క్వికర్ చేతికి కామన్‌ఫ్లోర్!
క్వికర్ చేతికి కామన్‌ఫ్లోర్!
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ క్లాసిఫైడ్ సంస్థ క్వికర్... రియల్ ఎస్టేట్ పోర్టల్ కామన్‌ఫ్లోర్ డాట్‌కామ్‌ను 10 కోట్ల నుంచి 20 కోట్ల డాలర్ల ధరకు కొనుగోలు చేయనున్నదని సమాచారం. దీనికి సంబంధించి చర్చలు తుదిదశలో ఉన్నాయని, త్వరలోనే ఒప్పందం ఖరారు కానున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా, మార్కెట్ ఊహాగానాలపై స్పందించబోమని ఇరు సంస్థలు పేర్కొన్నాయి.
రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మరింత పటిష్టవంతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, అయితే మార్కెట్ ఊహాగానాలపై వ్యాఖ్యానించబోమని క్వికర్ ప్రతినిధి చెప్పారు. 2007లో సుమిత్ జైన్, లలిత్ మంగళ్, వికాస్ మాల్పానీ కలిసి కామన్‌ఫ్లోర్ డాట్‌కామ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఇప్పటికే యాక్సెల్ పార్ట్‌నర్స్, టైగర్ గ్లోబల్, గూగుల్ క్యాపిటల్ సంస్థల నుంచి 6 కోట్ల డాలర్ల నిధులను సమీకరించింది. నిధుల సమీకరణ కోసం చూస్తున్నామని, అయితే ఇంతవరకూ ఎలాంటి ఒప్పందం తుదిదశకు రాలేదని కామన్‌ఫ్లోర్ పేర్కొంది.