అంతర్జాతీయంగా బంగారం ధర స్వల్పంగా తగ్గినా, భారత్‌లో మాత్రం పెరిగింది. దీనికి డాలర్ మారకంలో రూపాయి విలువ బలహీనత ప్రధాన కారణం. వివరాల్లోకి వెళితే.. పసిడి అంతర్జాతీయ మార్కెట్– నైమెక్స్‌లో శుక్రవారం (20వ తేదీ)తో ముగిసిన వారంలో ఔన్స్ (31.1గ్రా) 10 డాలర్లు తగ్గి, 1,337 డాలర్లకు చేరింది. వారం మధ్యలో ఒక దశలో 1,357 డాలర్ల గరిష్ట స్థాయిని చూసింది. వాణిజ్య యుద్ధ భయాలు, భౌగోళిక ఉద్రిక్తతలు, మరోదఫా ఫెడ్ ఫండ్ రేటు పెంపు ఊహాగానాలు, డాలర్ ఒడిదుడుకులు పసిడిపై ప్రభావం చూపాయి.
10 రోజుల క్రితం 1,369 డాలర్లను తాకి, కిందకు జారిన బాటలో 1,332 డాలర్ల వద్ద గట్టి మద్దతు లభించింది. తాజా పరిణామాలు పసిడి బుల్లిష్ ట్రెండ్‌లోనే కొనసాగుతుందనడానికి సూచికగా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం కొంతకాలం 1,270 –1,370 డాలర్ల మధ్య శ్రేణిలో కదలాడే అవకాశం ఉందని అంచనా. ఇక వారంలో డాలర్ ఇండెక్స్ స్వల్పంగా బలపడి 89.51 నుంచి 90.08కి చేరింది.
దేశీయంగా మూడు వారాల్లో రూ.1,300 పెరుగుదల
ఇక దేశీయంగా చూస్తే.. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజీ (ఎంసీఎక్స్)లో పసిడి ధర 10 గ్రాములకు 20వ తేదీతో ముగిసిన వారంలో రూ.314 ఎగసి, రూ.31,432కు చేరింది. రెండు వారాల్లో ఇక్కడ ధర దాదాపు రూ.1,300 ఎగిసింది. అంతర్జాతీయంగా ధర తగ్గినప్పటికీ, దేశీయంగా పెరుగుదలకు డాలర్ మారకంలో రూపాయి బలహీనపడటం కారణం.
అంతర్జాతీయంగా రూపాయి విలువ వారంలో 65.21 నుంచి 66.22కు పనతమైంది. ఒకదశలో 66.30పైకి క్షీణించడం గమనార్హం. ముంబై స్పాట్ మార్కెట్‌లో 99.9 స్వచ్ఛత, 99.5 స్వచ్ఛత ధరలు 20వ తేదీతో ముగిసిన వారంలో రూ.495 చొప్పున పెరిగి రూ.31,465, రూ.31,315 వద్ద ముగిశాయి. రెండు వారాల్లో పసిడి పెరుగుదల రూ.1,000. ఇక వెండి కేజీ ధర భారీగా రూ.1,680 ఎగసి రూ.40,160కి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment