మార్కెట్‌కు చమురు నష్టాలు | Crude Oil Prices Jumped Higher | Sakshi
Sakshi News home page

మార్కెట్‌కు చమురు నష్టాలు

Published Sat, Jan 4 2020 1:46 AM | Last Updated on Sat, Jan 4 2020 1:46 AM

Crude Oil Prices Jumped Higher - Sakshi

ముడి చమురు ధరలు భగ్గుమనడంతో శుక్రవారం మన మార్కెట్‌ నష్టపోయింది. అమెరికా డ్రోన్‌ దాడిలో ఇరాన్‌ కమాండర్‌ ఖాసీమ్‌ సులేమాని మరణించడం, దీనికి తగిన ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ హెచ్చరించడంతో ముడి చమురు ధరలు పెరిగి ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి.  ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్‌ కూడా నష్టపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 37 పైసలు పతనమై 71.75కు చేరడం ప్రతికూల ప్రభావం చూపించింది.దీంతో కొత్త ఏడాది వరుస రెండు రోజుల లాభాలకు బ్రేక్‌ పడింది. ఇంట్రాడేలో 278 పాయింట్ల మేర పతనమైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ చివరకు 162 పాయింట్లు పతనమై 41,465 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 56 పాయింట్ల నష్టంతో 12,227 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక వారం పరంగా చూస్తే, మార్కెట్‌ నష్టపోయింది. సెన్సెక్స్‌ 111 పాయింట్లు, నిఫ్టీ 19 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.

చివర్లో ఒకింత రికవరీ 
అమెరికా డ్రోన్‌ దాడిలో ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కమాండర్‌ ఖాసీమ్‌ మరణించడం, దీనికి ప్రతి దాడులు చేస్తామని ఇరాన్‌ హెచ్చరించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా పెరగనున్నాయి. ఈ దాడి నేపథ్యంలో సురక్షిత సాధనాలైన పుత్తడి, జపాన్‌ కరెన్సీ యెన్‌ల్లోకి రిస్క్‌ అధికంగా ఉన్న ఈక్విటీల నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయి. ఈ దాడి కారణంగా ముడి చమురు ధరలు 4.4 శాతం మేర పెరిగాయి. మధ్యాసియాలో ఉద్రిక్తతలు చెలరేగుతుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని, మార్కెట్‌ రికార్డ్‌ల స్థాయిల్లో ఉండటంతో లాభాల స్వీకరణకు మొగ్గు చూపే అవకాశాలున్నాయని  జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఎనలిస్ట్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. డాలర్‌ బలపడటంతో ఐటీ షేర్లు ఎగిశాయని పేర్కొన్నారు. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, యూరప్‌ మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్‌ లాభాల్లో మొదలైనప్పటికీ, వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. రోజంతా నష్టాలు కొనసాగాయి. ట్రేడింగ్‌ చివర్లో కొంత రికవరీ చోటు చేసుకోవడంతో నష్టాలు తగ్గాయి.

►రూపాయి పతనం కారణంగా ఐటీ, ఫార్మా షేర్లు లాభపడ్డాయి.  
►ముడి చమురు ధరలు పెరగడంతో ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు పతనమయ్యాయి. హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ షేర్లు 0.04–2.1 శాతం రేంజ్‌లో నష్టపోయాయి. ముడి చమురును ముడి పదార్థంగా వినియోగిస్తున్న పెయింట్స్, విమానయాన కంపెనీల షేర్లు కూడా నష్టపోయాయి.  
►ఏషియన్‌ పెయింట్స్‌  షేర్‌ 2.1 శాతం నష్టంతో రూ.1,752 వద్ద ముగిసింది. పెయింట్ల తయారీలో ముడి పదార్థంగా ముడి చమురు ఉత్పత్తులను వినియోగిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement