క్లిక్ చేస్తే.. పన్ను రాయితీలు | Clicking on the tax concessions .. | Sakshi
Sakshi News home page

క్లిక్ చేస్తే.. పన్ను రాయితీలు

Published Mon, Jun 22 2015 12:24 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

క్లిక్ చేస్తే.. పన్ను రాయితీలు - Sakshi

క్లిక్ చేస్తే.. పన్ను రాయితీలు

♦ ఆన్‌లైన్ లావాదేవీలకు రాయితీలు
♦ ప్రోత్సహించడానికి కేంద్రం ప్రయత్నం
♦ ముసాయిదా ప్రతిపాదనలు విడుదల
♦ జూన్ 29 వరకు అభిప్రాయ సేకరణ; తరువాత  నిర్ణయం
 
 బ్లాక్‌మనీ సమస్యను కట్టడి చేసేందుకు ప్రభుత్వం కొత్త వ్యూహాల్ని అమల్లోకి తెస్తోంది. ఇందులో భాగంగా నగదు రూపంలో జరిగే ఆర్థిక లావాదేవీలను సాధ్యమైనంతగా తగ్గించేందుకు... దానికి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రానిక్ లావాదేవీలను ప్రోత్సహించేలా కొత్త విధానాలు ప్రవేశపెడుతోంది. ఇందుకోసం ఈ-లావాదేవీలు జరిపే వారికి పన్నుపరమైన ప్రోత్సాహకాలిచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. ఎలక్ట్రానిక్ మాధ్యమంలో ఆర్థిక లావాదేవీలు జరిపితే ఇటు కొనుగోలుదారుకి, అటు విక్రేతకు కూడా పన్నులపరమైన రాయితీలు కల్పించే దిశగా ముసాయిదా ప్రతిపాదనల్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఇది ఇంకా ముసాయిదానే. దీనిపై జూన్ 29లోగా సంబంధిత వర్గాల అభిప్రాయాలు సేకరించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోనుంది.

 ఈ-లావాదేవీల పరిధిలోకి వచ్చేవి..
 ఒక ఖాతాలో నుంచి మరో ఖాతాలోకి ఎలక్ట్రానిక్ పద్ధతిలో జరిగే నగదు బదిలీ లాంటివి ఈ-లావాదేవీల పరిధిలోకి వస్తాయి. ఈ ఖాతాలు బ్యాంకుల్లోనివైనా కావొచ్చు లేదా ప్రీపెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్ సంస్థల్లో ఉండేవైనా కావొచ్చు. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, మొబైల్ వాలెట్లు, మొబైల్ యాప్స్, నెట్ బ్యాంకింగ్, ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీసు, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ (నెఫ్ట్), ఇమ్మీడియెట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) తదితర విధానాల్లో జరిపే చెల్లింపులన్నీ కూడా వీటి కిందికి వస్తాయి.

 చెల్లింపులు జరిపేవారికి  ప్రయోజనాలు ..
 వినియోగదారులు చేసే వ్యయాల్లో నిర్దిష్ట భాగాన్ని ఎలక్ట్రానిక్ పద్ధతిలో జరిపితే కొంత మేర ఆదాయ పన్నుపరమైన రాయితీ లభించే అవకాశం ఉంది. నీరు, కరెంటు బిల్లు మొదలైన యుటిలిటీస్ బిల్లులను ఎలక్ట్రానిక్ పద్ధతిలో కట్టేవారికి ఆయా సంస్థలు కొంత డిస్కౌంటు ఇవ్వొచ్చు. ఇక వ్యక్తిగత స్థాయిలో ప్రతిదానికీ క్యాష్‌ను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు కాబట్టి.. రిస్కులు సైతం తగ్గుతాయి.

 వ్యాపార సంస్థలకు ప్రయోజనాలు ..
 వ్యాపార సంస్థలు జరిపే అన్ని ఈ-లావాదేవీలపైనా విలువ ఆధారిత పన్నును (వ్యాట్) 1-2 శాతం మేర తగ్గించే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యామ్నాయంగా, లావాదేవీ విలువలో దాదాపు 50 శాతాన్ని ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా స్వీకరించిన పక్షంలోనూ సముచిత ట్యాక్స్ రిబేట్ అందించే అంశం కూడా పరిశీలనలో ఉంది.

 ప్రభుత్వానికి..
 నగదు చలామణీ కాస్త తగ్గుతుంది కనుక.. ఆ విధంగా నకిలీ కరెన్సీకి కొంత మేర అడ్డుకట్ట పడుతుంది. అలాగే ఆర్థిక వ్యవస్థలో నగదు నిర్వహణపై ప్రభుత్వం చేసే వ్యయాలూ తగ్గుతాయి. ప్రతిపాదన ప్రకారం రూ.1 లక్షకు పైగా విలువ చేసే లావాదేవీలను ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే జరపాలన్నది తప్పనిసరి కానుంది.  ప్రతి లావాదేవీ గురించి ప్రభుత్వం దగ్గర పక్కా సమాచారం ఉంటుంది కనుక పన్నుల ఎగవేత కేసులూ తగ్గుముఖం పడతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement