హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కోరమాండల్ ఇంటర్నేషనల్ నికర లాభం 35 శాతం పెరిగి రూ. 93 కోట్లుగా (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో కంపెనీ లాభం రూ. 69 కోట్లు. ఆదాయం రూ. 2,998 కోట్ల నుంచి రూ. 3,021 కోట్లకు పెరిగింది. మెరుగైన పనితీరుకు క్రిమిసంహారకాల వ్యాపార విభాగం దోహదపడిందని ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కోరమాండల్ ఇంటర్నేషనల్ చైర్మన్ ఎ. వేలాయన్ తెలిపారు. రూ. 1 ముఖ విలువ గల షేరు ఒక్కింటిపై రూ.4 మేర తుది డివిడెండును కంపెనీ ప్రకటించింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను లాభం రూ. 402 కోట్ల నుంచి రూ. 361 కోట్లకు తగ్గింది.