సెల్‌కాన్ తిరుపతి ప్లాంటు నేడు ప్రారంభం
♦ తొలి దశలో రూ.150 కోట్ల పెట్టుబడి
♦ సెల్‌కాన్ వ్యవస్థాపకుడు వై.గురు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ తయారీలో ఉన్న సెల్‌కాన్ సంస్థ తిరుపతి సమీపంలో నెలకొల్పిన తయారీ కేంద్రాన్ని గురువారం ప్రారంభించనుంది. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారు. రేణిగుంట విమానాశ్రయం వద్ద శ్రీ వెంకటేశ్వర మొబైల్, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌లో ఏర్పాటైన తొలి ప్లాంటు ఇదే. రోజుకు 72,000 మొబైల్స్ ఉత్పత్తి సామర్థ్యంతో దీన్ని తీర్చిదిద్దారు. ప్రస్తుతం బేసిక్ మొబైళ్లు, స్మార్ట్‌ఫోన్లతోపాటు ట్యాబ్లెట్ పీసీలను తయారు చేస్తారు.
రానున్న రోజుల్లో ఎల్‌ఈడీ టీవీలు, సీసీటీవీ కెమెరాలను సైతం రూపొందిస్తామని సెల్‌కాన్ వ్యవస్థాపకుడు వై.గురు బుధవారం ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. తొలి దశలో రూ.150 కోట్లు వెచ్చిస్తున్నట్టు చెప్పారు. ప్లాంటు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 4,000 మందికి ఉపాధి లభించనుందని వెల్లడించారు. శ్రీ వెంకటేశ్వర మొబైల్, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌లో ప్లాంటు ఏర్పాటుకై 2015 సెప్టెంబరు 15న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సెల్‌కాన్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కంపెనీ ఇప్పటికే హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్ వద్ద తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తోంది. ఫ్యాబ్‌సిటీ వద్ద మరో ప్లాంటును సైతం ఏర్పాటు చేస్తోంది.