పీఎన్‌బీ కుంభకోణానికి సంబంధించి అలహాబాద్ బ్యాంక్ సీఈవో, ఎండీ ఉషా అనంతసుబ్రమణియన్‌ను సీబీఐ మంగళవారం ప్రశ్నించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటీవలే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)కి చీఫ్‌గా ఎన్నికైన ఉష.. గతంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో సీనియర్ స్థానాల్లో కూడా పనిచేశారు.
2015 ఆగస్టు 14 దాకా ఆమె పీఎన్‌బీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా వ్యవహరించారు. ఆ తర్వాత 2017 మే 6న అలహాబాద్ బ్యాంక్ సీఈవోగా నియమితులయ్యారు. తాజా కేసులో ఆమెను నిందితురాలిగా ప్రశ్నించడం లేదని సీబీఐ వర్గాలు తెలిపాయి. బ్యాంకు పర్యవేక్షణ వ్యవస్థ కన్నుగప్పి.. ఇంత భారీ లావాదేవీలు ఎలా చోటుచేసుకున్నాయి, ఇలాంటి వాటి గురించి ఆడిటర్లు ఎప్పుడైనా తమ నివేదికల్లో హెచ్చరికల్లాంటివేమైనా చేశారా లేదా అనే అంశాలపై స్పష్టత కోసం ఉషను ప్రశ్నిస్తున్నట్లు వివరించాయి.
గీతాంజలి జెమ్స్ ఖాతాల ఫోరెన్సిక్ ఆడిట్..
గీతాంజలి జెమ్స్ మోసానికి పాల్పడిందా లేదా అన్నది నిర్ధారించుకునేందుకు సంస్థ ఖాతాల ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని బ్యాంకులు నిర్ణయించాయి. ఇందుకోసం టీఆర్ చద్ధా అండ్ కంపెనీని నియమించుకున్నాయి. ఆడిట్ పలితాలను బట్టి ఈ ఖాతాను ప్రామాణికమైనదిగానో లేదా మొండిపద్దుగానో పరిగణించడంపై బ్యాంకులు నిర్ణయం తీసుకోనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment