పెట్టుబడితో పౌరసత్వం! | citizenship with Investment ! | Sakshi
Sakshi News home page

పెట్టుబడితో పౌరసత్వం!

Published Mon, Feb 29 2016 12:35 AM | Last Updated on Sun, Sep 3 2017 6:37 PM

పెట్టుబడితో పౌరసత్వం!

పెట్టుబడితో పౌరసత్వం!

అఖిలేష్ ఇండియాలో ఓ బడా వ్యాపారవేత్త. తన కొడుకు అమెరికా వెళ్లాలని, అక్కడే స్థిరపడాలన్నది ఆయన కోరిక. మరి ఇది నెరవేరాలంటే...? ముందు అమెరికా వెళ్లటానికి వీసా కావాలి. తరవాత అక్కడ స్థిరపడాలంటే ముందు గ్రీన్‌కార్డ్ రావాలి. ఆ తరవాత పౌరసత్వానికి దరఖాస్తు చెయ్యాలి. అది ఓకే అయితే పౌరసత్వం వస్తుంది!!.
 
మోహన్ రెడ్డిది కూడా ఇలాంటి కథే. స్థానికంగా పేరుమోసిన ప్రైవేట్ ఇన్వెస్టరాయన. తన కూతుర్ని కెనడాకో, యూరప్‌లోని అభివృద్ధి చెందిన మరో దేశానికో పంపించాలన్నది ఆయన ఆశ. అక్కడే స్థిరపరచాలని కూడా ఉంది. దానికోసం ఆయన కుమార్తెకు కూడా అక్కడి సిటిజన్‌షిప్ కావాలి.
 
ఏ దేశంలోనైనా సరే పౌరసత్వం పొందాలంటే ఆయా దేశంలో పుట్టిన వారై ఉండాలి. లేనిపక్షంలో ఆ దేశానికి చెందిన వారికి విదేశాల్లోనైనా జన్మించి ఉండాలి. తల్లిదండ్రుల్లో కనీసం ఒకరైనా ఆ దేశానికి చెందినవారైతే సంతానానికి కూడా పౌరసత్వం వస్తుంది. వీటిలో దేనికీ చెందకపోతే..?
 

ఇన్వెస్టర్లకు ద్వారాలు తెరుస్తున్న విదేశాలు
పెట్టుబడులు, స్థిరాస్తి కొనుగోళ్లతో దీర్ఘకాలిక వీసా
స్పెయిన్, పోర్చుగల్ వంటి కొన్ని దేశాల్లో పౌరసత్వం కూడా..
కనీస పెట్టుబడులు 3.5 కోట్ల డాలర్లు.. నికర ఆస్తులూ ఉండాలి
మన దేశంలోనూ 2 బిలియన్ డాలర్లు పెడితే దీర్ఘకాలిక వీసా?
నేటి బడ్జెట్లో ప్రకటించవచ్చంటున్న నిపుణులు

 
శ్రీమంతులకు పలు దేశాలు పెట్టుబడుల ద్వారా పౌరసత్వాన్ని కల్పించే వెసులుబాటు కల్పిస్తున్నాయి. అంటే... ఆ దేశంలో నిర్దిష్టమైన మొత్తాన్ని కనక నిర్దేశించిన రాష్ట్రంలోనో, రంగంలోనో పెట్టుబడిగా పెడితే పౌరసత్వం ఇస్తారన్న మాట. అమెరికా, యూరప్ వంటి అభివృద్ధి చెందిన దేశాలే కాక కరేబియన్, అర్మేనియా తదితర చిన్న దేశాలు కూడా తమ దేశంలో పెట్టుబడులు పెట్టేవారికి శాశ్వత వీసా, పౌరసత్వం ఇస్తున్నాయి. అసలు ఈ పౌరసత్వంతో కలిగే లాభమేంటి? ఏ దేశాలు బిజినెస్ వీసాలను అందిస్తున్నాయి? నిబంధనలేంటి? ఇవన్నీ వివరించేదే ఈ వారం ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రధాన కథనం...
- సాక్షి. ప్రాఫిట్ ప్లస్ ప్రతినిధి


