న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2013-14) జనవరి-మార్చి(క్యూ4)లో ప్రభుత్వ రంగ కోల్ ఇండియా రూ.4,434 కోట్ల నికర లాభాన్ని సాధించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 5,414 కోట్లతో పోలిస్తే ఇది 18% తక్కువ. బొగ్గు నాణ్యతకు సంబంధించి మరో ప్రభుత్వ దిగ్గజం ఎన్‌టీపీసీతో ఏర్పడ్డ వివాద పరిష్కారానికి రూ. 876.5 కోట్లను కేటాయించడంతో లాభాలు ప్రభావితమైనట్లు కంపెనీ పేర్కొంది. ఇదే కాలానికి ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 19,998 కోట్లకు చేరింది.
అంతక్రితం రూ. 19,905 కోట్లు నమోదైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన పూర్తి ఏడాదికి(2013-14) నికర లాభం రూ. 17,356 కోట్ల నుంచి రూ. 15,112 కోట్లకు క్షీణించింది. ఇక ఆదాయం రూ. 68,303 కోట్ల నుంచి రూ. 68,810 కోట్లకు నామమాత్రంగా పెరిగింది. దేశీయ బొగ్గు ఉత్పత్తిలో కోల్ ఇండియాకు 80% వాటా ఉంది. కాగా, గతేడాదిలో 462.53 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. అయితే 482 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. ఫలితాల నేపథ్యంలో బీఎసీలో షేరు 2% నష్టంతో రూ.374 వద్ద ముగిసింది.
కోల్ ఇండియా లాభం రూ. 4,434 కోట్లు
Published Fri, May 30 2014 3:01 AM | Last Updated on Mon, Oct 8 2018 7:36 PM
Advertisement
Advertisement