కెనరా బ్యాంక్ లాభం 10% అప్
♦ క్యూ1లో రూ.252 కోట్లు
♦ తగ్గిన వడ్డీ ఆదాయం
♦ 7.09 శాతానికి నికర ఎన్‌పీఏలు
న్యూఢిల్లీ: వడ్డీ ఆదాయం తగ్గుదలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ నికర లాభ వృద్ధి 10 శాతానికి పరిమితమైంది. సుమారు రూ. 252 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో బ్యాంకు లాభం దాదాపు రూ. 229 కోట్లు. ఇక తాజాగా ఆదాయం రూ. 11,786 కోట్ల నుంచి రూ. 12,304 కోట్లకు పెరిగింది. మరోవైపు గత క్యూ1లో నమోదైన రూ. 10,202 కోట్లతో పోలిస్తే వడ్డీ ఆదాయం ఈసారి రూ. 10,196 కోట్లకు తగ్గింది.
అటు మొత్తం రుణాల్లో స్థూల నిరర్ధక ఆస్తుల (ఎన్‌పీఏ) పరిమాణం 9.71 శాతం నుంచి 10.56 శాతానికి పెరిగాయి. నికర ఎన్‌పీఏలు 6.69 శాతం నుంచి 7.09 శాతానికి చేరాయి. ఫలితంగా మొండిబకాయిలకు చేయాల్సిన ప్రొవిజనింగ్ కూడా పెరిగి రూ. 1,469 కోట్ల నుంచి రూ. 2,270 కోట్లకు ఎగిసింది. బుధవారం బీఎస్‌ఈలో కెనరా బ్యాంకు షేరు ధర 0.58 శాతం పెరిగి రూ. 371 వద్ద ముగిసింది.