పెట్టుబడులు రెండు రకాలు
పెట్టుబడులు పెట్టే విదేశీ వ్యాపారులకు ఏ దేశమైనా ఎర్ర తివాచీ పరుస్తుంది. దీనికి కారణమేంటంటే ఇందుకు కారణం... పెట్టుబడులతో స్థానిక ప్రజలకు ఉద్యోగాలొస్తాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. సదరు పెట్టుబడులు దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయి. దీనికోసం దాదాపు అన్ని దేశాలూ పెట్టుబడిదారులకు ఎంటర్‌ప్రెన్యూర్/బిజినెస్ వీసాలను జారీ చేస్తాయి. వీటినే గోల్డెన్ వీసాలుగా పిలుస్తుంటారు. కొన్నేళ్ల తర్వాత ఈ గోల్డెన్ వీసాలను శాశ్వత వీసా లేదా పౌరసత్వంగా మారుస్తారు. సాధారణంగా విదేశాల్లో పెట్టుబడులను రెండు రకాలుగా పరిగణిస్తారు.
 
1. ప్రత్యక్ష (యాక్టివ్) 2. పరోక్ష (పాసివ్).
ప్రత్యక్ష పెట్టుబడులంటే... ఆయా దేశాల్లో సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలి. లేదా స్థానికంగా ఉండే ఇతర సంస్థలను కొనుగోలు చేయొచ్చు. ఈ రెండూ కాకుంటే ఏదైనా వ్యాపారంలో భాగస్వామిగానైనా కొనసాగొచ్చు.
పరోక్ష పెట్టుబడులంటే.. స్థానికంగా ఉన్న ప్రాజెక్ట్‌లలో వాటాలు కొనుగోలు చేయటం. బాండ్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా స్థానికంగా స్థిరాస్తులను కొనుగోలు చే యొచ్చు, అద్దెకు కూడా తీసుకోవచ్చు.
 
పెట్టుబడులు, నికర ఆస్తులు కూడా...
బిజినెస్ వీసా పొందాలంటే విదేశాల్లో వ్యాపారమే చేయాల్సిన అవసరం లేదు. కరేబియన్, అర్మేనియా వంటి చిన్న దేశాల్లో స్థిరాస్తులను కొనుగోలు చేసినా, అద్దెకు తీసుకున్నా సరిపోతుంది. అయితే చాలావరకూ దేశాల్లో పెట్టుబడుల విలువకు కామన్ నిబంధన ఒకటుంది. అదే 3.5 కోట్ల డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టాలని, నికర ఆస్తులు కూడా ఉండాలని. అయితే దేశాన్ని బట్టి ఆయా పెట్టుబడులు మారుతుంటాయని దక్షిణాఫ్రికా హై కమిషనర్ ఫ్రాన్స్ కె. మోర్లే ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు.

దక్షిణాఫ్రికాలో పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు శాశ్వత వీసా లేదా పౌరసత్వం పొందాలంటే..  వారు పెట్టే కంపెనీల్లో కనీసం 60 శాతం ఉద్యోగాలు  స్థానికులకే ఇవ్వాలి. ‘‘పెపైచ్చు ఈ పెట్టుబడుల్ని ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ జోన్ (ఐడీజెడ్), ప్రత్యేక ఆర్థిక మండళ్లలోనే (ఎస్‌ఈజెడ్) పెట్టాల్సి ఉంటుంది. ఈస్ట్రన్ కేప్ రాష్ట్రంలోని నెల్సన్‌మండేలా బే, మెట్రోపాలిటన్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కొయోగా, రిచర్డ్స్ బే ఐడీజెడ్, ఈస్ట్ లండన్ ఐడీజెడ్, డూబే ట్రేడ్ పోర్ట్, సల్దానా బే ఐడీజెడ్ లలో మాత్రమే పెట్టాలి’’ అని మోర్లే వివరించారు.
 
యూకే విషయానికొస్తే.. అక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ వీసా పొందిన వ్యక్తి స్థానిక ఆర్థిక సంస్థల్లో 2,00,000 యూరోల పెట్టుబడులు పెట్టడంతో పాటు స్థానికంగా 10 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించాలి. మూడేళ్ల పాటు వార్షిక టర్నోవర్ 5 మిలియన్ యూరోలుండాలి. సంబంధిత వ్యాపారవేత్త నికర ఆస్తుల విలువ కనీసం 2,00,000 యూరోలుండాలనే నిబంధన ఉంది.
 
35 ఏళ్ల వయస్సు, భాష మీద పట్టు..
విదేశాల్లో పెట్టుబడులు పెట్టినంత మాత్రాన శాశ్వత వీసా, పౌరసత్వం పొందలేరు. సంబంధిత వ్యాపారవేత్తల వయస్సు, కుటుంబ వివరాలు, భాషా నైపుణ్యం వంటి అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటారు. ‘‘35 ఏళ్ల లోపు వయసు, ఆంగ్ల భాష మీద పట్టు, కనీస విద్యార్హతతో పాటు పెట్టదలుచుకున్న వ్యాపారం మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్న వ్యాపారులకు మంచి అవకాశాలుంటాయి’’ అని ఫ్రాన్స్ కె. మోర్లే చెప్పారు. సాధారణ ఖర్చులు అంటే 12-15 లక్షల బడ్జెట్, వీసా, విమాన టికెట్ల ఖర్చులు, కన్సల్టెంట్ బిల్లు, స్థానికంగా మూడు నెలలు గడిపేందుకు అయ్యే వ్యయం కూడా చేతిలో ఉంచుకోవాలి.

కొన్ని దేశాలు భార్యాబిడ్డల విద్యార్హత, భాషా నైపుణ్యాలను కూడా పరిగనణలోకి తీసుకుంటాయి. కేవలం తమ పిల్లలకు శాశ్వత వీసా, పౌరసత్వం కోసమే వ్యాపారం చేద్దామని భావించేవాళ్లక్కూడా కొన్ని దేశాలు అవకాశం కల్పిస్తున్నాయి. అయితే సంబంధిత వ్యాపారవేత్తలు వ్యాపారంతో పాటూ స్థానికంగా ఇతర కార్యక్రమాలూ చేయాల్సి ఉంటుంది. కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఒకటి కంటే ఎక్కువ కార్యక్రమాలు చేయాలనే నిబంధన ఉంది. అది కూడా తమ వ్యాపార స్వభావానికి సంబంధించిందై ఉండాలి.
 
ఇన్వెస్టర్లకేం లాభమంటే...
విదేశాల్లో వ్యాపారం చేసేవారికేం లాభమంటే... స్థానికంగా వ్యాపార అవకాశాలతో పాటు వారి భార్య, పిల్లల బిజినెస్ వీసాలను కొన్నేళ్ల తర్వాత శాశ్వత రెసిడెన్సీ లేదా పౌరసత్వంగా మార్చేస్తారు. అభివృద్ధి చెందిన దేశాల పౌరసత్వం ఉంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ప్రపంచ స్థాయి విశ్వ విద్యాలయాల్లో ఉన్నత విద్య, కెరీర్‌ను ఎంచుకునే వీలుంటుంది. స్థానికంగా లభించే స్కాలర్‌షిప్స్ కూడా అందుకోవచ్చు. అందుకే చాలామంది భారత వ్యాపారులు, శ్రీమంతులు (హెచ్‌ఎన్‌ఐ) విదేశాల్లో వ్యాపారం చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారని విదేశీ వీసా కన్సల్టెంట్ ఒకరు తెలియజేశారు.

