మార్కెట్లో తీవ్ర హెచ్చుతగ్గులు!
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ప్రభావం చూపుతాయ్...
* జీడీపీ, ఐఐపీ డేటా కూడా...
* ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ, కోల్ ఇండియాల ఫలితాలపై దృష్టి
* ఈ వారం మార్కెట్ ట్రెండ్‌పై నిపుణుల అంచనా...
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ (ఏఏపీ) విజయం సాధించవచ్చంటూ వెలువడిన ఎగ్జిట్‌పోల్స్‌కు అనుగుణంగా ఈ సోమవారం స్టాక్ మార్కెట్లు స్పందిస్తాయని, అటుతర్వాత మంగళవారం ప్రకటితమయ్యే వాస్తవ ఎన్నికల ఫలితాలకు అనుగుణంగా మార్కెట్లు కదలవచ్చని నిపుణులు అంచనావేస్తున్నారు. ఢిల్లీ ఫలితాలు జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపించే అవకాశం వున్నందున, స్టాక్ సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతాయని వారంటున్నారు.
ఈ వారం వెలువడే జీడీపీ, పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ)గణాంకాలు, కొన్ని బ్లూచిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ట్రెండ్‌ను నిర్దేశించే పలు అంశాల కారణంగా మార్కెట్లో ఒడిదుడుకులు తీవ్రంగా వుంటాయని ట్రేడ్‌స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపకుడు విజయ్ సింఘానియా అన్నారు. సోమవారం జీడీపీ అడ్వాన్సు అంచనాల్ని ప్రభుత్వం విడుదల చేస్తుందని, 2014 డిసెంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి, గత జనవరి నెలకు సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు వచ్చే గురువారం ప్రకటితమవుతాయని రిలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మంగ్లిక్ చెప్పారు. ఇవి ఈ వారం ద్వితీయార్థంలో ట్రెండ్‌ను ప్రభావితం చేస్తాయన్నారు.
బ్లూచిప్ కంపెనీలైన లార్సన్ అండ్ టూబ్రో, డీఎల్ ఎఫ్, బీహెచ్‌ఈఎల్, సిప్లా, కోల్ ఇండియా, హిందాల్కో, ఓఎన్‌జీసీ, మహీంద్రా, ఎస్‌బీఐలు క్యూ3 ఆర్థిక ఫలితాల్ని ఈ వారం వెల్లడించనున్నాయి. ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ, కోల్ ఇండియాల ఫలితాలు, ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి డేటాల ఆధారంగా స్టాక్ సూచీలు కదలవచ్చని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా అభిప్రాయపడ్డారు. ఇక అంతర్జాతీయ పరిణామాలకొస్తే... గ్రీసు రుణ ప్రతిపాదనలను చర్చించేందుకు యూరో దేశాల ఆర్థిక మంత్రులు బుధవారం సమావేశం కానున్నారు. యూరో ప్రాంతపు జీడీపీ గణాంకాలు శుక్రవారం విడుదలకానున్నాయి.
ఎఫ్‌ఐఐల పెట్టుబడులు రూ. 12,000 కోట్లు
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) ఫిబ్రవరి నెల తొలివారంలో భారత క్యాపిటల్ మార్కెట్లో రూ. 12,000 కోట్ల నికర పెట్టుబడులు జరిపారు. వీటిలో ఫిబ్రవరి2-6వ తేదీల మధ్య షేర్లలోకి రూ. 4,702 కోట్లు ప్రవహించగా, రూ. 7,059 కోట్లు రుణపత్రాల్లోకి తరలివ చ్చాయి. తాజా నిధులతో ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు దేశంలో మొత్తం రూ. 45,000 కోట్లు నికరంగా పెట్టుబడి చేసినట్లయ్యింది.
ఈక్విటీ స్కీముల్లోకి రూ. 5,850 కోట్లు: ఈ ఏడాది జనవరిలో ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్‌కు చెందిన ఈక్విటీ పథకాల్లో రూ. 5,850 కోట్లు పెట్టుబడి చేశారు. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో ఈక్విటీ స్కీములు సమీకరించిన నిధుల మొత్తం రూ. 56,000 కోట్లకు చేరినట్లు మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మార్కెట్లో అధిక రాబడులు, సెంటిమెంట్ మెరుగుపడటంతో ఈక్విటీ స్కీములు అధిక పెట్టుబడుల్ని ఆకర్షించగలుగుతున్నాయని పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి. తాజా నిధుల ప్రవాహంతో ఫండ్స్ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ. 12 లక్షల కోట్లకు పెరిగింది.