలు కూడా ప్రపంచ ఆర్థిక పరిస్జితుల అనిశ్చితికి దారితీస్తున్న సంగతి గమనార్హం.
1,200 డాలర్ల వద్ద స్థిరం...
సమీప కాలంలో నైమెక్స్‌లో ధర 1,200 డాలర్ల స్థాయి కిందకు జారే అవకాశం లేదని, ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైనా వెంటనే ఆ పైకి చేరుకుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. 1,200 డాలర్లు పసిడికి ‘‘స్వీట్ స్టాప్’’ వంటిదని వారు అభిప్రాయపడుతున్నారు. ఆ లోపునకు ధర పడితే, ఉత్పత్తిదారులకు గిట్టుబాటు ధర లేక ఉత్పత్తి నిలిచిపోయే పరిస్థితి ఉత్పన్నం అవుతుందని, అదే జరిగితే మళ్లీ ధర 1,200 డాలర్ల ఎగువకు పెరగడం ఖాయమన్న వాదన వినబడుతోంది.
ఇక వీటన్నింటికీ తోడు కొన్ని దేశాల సెంట్రల్ బ్యాంకుల నుంచి కూడా పసిడి కొనుగోళ్లు జరుగుతున్న సంగతి గమనార్హం. అయితే 1,250 డాలర్ల స్థాయిలో పసిడికి గట్టి నిరోధం ఉందని, ఈ స్థాయి దాటితే అది సాంకేతికంగా పటిష్ట ధోరణిగానే భావించాలని, అయితే, తిరిగి బుల్లిష్ బాటలోకి ప్రవేశించడానికి 1,300 డాలర్లపైకి పసిడి కదలిక అవసరం అనీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఒక నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుందని వారి విశ్లేషణ.
దేశీయంగా స్థిర ధోరణి...
అంతర్జాతీయ మద్దతుకు తోడు దేశీయంగా డిమాండ్ పరిస్థితులు, డాలర్ మారకంలో రూపాయి బలహీన పరిస్థితి భారత్‌లో పసిడిని 10 గ్రాములకు రూ.30,000 పైనే నిలబెడుతున్నాయి. శుక్రవారంతో ముగిసిన వారంలో ముంబై స్పాట్ మార్కెట్‌లో 99.9, 99.5 స్వచ్ఛత ధరలు 10 గ్రాములకు వరుసగా రూ. 32,090, రూ. 30,560 వద్ద ముగిశాయి. వెండి కేజీ ధర రూ.40,000గా ఉంది. డాలర్ మారకంలో రూపాయి విలువ తీవ్ర ఒడిదుడుకులకు గురవుతోంది. శుక్రవారంతో ముగిసిన వారంలో అంతర్జాతీయ మార్కెట్‌లో 71.78 వద్ద ముగిసింది. ఇక దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో 10 గ్రాముల ధర రూ. 31,011 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment