ఎస్‌బీఐ సబ్సిడరీల చెక్ బుక్‌లు పనిచేయవు
సాక్షి, న్యూఢిల్లీ : ఐదు అనుబంధ బ్యాంకులతో పాటు భారతీయ మహిళా బ్యాంకును తనలో విలీనం చేసుకున్న స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. అనుబంధ బ్యాంకుల పాత చెక్ బుక్‌లు, ఐఎఫ్‌ఎస్ కోడ్‌లు 2017 సెప్టెంబర్ 30 నుంచి పనిచేయవని పేర్కొంది. ఈ మేరకు అనుబంధ బ్యాంకుల అకౌంట్లు కలిగి ఉన్న కస్టమర్లు కొత్త చెక్ బుక్‌ల కోసం ఎంత వీలైతే అంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని, వాటితో పాటు కొత్త ఐఎఫ్‌ఎస్ కోడ్‌ను పొందాలని సూచించింది. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.
భారతీయ మహిళ బ్యాంకుతో పాటు, స్టేట్ బ్యాంకు ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంకు ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ రాయ్‌పూర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ ట్రావెన్‌కోర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ కస్టమర్లు తమ చెక్ బుక్‌లను అప్‌డేట్ చేయించుకోవాలని ఎస్‌బీఐ ఆదేశించింది. ఇలా అప్‌డేట్ చేసుకోని పక్షంలో ఆ బ్యాంకుల పాత చెక్ బుక్‌లు సెప్టెంబర్ 30 నుంచి పనిచేయకుండా పోతాయి. ఈ విలీనంతో ప్రపంచంలో అతిపెద్ద బ్యాంకుల్లో ఎస్‌బీఐ ఒకటిగా అవతరించింది. అంతేకాక ఎస్‌బీఐ ఆస్తుల విలువ కూడా రూ.37 లక్షల కోట్లకు చేరింది. ఖాతాదారుల సంఖ్య కూడా 50 కోట్లు దాటింది.