ఏపీ, టీ కంపెనీల నిధుల వేట.. | collection through IPO, rights issue | Sakshi
Sakshi News home page

ఏపీ, టీ కంపెనీల నిధుల వేట..

Published Thu, Nov 20 2014 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 4:45 PM

ఏపీ, టీ కంపెనీల నిధుల వేట..

ఏపీ, టీ కంపెనీల నిధుల వేట..

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టాక్ మార్కెట్లు నూతన శిఖరాలకు చేరి కళకళలాడుతుండటంతో దేశంలోని పలు కంపెనీలు నిధుల సేకరణపై దృష్టిసారిస్తున్నాయి. కొత్త కంపెనీలు తొలి పబ్లిక్ ఇష్యూల(ఐపీఓలు) ద్వారా, ఇప్పటికే స్టాక్ మార్కెట్లో లిస్టయిన కంపెనీలు రైట్స్ ఇష్యూ, ఇతర మార్గాల ద్వారా నిధులు సేకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.

ఈ రెండు రాష్ట్రాలకు చెందిన సుమారు 10 కంపెనీలు వచ్చే బడ్జెట్‌లోగానే మార్కెట్ నుంచి రూ. 6,000 కోట్ల నిధులు సమీకరించే యోచనలో ఉన్నాయి. వైజాగ్ స్టీల్, పవర్‌మెక్, పెబ్స్ పెన్నార్, ఎంఈఐఎల్ కంపెనీలు తొలి పబ్లిక్ ఇష్యూకి రావడానికి సిద్ధపడుతుండగా, రైట్స్ లేదా ఇతర మార్గాల్లో నిధులు సేకరించే ప్రయత్నాల్లో జీఎంఆర్, ఐవీఆర్‌సీఎల్, మోల్డ్‌టెక్, న్యూలాండ్ వంటి కంపెనీలున్నాయి. మార్కెట్ పరిస్థితులు అనుకూలించక కేంద్ర ప్రభుత్వం గత రెండేళ్లలో మూడుసార్లు వాయిదా వేసిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్- వైజాగ్ స్టీల్) తొలి పబ్లిక్ ఆఫర్ త్వరలో రానుంది.

ఈ ఆఫర్ కోసం కంపెనీ ఇటీవలే సెబీకి దరఖాస్తు చేసుకుంది. వచ్చే రెండు నెలల్లో ప్రభుత్వం ఈ ఆఫర్ రూపంలో 10 శాతం వాటా విక్రయించుకోవడం ద్వారా సుమారు రూ. 2,500 కోట్లు సేకరించవచ్చని తెలుస్తోంది. అలాగే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇన్‌ఫ్రా కంపెనీ పవర్‌మెక్ ఐపీవోకి రావడానికి అక్టోబర్ 31న సెబీకి దరఖాస్తు చేసుకుంది. విద్యుత్ కంపెనీల మౌలిక వసతులను కల్పించే పవర్‌మెక్ ఈ ఇష్యూ ద్వారా రూ. 145 కోట్లు సమీకరించనున్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం.  

2009లో పవర్‌మెక్‌లో మోతిలాల్ ఓస్వాల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ రూ. 40 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఇష్యూ ద్వారా ఈ పీఈ ఇన్వెస్టింగ్ సంస్థ మెజార్టీ వాటాను విక్రయించుకోనుంది. అలాగే ప్రి ఇంజనీర్డ్ బిల్డింగ్ వ్యాపారంలో ఉన్న పెబ్స్ పెన్నార్ ఐపీవో ద్వారా నిధులు సేకరించడానికి బోర్డు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఈ ఇష్యూ విధివిధానాలు, ఎంత సేకరించాలన్న దానిపై చర్చిస్తున్నామని, త్వరలోనే పూర్తి వివరాలు తెలియచేస్తామని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.  

అలాగే గతంలో మార్కెట్ పరిస్థితులు బాగోలేక ఐపీవో ఆలోచనలు విరమించుకున్న మరో ఇన్‌ఫ్రా కంపెనీ మెఘా ఇంజనీరింగ్ (ఎంఈఐఎల్) మళ్లీ ఇప్పుడు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. మార్కెట్ పరిస్థితులు బాగుంటే వచ్చే మూడు నాలుగు నెలల్లో పబ్లిక్ ఇష్యూకి వచ్చే ఆలోచనలో ఉన్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. మరోవైపు జీఎంఆర్ ఇన్‌ఫ్రా రూ. 1,500 కోట్లు, ఐవీఆర్‌సీఎల్ రూ. 300 కోట్లు రైట్స్ ఇష్యూ ద్వారా సమీకరించనున్నాయి. న్యూలాండ్ ల్యాబ్ రూ. 25 కోట్ల రైట్స్ ఇష్యూకి అనుమతి కోరుతూ సెబీకి దరఖాస్తు చేసుకుంది. రూ. 60 కోట్ల నిధుల సమీకరణకు బుధవారం సమావేశమైన మోల్డ్ టెక్ బోర్డు ఆమోదం తెలిపింది. మొత్తం మీద చూస్తే వచ్చే ఏడాది ప్రారంభంలో పెద్ద ఎత్తున వివిధ కంపెనీల ఇష్యూలు వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 ఆరునెలల్లో 25 కంపెనీల ఇష్యూలు...
 ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనివిధంగా గత సెప్టెంబర్ నెలలో 14 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి రావడం ద్వారా రూ. 562 కోట్లు సమీకరించాయి. అలాగే గడచిన ఆరు నెలల్లో మొత్తం 25 కంపెనీలు పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 1,019 కోట్లు సమీకరించినట్లు నియంత్రణ సంస్థ సెబీ గణాంకాలు తెలియచేస్తున్నాయి. ఇందులో అత్యధికంగా చిన్న కంపెనీలే ఉండటం విశేషం. గత రెండు నెలల్లో ఐపీవో ద్వారా నిధులు సేకరించడానికి అనుమతి కోరుతూ సెబీకి దరఖాస్తు చేసుకున్నాయి. పెద్ద ఇష్యూలు విజయవంతం కావడంతో కంపెనీలకు మార్కెట్‌పై నమ్మకం ఏర్పడింది. శారదా కార్ప్‌కెమ్ రూ. 352 కోట్ల పబ్లిక్ ఇష్యూకి, ఎన్‌సీసీ రూ. 600 కోట్ల రైట్స్‌కి ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన వచ్చింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement