న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ .. దేశీ స్మార్ట్‌ఫోన్స్ పరిశ్రమను కూడా కలవరపెడుతోంది. పరికరాలు, సబ్–అసెంబ్లీస్ కోసం చైనాపై ఆధారపడిన దేశీ కంపెనీలకు .. సరఫరాపరమైన సమస్యలతో క్రమంగా సెగ తగులుతోంది. చైనాలో మూతబడిన ఫ్యాక్టరీలు మళ్లీ తెరుచుకుని, ఈ వారంలోనైనా ఉత్పత్తుల సరఫరా ప్రారంభమవుతుందేమోనని స్మార్ట్‌ఫోన్ సంస్థలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ‘దేశీ పరిశ్రమపై కరోనా వైరస్ ప్రభావం ఉంది. కొన్ని ఉత్పత్తులు, మోడల్స్‌పై ఇది స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, కొన్ని ఫ్యాక్టరీలు దశలవారీగా మళ్లీ ఉత్పత్తి ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రభావ తీవ్రతపై ఇప్పుడే ఒక అంచనాకు రావడం సాధ్యపడదు‘ అని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) చైర్మన్ పంకజ్ మహింద్రూ తెలిపారు. దీనిపై మరింత వివరణ ఇచ్చేందుకు నిరాకరించిన మహింద్రూ.. దేశీ పరిశ్రమ ఈ వారమంతా వేచి, చూడాలని భావిస్తోందని పేర్కొన్నారు. మరోవైపు, దేశీ స్మార్ట్‌ఫోన్ సంస్థలకు అవసరమైన కీలక పరికరాలన్నీ చైనా నుంచే రావాల్సి ఉన్నందున.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అస్సలు బాగాలేవని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
ఇక డిమాండ్ లేక మార్కెట్‌లో మందగమనం పరిశ్రమను మరింత కలవరపెడుతోందని పేర్కొన్నాయి. కాగా, సరఫరాపరమైన సమస్యలకు సంబంధించి ప్రస్తుతానికైతే భారత్‌లో స్టాక్స్, ఉత్పత్తిపై పెద్దగా ప్రతికూల ప్రభావమేమీ లేదని స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ రియల్‌మీ తెలిపింది. మరోవైపు, ఓ భారీ స్థాయి కాంట్రాక్ట్ తయారీ సంస్థ చైనాలోని ఒక ప్లాంటులో కార్యకలాపాలు తిరిగి ప్రారంభించినట్లు వార్తలు వచ్చాయి. కొద్ది సిబ్బందితో పనులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. కరోనా వైరస్ బారిన పడి చైనాలో మరణించిన వారి సంఖ్య వెయ్యి దాటిపోయింది. చైనా వెలుపల ఇతర దేశాల్లో 350 పైగా కేసులు నమోదయ్యాయి. హాంకాంగ్, ఫిలిప్పీన్స్ దేశాల్లో కూడా ఇద్దరు మృత్యువాత పడ్డారు.
మధ్యకాలికంగా సరఫరా ఇక్కట్లు: ఇండ్–రా
కరోనా వైరస్ కారణంగా మధ్యకాలికంగా సరఫరా వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదముందని రేటింగ్ ఏజెన్సీ ఇండ్–రా తెలిపింది. అయితే, వైరస్ ఒకవేళ హుబె ప్రావిన్స్‌కే పరిమితమైతే.. సమీప కాలంలో భారతీయ సంస్థలపై పెద్దగా ప్రతికూల ప్రభావం పడకపోవచ్చని తెలిపింది. కానీ, ‘కరోనా తీవ్రత మరో మూడు 4 నెలలు కొనసాగిందంటే మాత్రం ఫార్మా, టెక్స్‌టైల్స్, వాహన సంస్థలకు కీలకమైన ముడి వస్తువుల సరఫరాపరమైన సమస్యలు రావొచ్చు. ఇది 2003లో వచ్చిన సార్స్ ప్రభావాల కన్నా ఎక్కువగా ఉండొచ్చు‘ అని ఇండ్–రా వివరించింది.
మొబైల్ కాంగ్రెస్‌కు దిగ్గజాలు దూరం..
కరోనా వైరస్ (ఎన్‌సీపీ) ప్రబలుతున్న నేపథ్యంలో త్వరలో జరగబోయే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2020కి (ఎండబ్ల్యూసీ) దూరంగా ఉండాలని భావిస్తున్న కంపెనీల సంఖ్య పెరుగుతోంది. తాజాగా చైనాకు చెందిన హ్యాండ్‌సెట్ సంస్థ వివో, చిప్‌సెట్ సంస్థ ఇంటెల్‌తో పాటు పలు గ్లోబల్ బ్రాండ్స్ .. ఇందులో పాల్గొనడం లేదని ప్రకటించాయి. తమ ఉద్యోగులు, ఇతరత్రా ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివో ఒక ప్రకటనలో తెలిపింది. జీఎస్‌ఎం అసోసియేషన్ తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్త చర్యలు అభినందనీయమైనప్పటికీ ఎండబ్ల్యూసీకి దూరంగా ఉండటమే శ్రేయస్కరమని తాము భావిస్తున్నట్లు సాఫ్ట్‌వేర్ సేవలందించే యామ్‌డాక్స్ పేర్కొంది. అయితే, పరిస్థితులను బట్టి షెడ్యూల్ ప్రకారమే ఎండబ్ల్యూసీలో పాల్గొంటామని వివో అనుబంధ సంస్థ ఒపో వెల్లడించింది. ఎరిక్సన్, అమెజాన్, సోనీ వంటి దిగ్గజాలు ఇప్పటికే ఎండబ్ల్యూసీలో పాల్గొనటం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే.
షెడ్యూల్ ప్రకారమే కాంగ్రెస్...
ఫిబ్రవరి 24–27 తేదీల మధ్య స్పెయిన్‌లోని బార్సెలోనాలో మొబైల్ కాంగ్రెస్ జరగనుంది. అయితే, కరోనా వైరస్ భయాల కారణంగా చైనా నుంచి రావాల్సిన 5,000–6,000 మంది దాకా డెలిగేట్లు హాజరు కాలేకపోతున్నారని మొబైల్ కాంగ్రెస్ నిర్వహించే జీఎస్‌ఎం అసోసియేషన్ వెల్లడించింది. అయినప్పటికీ అన్ని జాగ్రత్తలూ తీసుకుని, షెడ్యూల్ ప్రకారమే ఎండబ్ల్యూసీని నిర్వహించనున్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment