గణాంకాలు, ఫలితాలే దిశా నిర్దేశం! | The consequences of West Asia are crucial | Sakshi
Sakshi News home page

గణాంకాలు, ఫలితాలే దిశా నిర్దేశం!

Published Mon, Nov 13 2017 1:59 AM | Last Updated on Mon, Nov 13 2017 1:59 AM

The consequences of West Asia are crucial - Sakshi

ద్రవ్యోల్బణ గణాంకాలు, ఈ వారంలో వెలువడే కంపెనీల క్యూ2 ఫలితాలు, పశ్చిమాసియా పరిణామాలు, ఈ పరిణామాల పర్యవసానంగా కదిలే ముడి చమురు ధరలు.. ఈ వారం మార్కెట్‌ గమనాన్ని నిర్దేశిస్తా యని విశ్లేషకుల అంచనా. వీటితో పాటు ప్రపంచ మార్కెట్ల పోకడ, విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు..స్టాక్‌సూచీల కదలికలపై ప్రభావం చూపుతాయని వారంటున్నారు.

గణాంకాలు..
గత శుక్రవారం మార్కెట్‌ ముగిసిన తర్వాత సెప్టెంబర్‌ నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలను ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఆగస్టులో 4.3 శాతంగా ఉన్న పారిశ్రామికోత్పత్తి ఈ సెప్టెంబర్‌లో 3.8 శాతానికి తగ్గింది. పారిశ్రామికోత్పత్తి క్షీణించడం స్టాక్‌ మార్కెట్‌పై ఒకింత ప్రతికూల ప్రభావం చూపించవచ్చు.

నేడు(సోమవారం–ఈ నెల 13న) మార్కెట్‌ ముగిసిన తర్వాత అక్టోబర్‌ నెల రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలను ప్రభుత్వం ప్రకటిస్తుంది. సెప్టెంబర్, ఆగస్టుల్లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 3.28 శాతం రేంజ్‌లోనే ఉంది. ఇక టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు రేపు(మంగళవారం–ఈ నెల 14న) స్టాక్‌  మార్కెట్‌ ట్రేడింగ్‌ సమయంలోనే వెల్లడవుతాయి. ఈ ఆగస్టులో 3.24 శాతంగా ఉన్న టోకు ధరల ద్రవ్యోల్బణం ఈ సెప్టెంబర్‌లో 2.6 శాతానికి తగ్గింది.

ఈ వారంలో 400 కంపెనీల క్యూ2 ఫలితాలు...
కంపెనీల క్యూ2 ఫలితాలు దాదాపు చివరి దశకు వచ్చాయి. ఈ వారంలో దాదాపు 400 కంపెనీలు క్యూ2 ఫలితాలను వెల్లడించనున్నాయి. వీటిల్లో 350 కంపెనీలు ఈ వారం మొదటి రెండు రోజుల్లోనే(నేడు, రేపు) ఈ ఫలితాలను వెల్లడిస్తాయి. శనివారం వెలువడిన కోల్‌ ఇండియా, ఎల్‌ అండ్‌ టీ ఫలితాల ప్రభావం నేడు మార్కెట్‌పై, ఆయా రంగ షేర్లపై ఉండనున్నది.

నేడు(సోమవారం)  ఐడియా సెల్యులార్, ఎన్‌టీపీసీ, అదానీ పోర్ట్స్, ఎన్‌ఎండీసీ, స్పైస్‌జెట్, యునైటెడ్‌ బ్యాంక్‌ కంపెనీలు తమ క్యూ2 ఫలితాలను వెల్లడిస్తాయి. రేపు (మంగళవారం– ఈ నెల 14న) ఐషర్‌ మోటార్స్, గెయిల్, సన్‌ఫార్మా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, క్యాడిలా హెల్త్‌కేర్, జైప్రకాశ్‌ అసోసియేట్స్, యూనిటెక్‌లు.. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తాయి.  

కన్సాలిడేషన్‌ కొనసాగుతుంది..!
ప్రస్తుత ఫలితాలను బట్టి చూస్తే, జీఎస్‌టీ సంబంధిత సమస్యలను కంపెనీలు అధిగమించినట్లే కనిపిస్తోందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. చమురు ధరల జోరు కొనసాగితే మార్కెట్లో కన్సాలిడేషన్‌ కొనసాగుతుందని ఆయన అంచనా వేస్తున్నారు.  పశ్చిమాసియా దేశాల్లో పరిణామాలు, చమురు ధరల గమనం ప్రభావం ఈ వారం మార్కెట్‌పై ఉంటుందని కోటక్‌ రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ టీనా వీర్మాని చెప్పారు.

లిస్టింగ్స్‌
ఈ వారంలో మూడు కంపెనీలు స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ కానున్నాయి. నేడు(సోమవారం) న్యూ ఇండియా అష్యూరెన్స్‌ కంపెనీ షేర్లు లిస్టవుతాయి. ఈ నెల 1–3 మధ్య రూ.770–800 ప్రైస్‌బాండ్‌తో వచ్చిన ఈ ఐపీఓ 1.19 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.9,600 కోట్లు సమీకరించింది.

ఈ నెల 2–6 మధ్య ఐపీఓకు వచ్చిన ఖదిమ్‌ ఇండియా కంపెనీ షేర్లు మంగళవారం (ఈ నెల 14న) స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ కానున్నాయి. రూ.745–750 ప్రైస్‌బాండ్‌తో వచ్చిన రూ.543 కోట్ల ఈ ఐపీఓ 1.9 రెట్లు ఓవర్‌ సబ్‌స్రైబయింది. ఈ నెల 7–9 మధ్య ఐపీఓకు వచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ షేర్లు ఈ నెల 17న (శుక్రవారం) స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ కానున్నాయి. రూ.8,695 కోట్ల ఈ ఐపీఓ 4.9 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది.
 

పుంజుకుంటున్న విదేశీ ఈక్విటీ పెట్టుబడులు
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) పెట్టుబడులు మన ఈక్విటీ మార్కెట్లో మళ్లీ పుంజుకుంటున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు రూ.9,710 కోట్లు (150 కోట్ల డాలర్ల) మేర పెట్టుబడులు పెట్టారు. బ్యాంక్‌లకు రూ.2.11 లక్షల కోట్ల మేర మూలధన నిధులు, రహదారుల కోసం రూ.6 లక్షల కోట్లు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయాలు దీనికి కారణాలని నిపుణులంటున్నారు.

కంపెనీల క్యూ2 ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉండడం వల్ల విదేశీ పెట్టుబడులు కొనసాగుతాయని షేర్‌ఖాన్‌ హెడ్‌(అడ్వైజరీ) హేమంగ్‌ జని పేర్కొన్నారు. ఇటీవల వరకూ డెట్‌మార్కెట్లో జోరుగా పెట్టుబడులు పెట్టిన ఎఫ్‌పీఐలు ఈ నెలలో ఇప్పటివరకూ రూ.780 కోట్ల మేర తమ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. మరోవైపు మన క్యాపిటల్‌ మార్కెట్లో పార్టిసిపేటరీ నోట్లు(పీ–నోట్స్‌) పెట్టుబడులు ఈ సెప్టెంబర్‌లో ఎనిమిదేళ్ల కనిష్టానికి, రూ.1,22,684 కోట్లకు పడిపోయాయి. పీ నోట్ల పెట్టుబడులపై మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ తీసుకున్న కఠిన నిర్ణయాలే దీనికి కారణం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement