ప్రతీకాత్మక చిత్రం
ముంబై : విన్‌సమ్ డైమండ్ గ్రూప్ బ్యాంకు కుంభకోణ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) కీలక పురోగతి సాధించింది. ఫరెవర్ డైమండ్స్ మాజీ డైరెక్టర్ హస్ముఖ్ షాను దర్యాప్తు ఏజెన్సీ అరెస్ట్ చేసింది. విన్‌సమ్ డైమండ్, ఫరెవర్ డైమాండ్స్ రెండు కలిసి బ్యాంకుల నుంచి దాదాపు రూ.7000 కోట్ల రుణం తీసుకున్నాయి. ఈ రుణమంతటిన్నీ ఈ సంస్థలు బ్యాంకులకు కట్టడం మానేశాయి. 2013లో భారీ డిఫాల్ట్‌గా మారిపోయాయి.
2017 ఏప్రిల్‌లో విన్‌సమ్ డైమాండ్‌కు వ్యతిరేకంగా సీబీఐ కేసు రిజిస్ట్రర్ చేసింది. సీబీఐ వర్గాల సమాచారం మేరకు హస్ముఖ్ షా, ఫరెవర్ ప్రెషియస్ జువెల్లరీ, డైమాండ్స్‌కు అధికారిక సంతకం దారి. షా అరెస్ట్‌తో ఈ కేసులో ప్రధాన పురోగతిని సీబీఐ సాధించగలిగిందని, బ్యాంకు అధికారులకు, కంపెనీ అధికారులకు మధ్యనున్న జరిగిన విషయాలను వెల్లడించే అవకాశముందని తెలిసింది. బ్యాంకుతో ఆయన వ్యవహరించేటప్పుడు, రుణాలను సేకరించడానికి, సంస్థకు క్రెడిట్ లేఖలు జారీచేసే బాధ్యతలు చేపట్టేవారు.
అప్పట్లో .. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ సారథ్యంలోని కన్సార్షియం నుంచి విన్‌సమ్ డైమండ్ గ్రూప్‌నకు చెందిన విన్‌సమ్ డైమండ్ అండ్ జ్యుయలర్స్, ఫరెవర్ ప్రెషియస్ డైమండ్ అండ్ జ్యుయలరీ, సూరజ్ డైమండ్స్ సంస్థలు రూ. 6,800 కోట్లు రుణం తీసుకున్నాయి. ఇందులో పీఎన్‌బీనే అత్యధికంగా రూ. 1,800 కోట్లు ఇచ్చింది.
నీరవ్ మోదీ కేసులోని లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ తరహాలోనే బ్యాంకులు .. విన్‌సమ్ గ్రూప్ కంపెనీలకు అంతర్జాతీయ బులియన్ బ్యాంకులు బంగారాన్ని సరఫరా చేసేందుకు వీలుగా స్టాండ్‌బై లెటర్స్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చాయి. వీటి ప్రకారం.. బంగారం కొనుగోళ్లకు సంబంధించి ఒకవేళ విన్‌సమ్ గ్రూప్ సంస్థలు గానీ నిధులు చెల్లించడంలో విఫలమైతే.. ఆ మొత్తాలను బులియన్ బ్యాంకులకు ఈ బ్యాంకులు కట్టాల్సి ఉంటుంది.
విన్‌సమ్ గ్రూప్.. కొన్నాళ్లకి గల్ఫ్ దేశాల్లోని కొందరు కస్టమర్లు డెరివేటివ్స్ ట్రేడింగ్‌లో 1 బిలియన్ డాలర్లు నష్టపోవడంతో తమకు రావాల్సిన బాకీలు కట్టలేదన్న కారణంతో బులియన్ బ్యాంకులకు కట్టడం మానేసింది. 2013లో డిఫాల్ట్‌లు మొదలయ్యాయి. అదే ఏడాది విన్‌సమ్ డైమండ్ గ్రూప్‌ను ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా బ్యాంకులు ప్రకటించాయి. దీనిపై పీఎన్‌బీ ఫిర్యాదుతో ప్రారంభమైన సీబీఐ విచారణ ఇంకా కొనసాగుతోంది. రూ.172 కోట్ల విలువైన విన్‌సమ్ డైమాండ్ ప్రాపర్టీలను ఈడీ అటాచ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment