సుస్థిరతకు భారత్ ఆవాసం
♦ అపార అవకాశాలున్నాయ్
♦ నిలకడగా వృద్ధి సాధనకు మరిన్ని చర్యలు అవసరం
♦ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్న ప్రస్తుత తరుణంలో భారతదేశం సుస్థిరతకు ఆవాసంగా నిలుస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. నిలకడగా వృద్ధి సాధించేందుకు భారత్ మరింతగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మంగళవారం సివిల్ అకౌంట్స్ డే-2016 కార్యక్రమంలో ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘‘అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు అసాధారణ స్థాయిలో ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. మార్కెట్లలో భయాలు నె లకొన్నాయి. రికవరీ మళ్లీ పట్టాలు తప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్ పెట్టాం. ఇలాంటి సమయంలో కూడా ఇండియా సుస్థిరతకు, అవకాశాలకు ఆవాసంగా నిలుస్తోంది’’ అని ఆయన వివరించారు.
దేశ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయని, ద్రవ్యోల్బణ కట్టడి.. ఆర్థిక స్థిరత్వ సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారాయన. ప్రపంచంలోనే అత్యధిక వృద్ధి సాధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటన్నారు. ఎగుమతుల బలహీనత, రెండేళ్లుగా వర్షాలు మెరుగ్గా లేకపోయినా భారత్ ఈ స్థాయిలో వృద్ధి సాధించడం గమనార్హమని చెప్పారు. అత్యంత కఠిన పరిస్థితుల్లోనూ దీన్ని నిలబెట్టుకోవడమనేది ప్రస్తుతం దేశం ముందున్న సవాల్ అని జైట్లీ చెప్పారు. ఇందుకోసం మెరుగైన ఆర్థిక నిర్వహణ అవసరమన్నారు. ప్రభుత్వ వ్యయాలను తగ్గించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు కమిటీని ఏర్పాటు చేశామని, అది ఇటీవలే నివేదిక ఇచ్చిందని తెలియజేశారు. పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.