కెనరా బ్యాంక్ లాభం 52 శాతం డౌన్
పెరిగిన ఎన్‌పీఏ కేటాయింపులు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలానికి రూ.229 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం రూ.479 కోట్లతో పోలిస్తే 52 శాతం క్షీణించినట్లు బ్యాంక్ తెలియజేసింది. మొండి బకాయిలకు అధిక కేటాయింపులు జరపడమే నికర లాభం క్షీణతకు ప్రధాన కారణమని వివరించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.1,360 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ క్యూ1లో రూ.1,493 కోట్లకు పెరిగాయి.
మొత్తం ఆదాయం రూ.12,253 కోట్ల నుంచి రూ.11,786 కోట్లకు తగ్గింది. రుణ నాణ్యత కూడా బాగా తగ్గిందని తెలిపింది. స్థూల మొండి బకాయిలు 3.98 శాతం నుంచి 9.71 శాతానికి, నికర మొండి బకాయిలు 2.74 శాతం నుంచి 6.69 శాతానికి పెరిగాయని వివరించింది. మార్కెట్ ముగిసిన తర్వాత బ్యాంక్ ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కెనరా బ్యాంక్ షేర్ బీఎస్‌ఈలో 5.3 శాతం లాభపడి రూ.254 వద్ద ముగిసింది.