ద్రవ్యోల్బణం పెరిగింది.. ఉత్పత్తి తగ్గింది!
ద్రవ్యోల్బణం పెరిగింది.. ఉత్పత్తి తగ్గింది!
Published Wed, Apr 12 2017 6:44 PM | Last Updated on Tue, Sep 5 2017 8:36 AM
న్యూఢిల్లీ : వినియోగదారుల ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్ట స్థాయికి ఎగిసింది. ఇంధన ధరలు పెరుగడంతో మార్చి నెల ద్రవ్యోల్భణం పెరిగినట్టు బుధవారం విడుదలైన డేటాలో వెల్లడైంది. ధరలు పెరుగుతాయని ముందుగానే ఊహించిన రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా పాలసీ రేట్లను యథాతథంగా ఉంచింది. వారి అంచనాల మేరకే ద్రవ్యోల్బణం ఎగిసింది. గత నెల వినియోగదారుల ద్రవ్యోల్బణం 3.81 శాతం పైకి ఎగిసినట్టు ప్రభుత్వ డేటాలో తెలిసింది. 2016 అక్టోబర్ నుంచి ఇదే అత్యంత వేగవంతమైన పెరుగుదలని తేలింది.
ఫిబ్రవరి నెలలో ద్రవ్యోల్బణం 3.65 శాతానికి ఎగిసినప్పటికీ, ఇంత వేగంగా పెరుగలేదని గణాంకాల మంత్రిత్వశాఖ డేటాలో వెల్లడైంది. ఫిబ్రవరి నెలలో 3.91శాతంగా ఉన్న రిటైల్ ఇంధన ద్రవ్యోల్బణం మార్చి నెలలో ఏకంగా 5.56 శాతానికి పెరిగింది. ఆహారపు ధరలు కూడా 1.93 శాతం పైకి వెళ్లాయి. కానీ ముందస్తు నెలతో పోల్చుకుంటే ఇది తక్కువేనని తెలిసింది. ఓ వైపు వినియోగదారుల ద్రవ్యోల్బణం పెరుగగా.. మరోవైపు పారిశ్రామికోత్పత్తి అనూహ్యంగా ఫిబ్రవరి నెలలో 1.2 శాతం పడిపోయింది. జనవరి నెలలో ఈ ఉత్పత్తి 2.7 శాతం వృద్ధి నమోదుచేసుకుంది. కానీ పారిశ్రామికోత్పత్తి 1.3 శాతం వృద్ధి నమోదుచేస్తుందని రాయిటర్స్ అంచనావేసింది. ప్రస్తుతం రాయిటర్స్ అంచనాలు తప్పాయి.
Advertisement
Advertisement