సాక్షి, ముంబై: కరోనా వైరస్ (కోవిడ్ -19) లాక్‌డౌన్ నేపథ్యంలో కష్టాల్లో ఉన్న తమ ఉద్యోగులకు ప్రముఖ టెక్ సేవల సంస్థ కాగ్నిజెంట్ భారీ ఊరట కల్పించింది. భారతదేశం, ఫిలిప్పీన్స్ దేశాల్లో తన ఉద్యోగులకు సహాయం చేసేందుకు నిర్ణయించింది, అసోసియేట్ స్థాయి వరకు ఉద్యోగులకు ఏప్రిల్ నెలకు మూలవేతనంలో 25 శాతం అదనంగా చెల్లించనుంది. తాజా నిర్ణయం భారత్‌లో ఉన్న మూడింట రెండు వంతుల కాగ్నిజెంట్ ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. ఈ విధానాన్ని నెలవారీగా సమీక్షిస్తామని కంపెనీ తెలిపింది. (లాక్డౌన్: ఏంటి సర్.. మీకిది కూడా తెలియదా?)
ఉద్యోగుల ఆరోగ్యం, భద్రతను నిర్ధారించేందుకు, ఖాతాదారులకు సురక్షతమైన సేవలను కొనసాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ వెల్లడించింది. అంతేకాదు ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో ఇంటినుంచే పనిచేసేందుకు ఎక్కువ మందికి అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో ఆయా ఉద్యోగులకు కొత్త ల్యాప్‌టాప్‌లను అందించడం, డెస్క్‌టాప్ ఎన్ క్రిప్టింగ్, అదనపు బ్యాండ్‌విడ్త్ కనెక్టివిటీ, ఎయిర్ కార్డులను అందించడం లాంటి కీలక చర్యల్నికూడా తీసుకుంది. అన్ని గ్లోబల్ కంపెనీల మాదిరిగానే, పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రభావానికి తాము కూడా గురవుతున్నామని కంపెనీ తెలిపింది. (కరోనా కథ.. ఇల్లే సురక్షితం)
ఈ క్లిష్ట సమయంలో మనమందరం ప్రతిరోజూ కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నాం..అయినా ఒకరికొకరం సాయం చేసుకుంటూ కలిసికట్టుగా, ధైర్యంతో పనిచేస్తూ సవాళ్లను అధిగమిద్దాం అని కాగ్నిజెంట్ సీఈవో బ్రియాన్ హంఫ్రీస్ ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వీరోచితంగా పనిచేస్తున్న ఉద్యోగ బృందాలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారి సేవల్నీ ఎప్పటికీ మర్చిపోలేమనీ, విశేష సేవలందించిన కీలక ఉద్యోగులు, ముఖ్య వ్యక్తులకు బహుమతి ఇచ్చేలా భవిష్యత్తులో నిర్దిష్ట చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. (కరోనా మూడో దశకు చేరుకుంటే?)
Comments
Please login to add a commentAdd a comment