
న్యూఢిల్లీ: అమెరికా కార్పోరేట్ పన్ను కోత భారత స్టాక్ మార్కెట్‌పై బాగానే ప్రభావం చూపుతుందని 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్.కె. సింగ్ వ్యాఖ్యానించారు. ప్రతికూల ఫలితాలు ఇప్పటికే కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. మన స్టాక్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు 2,300 కోట్ల డాలర్లుగా ఉన్నాయని తెలిపారు. అమెరికాలో పన్ను కోతల ప్రభావంతో ఈ పెట్టుబడుల్లో స్వల్ప భాగం వెనక్కి వెళ్లిపోయినా, మన మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం ఉంటుందని వివరించారు. ఇప్పటికే ఆ ప్రభావాన్ని మనం చూస్తున్నామని తెలిపారు.
అనిశ్చితి అధికమే..!
ఈ ఏడాది స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులకు, అనిశ్చితి చోటు చేసుకోవచ్చని ఎన్.కె. సింగ్ అంచనా వేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ పరిణామాల వల్ల అనిశ్చితి చోటు చేసుకోవచ్చని వివరించారు. ఇక్కడ జరిగిన యస్ బ్యాంక్ యాన్యువల్ ఎకనామిక్ కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడారు. తొలి, అత్యంత కీలకమైన అంతర్జాతీయ అనిశ్చితి అమెరికా కార్పొరేట్ పన్ను కోతేనని వివరించారు. కార్పొరేట్ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 21 శాతానికి అమెరికా తగ్గించిందని, ఫలితంగా అమెరికా కంపెనీల లాభదాయకత పెరుగుతుందని పేర్కొన్నారు.
ఈ దృష్ట్యా అమెరికా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎఫ్‌పీఐలు భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటారని వివరించారు. ఇక రెండో విదేశీ ప్రభావం... అంతంతమాత్రంగానే ఉన్న ఎగుమతులని తెలిపారు. ఎగుమతులు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నా, ముడి చమురు ధరల్లో ఒడిదుడుకుల కారణంగా మన కరెంట్ అకౌంట్‌లోటుపై ప్రభావం బాగానే ఉంటుందని వివరించారు. కనీస మద్దతు ధర పెరగడం వల్ల ద్రవ్యోల్బణ ఒత్తిడులు కూడా అధికమవుతాయని పేర్కొన్నారు.
స్వతంత్రమైన ద్రవ్య మండలిని ఏర్పాటు చేయాల్సిన అవసరముందని తెలిపారు. ఇప్పటికే ఇలాంటి ద్రవ్య మండలి 44 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం ఈ అనిశ్చితిని తట్టుకునేలా చర్యలు తీసుకోగలదని ఆయన భరోసా ఇచ్చారు. ఆర్థికాంశాల్లో మన దేశం స్థిరత్వం సాధిస్తోందని చెప్పారు. గతంతో పోల్చితే ఇప్పుడు పరిస్థితులు బాగా మెరుగయ్యాయని, మనం ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఆశావహంగా ఉండొచ్చని ధీమా వ్యక్తం చేశారు.
ఇదే సమావేశంలో నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ కూడా మాట్లాడారు. మైనింగ్, పెట్రోలియమ్, నేచురల్ గ్యాస్, నిర్మాణ రంగాల్లో మరిన్సి సంస్కరణలు రావలసిన అవసరముందని అమితాబ్ కాంత్ చెప్పారు. ద్రవ్య, ఆర్థిక విధానాల కన్నా స్థూల మూలధన కల్పనపై దృష్టి పెట్టాల్సి ఉందని సూచించారు. స్థూల మూలధన కల్పన 36 శాతం నుంచి 26 శాతానికి పడిపోయిందని, దానిని మళ్లీ 36 శాతానికి పెంచాల్సి ఉందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment