కోలుకున్న పారిశ్రామిక ఉత్పత్తి...
⇒ జనవరిలో ఐఐపీ 2.7 శాతం అప్
⇒ క్యాపిటల్ గూడ్స్ ఉత్పాదకత దన్ను
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 2017 జనవరిలో కోలుకుంది. 2016 జనవరితో పోల్చిచూస్తే 2017 జనవరిలో ఉత్పత్తి 2.7 శాతం పురోగతి సాధించింది. 2016 డిసెంబర్‌లో ఐఐపీ అసలు వృద్ధిలేకపోగా (2015 డిసెంబర్ ఉత్పత్తితో పోల్చిచూస్తే) 0.11 శాతం క్షీణత నమోదయ్యింది. పెద్ద నోట్ల రద్దు, నగదు లభ్యత సమస్యలు ఇందుకు ప్రధాన కారణంగా నిలిచాయి. కాగా 2016 జనవరిలో కూడా అసలు వృద్ధిలేకపోగా 1.6 శాతం క్షీణత నమోదయ్యింది.
ప్రధాన విభాగాలు చూస్తే...
తయారీ: సూచీలో దాదాపు 70 శాతం వాటా కలిగిన ఈ విభాగంలో వృద్ధి 2017 జనవరిలో 2.3 శాతంగా ఉంది. 2016 ఇదే నెలలో అసలు వృద్ధిలేకపోగా –2.1 శాతం క్షీణత నమోదయ్యింది. ఏప్రిల్–జనవరి మధ్య కాలంలో అసలు వృద్ధిలేకపోగా –0.2 శాతం క్షీణించింది. క్రితం ఆర్థిక సంవత్సరంలో 2.5 శాతం వృద్ధి నమోదయ్యింది. తయారీ రంగంలోని 22 పారిశ్రామిక గ్రూపుల్లో తొమ్మిది గ్రూపులు సానుకూల ఫలితాన్ని నమోదు చేసుకున్నాయి.
క్యాపిటల్ గూడ్స్: తాజా సమీక్షా నెలలో పెట్టుబడులు, పెద్ద యంత్రాల ఉత్పత్తికి ప్రతిబింబంగా నిలిచే క్యాపిటల్ గూడ్స్ విభాగం జనవరిలో భారీగా 10.7 శాతం వృద్ధిని నమోదు చేసుకోవడం సూచీకి మొత్తంగా సానుకూలమైంది. 2016 జనవరిలో ఈ విభాగం ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా (2015 జనవరి ఉత్పత్తితో పోల్చిచూస్తే) భారీగా
– 21.6 శాతం క్షీణత నమోదయ్యింది.
మైనింగ్: ఈ విభాగంలో వృద్ధి 1.5 శాతం నుంచి 5.3 శాతానికి పెరిగింది. 10 నెలల కాలంలో ఈ రేటు 2.1% నుంచి 1.4%కి తగ్గింది.
విద్యుత్: ఉత్పత్తి వృద్ధి 6.6 శాతం నుంచి 3.9 శాతానికి తగ్గింది. ఏప్రిల్–జనవరి మధ్య ఈ రేటు 4.7 శాతం నుంచి 5 శాతానికి పెరిగింది.
వినియోగ వస్తువులు: రీమోనిటైజేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్నప్పటికీ, జనవరిలో వినియోగ వస్తువుల ఉత్పత్తి విభాగంలో అసలు వృద్ధిలేకపోగా –1% క్షీణత నమోదయ్యింది. 2016 జనవరిలో ఈ క్షీణత –0.1%. ఈ విభాగంలో డ్యూరబుల్ ఐటమ్స్ 2.9 శాతం పెరగ్గా, నాన్–డ్యూరబుల్ విషయంలో అసలు వృద్ధిలేకపోగా 3.2% క్షీణించింది.
10 నెలల్లో...: 2016–17 ఏప్రిల్–జనవరి మధ్య 10 నెలల కాలంలో ఐఐపీ 0.6% క్షీణించింది. 2015–16 ఇదే కాలంలో ఈ రేటు 2.7%.