సిమెంట్ ధరలను కృత్రిమంగా పెంచేశారు
♦ రాత్రికి రాత్రే 60–70 శాతం పెరిగిన ధరలు
♦ 50 కిలోల బస్తా రూ.310–340
♦ ధరల అదుపులో ప్రభుత్వం జోక్యం అవసరం: డెవలపర్ల జేఏసీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంట్ కంపెనీలన్నీ ఒక జట్టుగా ఏర్పడి.. 50 కిలోల సిమెంట్ బస్తా ధరను రాత్రికి రాత్రే 60–70 శాతం వరకూ పెంచేశాయని రాష్ట్ర నిర్మాణ సంఘాల జేఏసీ చైర్మన్ ఎస్.రాంరెడ్డి విమర్శించారు. మార్చిలో రూ.210–230 మధ్య ఉన్న ధరను కాస్తా.. కృత్రిమ కొరతను సృష్టించి ఒక్కసారిగా రూ.310–340కి చేర్చారని ఆరోపించారు. పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని లేకపోతే సిమెంట్ కొనుగోళ్లను నిలిపివేయటమో లేక సీసీఐకి (కాంపీటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా) ఫిర్యాదు చేయడమో చేస్తామని హెచ్చరించారు.
లక్షలాది మంది ఆధారపడ్డ నిర్మాణ రంగాన్ని నిర్వీర్యం చేస్తోన్న ఈ పెంపుదలపై ప్రభుత్వం జోక్యం కల్పించుకొని ధరలను తగ్గించాలని కోరారు. ‘‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో సిమెంట్ వార్షిక వినియోగం 22–24 మిలియన్ టన్నులుంటుంది. రెండు రాష్ట్రాల్లో 20కి పైగా సిమెంట్ తయారీ సంస్థలున్నాయి. దేశం మొత్తం సిమెంట్ ఉత్పత్తిలో 26 శాతం వాటా ఈ రెండు రాష్ట్రాలదే. అయినా సరే మన దగ్గరి కంటే మహారాష్ట్ర, కేరళ వంటి ఇతర రాష్ట్రాల్లోనే ధరలు తక్కువగా ఉండటం ఆశ్చర్యకరం’’ అన్నారాయన. సిమెంట్ ధరలతో ఇళ్ల ధరలు పెరగడమే కాకుండా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లు ఆలస్యమవుతాయని, ప్రత్యేకించి అందుబాటు గృహాలపై మరింత భారం పడుతుందని తెలియజేశారు. ‘‘సిమెంట్ ధరల ప్రభావం నిర్మాణ సంస్థల మీదే కాకుండా వ్యక్తిగతంగా ఇళ్లను నిర్మించుకునే వారి మీద కూడా పడుతుంది.
సిమెంట్ వినియోగంలో డెవలపర్లు, కాంట్రాక్టర్లు, ప్రభుత్వ ఏజెన్సీల వాటా 20–25 శాతవరకుంటే.. సామాన్యులది 70–75 శాతం వరకూ ఉంటుంది’’అని జేఏసీ కన్వినర్ జీ రాంరెడ్డి వివరించారు. భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్), తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా), బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ), తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్), తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ (టీడీఏ)లు కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)గా ఏర్పడ్డాయి. దీనికి చైర్మన్‌గా ఎస్ రాంరెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇందులో 600 మంది డెవలపర్లు, 1,000 మంది చిన్న, మధ్య తరహా కాంట్రాక్టర్లున్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కో–కన్వినర్లు ఎస్‌ఎన్ రెడ్డి, పీ రవిందర్ రావు, జీవీ రావు, జే వెంకట్ రెడ్డి, జనరల్ సెక్రటరీ పీ రామకృష్ణా రావు పాల్గొన్నారు.