దక్షిణాఫ్రికా, యూకే వంటి దేశాల్లో వ్యాపారరీత్యా వలస వచ్చిన వారికి, వారి కుటుంబాలకు వైద్య సదుపాయాలతో పాటు సామాజిక భద్రతనూ అందిస్తున్నారు. అలాగే సంబంధిత వ్యాపారులు స్థానికంగా లేని సమయంలో వారి వ్యక్తిగత స్థిరాస్తులు, అద్దెలను ప్రభుత్వమే సంరక్షిస్తుంది. అయితే అందరు వ్యాపారులు ఇలా వీసాల కోసమే కాకుండా ఆయా దేశాలు అందిస్తున్న పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలతో కూడా పెట్టుబడులు పెడుతున్నారని ఆయన వివరించారు.
 
ఇండియాకైతే పెట్టుబడి రూ.13,200 కోట్లు..!
‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం సక్సెస్ కావాలంటే పెద్ద మొత్తంలో విదేశీ పెట్టుబడులు అవసరమని, ఇందుకోసం దేశంలోకి విదేశీ వాణిజ్య వేత్తలు సులభంగా వచ్చేలా చూడాలని కేంద్రం భావిస్తోంది. అందుకే దేశంలో రూ.13,200 కోట్లు (2 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టే విదేశీయులకు దీర్ఘకాల వీసా లేదా రెసిడెన్సీ అనుమతి ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక పాలసీని తేవటమా? లేక ఇప్పటికే ఉన్న విదేశీయులకు సంబంధించిన నిబంధనల్లో సవరణలు తేవాలా.. అనే విషయమై విదేశీ విభాగాల్లోని అధికారులతో ఆర్థిక మంత్రి చర్చిస్తున్నారు.

సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో దీనిపై స్పష్టతనిచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఒకవేళ ఈ పాలసీ అమల్లోకి తెస్తే... యూఎస్, కెనడా, సింగపూర్, యూరోపియన్ దేశాల సరసన మనదేశమూ నిలుస్తుంది. ప్రస్తుత నిబంధన ప్రకారం.. వ్యాపార పనులపై వచ్చే విదేశీయులు ఒక విడతలో 180 రోజుల కంటే ఎక్కువ ఇండియాలో ఉండాల్సి వస్తే ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వద్ద నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది.
 
నిబంధనల్లో కొన్ని..
* వ్యాపారవేత్త లేదా పెట్టుబడిదారుతో పాటు తన భార్య, పెళ్లికాని పిల్లలను మాత్రమే అనుమతిస్తారు.
* పిల్లల వయస్సు 18 లేదా 21 ఏళ్లకు మించకూడదు. అమెరికాలో అయితే పిల్లాడి వయసు 21 ఏళ్లు, కెనడాలో అయితే 19 ఏళ్ల లోపు ఉండాలి.
* విదేశాల్లో పెట్టే పెట్టుబడులు (నిధులు) చట్టబద్ధమైన వై ఉండాలి. సంబంధిత పెట్టుబడిదారు నమ్మకస్తుడని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అమెరికాలో అయితే బ్యాంకులు, ఆర్థిక సంస్థల రుణాలతో కాకుండా చేతిలో సొంత పెట్టుబడులు లేనిదే దరఖాస్తు చేసుకోకూడదు.
* బిజినెస్ వీసా దరఖాస్తు ప్రక్రియను అనుమతించేందుకు అభివృద్ధి చెందిన దేశాలు రెండేళ్ల సమయం తీసుకుంటే.. కరేబియన్ వంటి చిన్న దేశాలు ఆరు నెలల సమయాన్ని తీసుకుంటాయి.
* స్పెయిన్‌లో వ్యాపారంతో పాటు స్థానికంగా స్థిరాస్తిని లేదా ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయాలనే నిబంధన ఉంది.
* అర్మేనియా వంటి చిన్న దేశాల్లో స్థిరాస్తిని కొన్నా లేదా అద్దెకు తీసుకున్నా బిజినెస్ వీసా పొందొచ్చు. కాకపోతే తమ వార్షికాదాయాన్ని రుజువు చేసుకోవాలి. అది కూడా స్థానిక బ్యాంకులో డిపాజిట్ చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement