న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియా విక్రయానికి కేంద్ర ఆర్థిక శాఖ మరో కొత్త ప్రణాళిక రూపకల్పనలో నిమగ్నమైంది. ఈ సారి చమురు ధరలు, మారకం రేటు హెచ్చు తగ్గులు తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటోంది. వాస్తవానికి ఎయిరిండియాలో గతేడాదే వాటాలు విక్రయించే ప్రయత్నాలు జరిగినప్పటికీ.. ఇలాంటి కారణాల వల్లే విఫలమైనట్లు కన్సల్టెన్సీ సంస్థ ఈవై తేల్చి చెప్పడంతో తాజా నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనలను ఎయిరిండియా ప్రత్యేక ప్రత్యామ్నాయ యంత్రాంగం (ఏఐఎస్‌ఏఎం) ముందు ఆర్థిక శాఖ ఉంచనుంది.
ఎయిరిండియాలో మొత్తం 100 శాతం వాటాలు లేదా 76 శాతం వాటాలు విక్రయించాలా అన్న ఆప్షన్ కూడా వీటిలో ఉంటుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురితో పాటు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కొత్తగా ఏర్పడే ఏఐఎస్‌ఏఎంలో సభ్యులుగా ఉండవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎయిరిండియాకు మొత్తం రూ. 55,000 కోట్ల మేర రుణభారం ఉంది. ఎయిరిండియాలో 76 శాతం వాటాలు విక్రయించేందుకు 2018లో కేంద్రం ప్రయత్నించింది. అయితే, కొనుగోలుదారు దాదాపు రూ. 30,000 కోట్ల రుణభారాన్ని భరించాల్సి రానుండటంతో విక్రయ ప్రయత్నాలు విఫలమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment