సాక్షి, న్యూఢిల్లీ : స్టార్టప్‌ల్లో గత ఏడాది అత్యధిక వేతన పెంపును అందుకున్న వారిలో డేటా సైంటిస్టులు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్లు ముందువరుసలో ఉన్నారు. 2017లో వీరు అంతకుముందు ఏడాదితో పోలిస్తే సగటున 25 శాతం మేర వేతన వృద్ధిని పొందారు. హైరింగ్ కంపెనీ బిలాంగ్ గణాంకాల ప్రకారం డేటా సైంటిస్టులకు మెరుగైన డిమాండ్ నెలకొంది. వ్యాపార మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలను సమాచారాన్ని కంప్యూటింగ్ విధానాల ద్వారా సేకరించి, విశ్లేషించి క్రోడీకరించే క్రమంలో డేటా సైంటిస్టుల పాత్ర కీలకం. వీరికి గణితశాస్త్రం, కంప్యూటర్ సైన్స్‌ల్లో పట్టుతో పాటు ప్రస్తుత ట్రెండ్స్‌పై అవగాహన ఉండాలి.
దేశంలోని 40 ప్రముఖ స్టార్టప్‌ల్లో మూడు నుంచి ఐదేళ్ల అనుభవం కలిగిన డేటా సైంటిస్టుల వార్షిక వేతనం గత ఏడాది రూ 25-29 లక్షల వరకూ పెరిగింది. కృత్రిమ మేథ రాకతో పలు కంపెనీలు పెద్ద సంఖ్యలో డేటా అనాలిసిస్ టీమ్‌లను బలోపేతం చేస్తున్నాయని బిలాంగ్ సహవ్యవస్ధాపకులు రిషబ్ కౌల్ చెప్పారు. మరోవైపు యూజర్లకు, బ్యాకెండ్ ప్రోగ్రామర్లకు మధ్య వారధిలా వ్యవహరించే ఫ్రంట్ ఎండ్ డవలపర్లకూ గత ఏడాది భారీగా వేతన పెంపు నమోదైంది. వీరు ప్రస్తుతం సంవత్సరానికి రూ 18 లక్షల నుంచి 22 లక్షల వరకూ ఉంది. 2014లో వీరి వార్షిక వేతనం కేవలం రూ 10 లక్షల నుంచి రూ 13 లక్షల మధ్య ఉండేది. ఇక సెక్యూరిటీ ఆర్కిటెక్ట్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ల వంటి సైబర్ సెక్యూరిటీ విభాగ సిబ్బంది వేతనాలు సైతం గత ఏడాది భారీగా పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment