
సాక్షి, ముంబై : దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన శాఖల పేర్లను, ఐఎఫ్‌ఎస్‌సీ (ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్)లో భారీ మార్పులు చేసింది. ఇటీవల అయిదు బ్యాంకులను విలీనం చేసుకున్న నేపథ్యంలో దిగ్గజ బ్యాంకు ఈ చర్యలు చేపట్టింది. ఎస్‌బీఐ శాఖలలో 1,300 బ్రాంచ్‌ల పేర్లను, వాటి ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లను మార్చింది. ముఖ్యంగా హైదరాబాద్ సహా, ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోలకతా, లక్నో వంటి ప్రధాన నగరాల్లో ఈ మార్పులు చేసింది. ఈ మార్పులకు సంబంధించిన వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. ఎస్‌బీఐ సుమారు 23వేల శాఖలుండగా 13వందల బ్రాంచ్‌లలో ఈ మార్పులు చేపట్టింది.
పాత అసోసియేట్ బ్రాంచీలలో కొన్ని ఎస్‌బీఐ శాఖలతో విలీనం అవుతున్నాయి. ఈ విలీనం కారణంగా ఐఎఫ్ఎస్‌సీ కోడ్స్ మారతాయని బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ (రీటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్) ప్రవీణ్ గుప్తా చెప్పారు. ఈ మార్పు గురించి కస్టమర్లకు సమాచారం అందించినట్టు చెప్పారు. అలాగే పాత కోడ్ జత చేసినా, కస‍్టమర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలుతీసుకున్నామన్నారు.
నగదు లావాదేవీల సందర్భంగా బ్యాంకు శాఖలను ప్రత్యేకంగా గుర్తించడానికి ఉపయోగించే ఆల్ఫా న్యూమరికల్ కోడ్ ఐఎఫ్‌ఎస్‌సీ. ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ తదితర పద్దతులను ఉపయోగించి ఒక ఖాతా నుండి వేరొకదానికి నగదు బదిలీకి ఈ కోడ్ చాలా అవసరం.
Comments
Please login to add a commentAdd a comment