
న్యూఢిల్లీ : భారతీయ స్టేట్ బ్యాంక్ తనలో విలీనం చేసుకున్న ఆరు బ్యాంకుల ఖాతాదారులు ఇంకా పాత చెక్‌బుక్, ఐఎఫ్‌ఎస్ కోడ్‌లే వాడుతున్నారా? అయితే త్వరగా మార్చేసుకోండి. 2017 డిసెంబర్ 31 నుంచి ఎస్‌బీఐ తన విలీనం చేసుకున్న ఆరు బ్యాంకుల ఖాతాదారులకు చెందిన పాత చెక్‌బుక్‌లు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లు చెల్లవు. ఈ లోపలే కొత్త చెక్‌బుక్‌లు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లు తీసుకోవాలని ఎస్‌బీఐ తన ఖాతాదారులకు సూచిస్తోంది. గతంలో పాత చెక్‌బుక్‌లను మార్చుకోవడానికి 2017 సెప్టెంబర్ 30న డెడ్‌లైన్‌గా గడువు విధించింది. అనంతరం ఆ గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గడువు దగ్గర పడుతున్న క్రమంలో ఎస్‌బీఐ మరోసారి తన కస్టమర్లకు ఈ సూచన చేస్తోంది.
ఈ ఏడాది ఆరంభంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనేర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ రాయ్‌పూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్ సహా భారతీయ మహిళా బ్యాంకులు ఎస్బీఐలో విలీనమైన విషయం తెలిసిందే. కొత్త చెక్‌బుక్ పొందడానికి బ్యాంకు శాఖనైనా సందర్శించవచ్చని లేదా ఎటీఎం, ఎస్‌బీఐ మొబైల్ యాప్ ద్వారానైనా దీన్ని పొందవచ్చని పేర్కొంది. ఎస్‌బీఐ కూడా మేజర్ సిటీల్లో ఉన్న బ్రాంచు పేర్లను, బ్రాంచు కోడ్‌లను, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లను మారుస్తోంది. ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కత్తా, పాట్న, అహ్మదాబాద్, భోపాల్, అమరావతి, చంఢీగర్, జైపూర్, తిరువనంతపురం, లక్నో వంటి నగరాల్లో ఎస్‌బీఐ బ్రాంచు పేర్లను, బ్రాంచు కోడ్‌లను, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లను మార్చేసింది.
Comments
Please login to add a commentAdd a comment