
డిజిన్వెస్ట్‌మెంట్.. జోష్!
♦ హైపవర్ ప్యానల్ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం
♦ ఆర్థిక, రవాణా, పాలన విభాగాల మంత్రులకు చోటు
♦ త్వరలో నాలుగు సంస్థల్లో వ్యూహాత్మక వాటా విక్రయాలు
♦ జాబితాలో బీఈఎంఎల్, స్కూటర్స్ ఇండియా, పవన్‌హన్స్, హిందుస్తాన్ ప్రీఫ్యాబ్
♦ వీటికి సంబంధించి అడ్వైజర్ల నియామకం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థల్లో వ్యూహాత్మక వాటాల విక్రయం, పెట్టుబడుల ఉపసంహరణ(డిజిన్వెస్ట్‌మెంట్) ప్రక్రియ మరింత వేగం పుంజుకోనుంది. ఇందుకు గాను అత్యున్నత స్థాయి మంత్రుల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆర్థిక, రోడ్డు, రవాణా, పరిపాలనా విభాగం మంత్రులతో ప్రత్యామ్నాయ యంత్రాంగం ఏర్పాటుకు ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది.
వ్యూహాత్మక పెట్టుబడుల వ్యవహారాలపై ఈ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని సమావేశం అనంతరం అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. దీనికితోడు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు వీలుగా... ఎప్పటికప్పుడు విధానపరమైన అంశాలపై నిర్ణయ అధికారా న్ని సెక్రటరీల కోర్ గ్రూపుకు ప్రభుత్వం కట్టబెట్టింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.72,500 కోట్ల నిధుల సేకరణ లక్ష్యాన్ని ప్రభుత్వం విధించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో రూ.46,500 కోట్లు మైనారిటీ వాటాల విక్రయం ద్వారా, రూ.15,000 కోట్లు వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా, సాధారణ బీమా సంస్థల లిస్టింగ్ ద్వారా రూ.11,000 కోట్ల సమీకరణ ఇందులో ఉంది. ఇప్పటి వరకు మొత్తం మీద రూ.8,427 కోట్ల సమీకరణ పూర్తి చేసింది.
నాలుగింటిపై దృష్టి
బీఈఎంఎల్, స్కూటర్స్ ఇండియా, పవన్‌హన్స్, హిందుస్తాన్ ప్రీఫ్యాబ్ సంస్థల్లో వ్యూహాత్మక వాటాలను విక్రయించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. లక్నో కేంద్రంగా నడిచే స్కూటర్స్ ఇండియాలో నూరు శాతం, బెంగళూరు కేంద్రంగా భారీ యంత్రపరికరాలను తయారు చేసే బీఈఎంఎల్‌లో 26 శాతం, హెలికాప్టర్ సేవల్లోని పవన్‌హన్స్‌లో 51 శాతం చొప్పున వాటాలను అమ్మాలనుకుంటోంది. ఈ వ్యవహారాలను ముందుకు తీసుకెళ్లేందుకు సలహాదారుల నియామక ప్రక్రియ పురోగతిలో ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ సలహాదారులు ప్రొఫెషనల్ ఇంటర్‌మీడియరీలను ఎంపిక చేస్తారని వెల్లడించాయి.
ఈ వర్గాలు అందించిన సమాచారం మేరకు... స్కూటర్స్ ఇండియాలో ముందుగా వాటాల విక్రయం జరగనుంది. ఇక పవన్‌హన్స్‌లో వాటాల విక్రయానికి సంబంధించి సమగ్ర ప్రణాళికను అధికారులు సిద్ధం చేశారు. పౌర విమానయాన శాఖ ఆదేశాల కోసమే ఇది ఆగింది. మరోవైపు హెచ్‌పీసీఎల్‌లో కేంద్ర ప్రభుత్వ వాటాలను ఓఎన్‌జీసీ కొనుగోలు చేస్తుండటంతో దీని ద్వారా సర్కారుకు రూ.33,000 కోట్ల నిధులు అందనున్నాయి. ఈ డీల్‌కు సంబంధించి కన్సల్టెంట్, న్యాయ సలహాదారుల నియామకంపైనా ప్రభుత్వం దృష్టి సారించింది.
నాలుగు సంస్థల ఐపీవోలు
నాలుగు ప్రభుత్వరంగ సంస్థల్లో ఐపీవోల ద్వారా వాటాల విక్రయ ప్రక్రియను పెట్టుబడుల ఉపసంహరణ విభాగం (దీపం) ప్రారంభించింది. గార్డెన్‌రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్, భారత్ డైనమిక్స్, మిశ్రధాతు నిగమ్ ఇందులో ఉన్నాయి. వీటికి అదనంగా ప్రభుత్వరంగంలోని ఐదు సాధారణ బీమా సంస్థలు కూడా ఐపీవోలకు క్యూలో ఉన్నాయి. ఇక ఈ నెల మొదట్లో 22 ప్రభుత్వరంగ సంస్థలతో ఈటీఎఫ్ భారత్–22ను ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇది ప్రభుత్వం నుంచి రానున్న రెండో ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్. దీని ద్వారా 22 ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాలను ప్రభుత్వం తగ్గించుకోవాలని అనుకుంటోంది.