యూరో ప్యాకేజీ ఆశలతో.. | Crude Oil Prices Recover | Sakshi
Sakshi News home page

యూరో ప్యాకేజీ ఆశలతో..

Published Sat, Jan 23 2016 12:33 AM | Last Updated on Sun, Sep 3 2017 4:07 PM

యూరో ప్యాకేజీ ఆశలతో..

యూరో ప్యాకేజీ ఆశలతో..

ప్రపంచవ్యాప్తంగా ఎగిసిన మార్కెట్లు
క్రూడ్ ర్యాలీ, రూపాయి రికవరీ ప్రభావం
473 పాయింట్ల లాభంతో 24,436కు సెన్సెక్స్
146 పాయింట్ల లాభంతో 7,422కు నిఫ్టీ

 
 స్టాక్ మార్కెట్ ర్యాలీ కారణంగా ఇన్వెస్టర్ల సంపద ఒక్క శుక్రవారం రోజే రూ.1.7 లక్షల కోట్లు పెరిగింది. దీంతో మొత్తం బీఎస్‌ఈలో లిస్టైన
 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.92,03,826 కోట్లకు ఎగిసింది.

 
 ముంబై: యూరోజోన్ నుంచి తాజాగా ఉద్దీపన ప్యాకేజీ వస్తుందన్న అంచనాలతో పాటు ముడి చమురు ధరలు రికవరీ కావడంతో ప్రపంచ మార్కెట్లలో రిలీఫ్ ర్యాలీ చోటుచేసుకుంది.  దీంతో భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం భారీ లాభాల్లో ముగిసింది.  డాలర్‌తో రూపాయి మారకం 29 నెలల కనిష్ట స్థాయి నుంచి రికవరీ అయి రూపాయి 39 పైసలు లాభపడడం సానుకూల ప్రభావం చూపించింది.
 
బీఎస్‌ఈ సెన్సెక్స్ 20 నెలల కనిష్ట స్థాయి నుంచి కోలుకుంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 7,400 పాయింట్ల మార్క్‌ను దాటింది. సెన్సెక్స్ 473 పాయింట్లు లాభపడి 24,436 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 146 పాయింట్ల (2%)లాభంతో 7,422 పాయింట్ల వద్ద ముగిశాయి. గత ఏడాది అక్టోబర్ 5  తర్వాత ఒక్కరోజులో సెన్సెక్స్ ఇన్ని పాయింట్లు లాభపడడం ఇదే మొదటిసారి. అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ముగిశాయి. ఇటీవల బాగా పతనమైన బ్యాంక్, వాహన, ఆయిల్, ఇన్‌ఫ్రా షేర్లలో షార్ట్ కవరింగ్ జరగడం, ఈ షేర్లు ఆకర్షణీయ ధరల్లో  కొనుగోళ్లు జోరుగా జరగడం సానుకూల ప్రభావం చూపించాయి.
 
వరుసగా మూడో వారమూ స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే ముగిసింది. మార్చికల్లా యూరోప్ కేంద్ర బ్యాంక్ అదనపు ప్యాకేజీ ఇస్తుందన్న అంచనాల కారణంగా స్టాక్ మార్కెట్ పెరిగిందని జియోజిత్ బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు.

 26 సెన్సెక్స్ షేర్లు లాభాల్లోనే....
 30 సెన్సెక్స్ షేర్లలో 26 షేర్లు లాభాల్లో ముగిశాయి. చిన్న సైజ్ డీజిల్ ఇంజిన్‌ను ఆవిష్కరించిన నేపథ్యంలో మహీంద్రా అండ్ మహీంద్రా 4.5 శాతం ఎగసింది. గెయిల్ 7.9 శాతం, మారుతీ సుజుకీ 5.5%, టాటా స్టీల్ 5.3%, హీరో మోటొకార్ప్ 5.1%, ఎస్‌బీఐ 4.8%, డాక్టర్ రెడ్డీస్ 4.5%, మహీంద్రా అండ్ మహీంద్రా 4.4%, ఓఎన్‌జీసీ 4.2%, కోల్ ఇండియా 4% చొప్పున పెరిగాయి.  
 
  ఎయిర్‌బస్ నుంచి రావలసినవిమానాలు మరింత ఆలస్యమవుతాయనే వార్తలు, ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్(ఇండిగో) షేర్ 19% క్షీణించింది. జెట్ ఎయిర్‌వేస్, స్పైస్‌జెట్ 5-6 శాతం రేంజ్‌లో పతనమయ్యాయి.  
 
 ఆసియా మార్కెట్లన్నీ లాభాల్లోనే...
 మార్చి నెలలో జరిగే సమావేశంలో ప్యాకేజీ ఇవ్వాలన్న ఆలోచనలున్నాయని యూరప్ కేంద్ర బ్యాంక్ చీఫ్ మారియో డ్రాఘి వెల్లడించడంతో ప్రపంచ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఆసియా మార్కెట్లన్నీ లాభాల్లో ముగిశాయి. జపాన్ నికాయ్ 5.6%, షాంఘై కాంపొజిట్ 1.2%, హాంగ్‌కాంగ్ హాంగ్‌సెంగ్ 2.8% చొప్పున పెరిగాయి. యూరప్ స్టాక్ మార్కెట్లు శుక్రవారం కూడా ర్యాలీని కొనసాగించాయి.
 
 చలితో పెరిగిన చమురు ధరలు
 అమెరికా, యూరప్‌లో చలి తీవ్రత పెరగడంతో హీటింగ్ ఆయిల్‌కు డిమాండ్ పెరగవచ్చనే అంచనాలతో ముడి చమురు ధరలు వేడెక్కాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్లు పెరగడంతో రికార్డ్ స్థాయి షార్ట్ పొజిషన్లు కూడా క్రూడ్ ధరలు భగ్గుమనడానికి ఆజ్యం పోశాయని నిపుణులంటున్నారు. కడపటి సమాచారం అందేసరికి బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 6% లాభంతో 31.24 డాలర్లకు, నెమైక్స్ క్రూడ్ 5.8% లాభంతో 31.38 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. 3 నెలల్లో ఇదే అతి పెద్ద ర్యాలీ.
 
చైనా బబుల్ బరస్ట్ !
 రానున్న రోజుల్లో షార్ట్ కవరింగ్ ర్యాలీలు చోటు చేసుకుంటాయని, అయితే మధ్య కాలానికి నిఫ్టీ 7,000 దిగువకు రాక తప్పదని నిపుణులంటున్నారు. చైనా బబుల్ బద్దలవడానికి సిద్ధంగా ఉందని, సెన్సెక్స్ 20 వేల పాయింట్ల దిగువకు రానున్నదని స్టాక్ మార్కెట్ ప్రఖ్యాత విశ్లేషకులు మార్క్ ఫేబర్ అంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement