కార్ల కంపెనీల పల్లె‘టూర్’... | car companies out let starting at rural areas | Sakshi
Sakshi News home page

కార్ల కంపెనీల పల్లె‘టూర్’...

Published Thu, Aug 21 2014 2:18 AM | Last Updated on Tue, Aug 14 2018 3:25 PM

కార్ల కంపెనీల పల్లె‘టూర్’... - Sakshi

కార్ల కంపెనీల పల్లె‘టూర్’...

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సొంత కారు కల గ్రామీణ ప్రాంత వాసుల్లోనూ అంతకంతకూ పెరుగుతోంది. దీంతో కార్ల కంపెనీలు పల్లెబాట పట్టాయి. కస్టమర్లకు చేరువ అయ్యేందుకు గ్రామాలకు సమీపంలోని చిన్న పట్టణాల్లో చిన్నచిన్న షోరూంలను తెరుస్తున్నాయి. వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలోపు సైతం ఔట్‌లెట్లను ప్రారంభిస్తున్నాయి.

మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్ ఇలా ఒకదాని వెంట ఒకటి పల్లెకు పోదాం చలో చలో అంటున్నాయి. అంతేకాదు కంపెనీలు పెద్ద పెద్ద లక్ష్యాలనే విధించుకున్నాయి. లగ్జరీ కార్లకేం తక్కువ. ఈ కార్లూ పల్లె రోడ్లపై హుందా ఒలకబోస్తున్నాయి. గ్రామీణ భారతం వాటా కంపెనీని బట్టి 32% దాకా ఉందంటే పల్లెల్లో ఉన్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో ఇతర కంపెనీలూ పల్లె బాట పట్టక తప్పదేమో.

 ఊహించనంతగా..
 కంపెనీలు ఊహించని స్థాయిలో గ్రామీణ ప్రాంతాల నుంచి కార్ల అమ్మకాలు నమోదవుతున్నాయి. మారుతి సుజుకి మొత్తం విక్రయాల్లో 2007-08 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంత అమ్మకాల వాటా 4 శాతం మాత్రమే. ప్రస్తుతమిది 32 శాతానికి ఎగబాకింది. 2013-14లో హ్యుందాయ్‌కి గ్రామీణ భారతం నుంచి 10 శాతం అమ్మకాలు నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ వాటా 15 శాతానికి చేరవచ్చని అంచనా వేస్తోంది. గ్రామీణ, ఉప పట్టణ మార్కెట్లలో ప్రయాణికుల రవాణా వాహనాలు పుంజుకుంటున్నాయన్న సంకేతాలు ఉన్నాయని దేశీ కార్ల దిగ్గజం టాటా మోటార్స్  సీఎఫ్‌వో రామకృష్ణన్ ఇటీవల వెల్లడించారు.

 గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు 30 శాతం వృద్ధి కనబరుస్తున్నాయని ఆటోమొబైల్ కంపెనీలు అంటున్నాయి. మెట్రోయేతర ప్రాంతాల వాటా తమకు 15% పైగా ఉందని లగ్జరీ కార్ల కంపెనీ వోల్వో చెబుతోంది. అంటే ఖరీదైన కార్లకూ పల్లెల్లో కొనుగోలుదారులు ఉన్నారన్న మాటే. కాగా, ప్రయాణికుల రవాణా వాహనాల్లో రూ.4 లక్షల లోపు ఖరీదున్న చిన్న కార్ల వాటా 35-40% దాకా ఉంటుందని అంచనా.

 మారుతి సుజుకి హవా..
 పల్లెల్లో మారుతి సుజుకి హవా నడుస్తోంది. భవిష్యత్‌ను నడిపించేది గ్రామీణ మార్కెట్లేనని మారుతి సుజుకి చైర్మన్ ఆర్.సి.భార్గవ అంటున్నారు. 2013-14లో గ్రామీణ మార్కెట్ల అమ్మకాల్లో 16 శాతం వృద్ధి మారుతి కనబర్చింది. రెండేళ్ల క్రితం 44 వేల గ్రామాల నుంచి కంపెనీకి కస్టమర్లుంటే, ప్రస్తుతమీ సంఖ్య 94 వేలకు చేరువలో ఉంది. ఈ సంఖ్యను 2014-15లో 2 లక్షల గ్రామాలకు చేర్చాలన్నది కంపెనీ లక్ష్యం. దేశవ్యాప్తంగా 6.5 లక్షల గ్రామాలున్న సంగతి తెలిసిందే.

మారుతి సుజుకి తెలంగాణలో జనగామ, నిర్మల్, కొత్తగూడెం, జగిత్యాల, ఆంధ్రప్రదేశ్‌లో జగ్గయ్యపేట, జంగారెడ్డిగూడెం, కావలి, నూజివీడు తదితర కేంద్రాల్లో షోరూంలను నిర్వహిస్తోంది. 10 చిన్న షోరూంలను ప్రారంభించేందుకు మారుతి సుజుకీకి దరఖాస్తు చేసుకున్నామని ప్రముఖ డీలర్ వరుణ్ మోటార్స్ డెరైక్టర్ వరుణ్‌దేవ్ తెలిపారు. ఇప్పటికే 5 షోరూంలను తెరిచామన్నారు. పల్లెటూర్లలో అమ్మకాలకు మంచి భవిష్యత్ ఉందని హ్యుందాయ్ ఎర్‌ఎస్‌ఎం తేజ అడుసుమల్లి చౌదరి పేర్కొన్నారు. అన్ని కంపెనీలు పల్లెబాట పట్టాల్సిందేనని అంటున్నారు. రెండు రాష్ట్రాల్లో జగిత్యాల, గోదావరిఖని, మహబూబాబాద్, తుని, మండపేట, అమలాపురం తదితర పట్టణాల్లో హ్యుందాయ్‌కి రీజినల్ సేల్స్ ఔట్‌లెట్లున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement