క్రెడిట్‌పై రిటైలర్లకు సరుకులు! | call grasaris for credit retailers | Sakshi
Sakshi News home page

క్రెడిట్‌పై రిటైలర్లకు సరుకులు!

Published Sat, Feb 20 2016 12:58 AM | Last Updated on Mon, Aug 13 2018 8:03 PM

క్రెడిట్‌పై రిటైలర్లకు సరుకులు! - Sakshi

క్రెడిట్‌పై రిటైలర్లకు సరుకులు!

వినూత్న ఆలోచనతో కాల్‌గ్రాసరీస్ వ్యూహం
రిటైలర్లకు రూ. లక్ష సరుకుల కొనుగోలు చేసే అవకాశం
ఈ నెలాఖరులోగా వైజాగ్, కొచ్చిన్‌లకు విస్తరణ

 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్‌లైన్లో సరుకులు విక్రయించే సంస్థలకిపుడు కొదవలేదు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కాల్ గ్రాసరీస్ కూడా ఈ కోవలోదే. కాకపోతే దీనికో ప్రత్యేకత ఉంది. దేశంలోనే తొలిసారిగా ఇది సరుకుల్ని ‘అప్పు’ పద్ధతిలో ఇస్తోంది. ఇందుకోసం బ్యాంకులతో కలిసి క్రెడిట్ కార్డు జారీ చేస్తోంది కూడా. దీని వివరాలు సంస్థ ఎండీ విక్రమ్ చక్రవర్తి మాటల్లోనే...

రిటైలర్లు ఒకేసారి పెద్ద మొత్తంలో సరుకులు కొనుగోలు చేస్తారు. అందుకే హోల్‌సేలర్లు వారికి డబ్బులు చెల్లించడానికి కొంత సమయం ఇస్తారు. ఆన్‌లైన్‌కొచ్చేసరికి ఎవరైనాసరే అప్పటికప్పుడే డబ్బులు చెల్లించాలి. మేం ఈ పాయింట్‌పై ఫోకస్ చేశాం. ఇండస్ట్రియల్ సేల్స్ కింద రిటైలర్లకు లక్ష రూపాయల విలువ చేసే సరుకులు కొనేందుకు క్రెడిట్ కార్డ్ ఇస్తాం. వారు ఒకేసారి తమకు అవసరమైన సరుకులు ఈ కార్డుద్వారా కొంటారు. ఈ విధానంతో కాల్ గ్రాసరీకి, రిటైలర్లుకు, బ్యాంకుకు ముగ్గురికీ లాభమే. అదెలాగంటే.. కాల్ గ్రాసరీలో క్రెడిట్ కార్డుతో సరుకులు కొంటారు కనక రిటైలర్లుకు డబ్బులు చెల్లించడానికి 30-40 రోజుల సమయం ఉంటుంది. కాల్ గ్రాసరీకు అమ్మకాలు పెరుగుతాయి. వ్యాపారులకు ఒకేసారి లక్ష రూపాయల ఇన్వెంటరీ వస్తుంది. అటు బ్యాంకులకు కాల్ గ్రాసరీ ఛార్జీలు చెల్లిస్తుంది. ఇలా ముగ్గురికీ లాభమే!! క్రెడిట్ కార్డుల కోసం ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులతో చర్చిస్తున్నాం. త్వరలోనే అమల్లోకి తెస్తాం.

రిటైల్‌లో రెండు దశాబ్ధాల అనుభవం ఉన్న నేను, జర్మన్ ఎన్నారై సంజయ్ పర్మార్ కలిసి హైదరాబాద్‌లో రూ.50 లక్షల పెట్టుబడితో 2014 డిసెంబర్‌లో కాల్ గ్రాసరీస్‌ను ప్రారంభించాం. ఆన్‌లైన్‌తో పాటు 7893939393 నంబర్‌కు ఫోన్ చేసి కూడా ఆర్డరివ్వొచ్చు. దీనికి 30 సీట్లతో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. ప్రస్తుతం 70 శాతం ఆర్డర్లు ఫోన్ ద్వారా, మిగతావి యాప్ ద్వారా వస్తున్నాయి.

మిగతా ఆన్‌లైన్ గ్రాసరీ సంస్థలకన్నా, సూపర్ మార్కెట్లకన్నా మా దగ్గర ధరలు తక్కువ. కారణం కందిపప్పు, బియ్యం, పల్లీలు మినహా మిగతా సరకులన్నీ జీరో ఇన్వెంటరీ కాన్సెప్ట్ కింద నేరుగా మిల్లర్స్ నుంచే తెప్పిస్తున్నాం. మాకు స్టాక్ మెయింటనెన్స్, గిడ్డంగి నిర్వహణ ఖర్చులు, వేస్టేజీ లేవు.

అన్ని సరుకులు, పళ్లు, కూరగాయలతో పాటు మిల్లెట్స్ ఫర్ హెల్తీ లివింగ్ కింద  రాగులు, ఉలవలు, జొన్నలు, సజ్జలు వంటి అన్ని రకాల మిల్లెట్స్‌ను కూడా విక్రయిస్తున్నాం.

డొమెస్టిక్, ఇండస్ట్రియల్ రెండు సేవలూ అందిస్తున్నాం. అపోలో, స్లేట్ స్కూల్, చేవెళ్ల ఫామ్స్, కత్రియా వంటి సుమారు 200 ఇండ స్ట్రియల్ సేల్స్ ఉన్నాయి. డొమెస్టిక్ సేల్స్ నెలకు రూ.8-10 లక్షలు, కార్పొరేట్ సేల్స్ రూ.25 లక్షల వరకు అవుతున్నాయి. ప్రస్తుతం డొమెస్టిక్‌లో 3 వేలు, కార్పొరేట్‌లో 200 కస్టమర్లున్నారు. ప్రతి రోజూ 100-120 ఆర్డర్లొస్తున్నాయి. ఉచిత డెలివరీ ఇస్తున్నాం. 19 మంది ఉద్యోగులున్నారు.

ఈ నెలాఖరులోగా విశాఖపట్నం, కొచ్చిన్ ప్రాంతాలకు విస్తరిస్తాం. తర్వాత పుణె, బెంగళూరుల్లో సేవలందిస్తాం. ఇందుకోసం రూ.3 కోట్ల నిధులను సమీకరించడానికి పలువురు వెంచర్ క్యాప్టలిస్ట్‌లతో చర్చిస్తున్నాం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement