భారత్‌లో డిలైట్ ఎనర్జీ ప్లాంట్ | Delight Energy Plant in India | Sakshi
Sakshi News home page

భారత్‌లో డిలైట్ ఎనర్జీ ప్లాంట్

Published Sat, Jun 13 2015 12:45 AM | Last Updated on Mon, Oct 22 2018 8:26 PM

భారత్‌లో డిలైట్ ఎనర్జీ ప్లాంట్ - Sakshi

భారత్‌లో డిలైట్ ఎనర్జీ ప్లాంట్

హైదరాబాద్‌లో ఏర్పాటుకు రెడీ
- 50 శాతం అమ్మకాలు దేశంలోనే
- డిలైట్ వ్యవస్థాపకులు నెడ్ టోజన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
సోలార్ లాంతర్ల విక్రయంలో ఉన్న డిలైట్ ఎనర్జీ భారత్‌లో ఏడాదిలో తయారీ ప్లాంటు పెట్టాలని భావిస్తోంది. 60 దేశాల్లో విస్తరించిన ఈ సంస్థ ఇప్పటి వరకు 1 కోటి యూనిట్లను విక్రయించింది. ఇందులో భారత్ వాటా 50 శాతం ఉంది. ఈ కారణంగానే ప్లాంటు స్థాపించాలన్నది సంస్థ ఆలోచన. లాంతర్లను తొలుత అసెంబుల్ చేస్తామని, ఆ తర్వాత దేశీయంగానే తయారీ చేపడతామని డిలైట్ ఎనర్జీ వ్యవస్థాపకులు నెడ్ టోజన్ తెలిపారు. ప్రాంతీయ బిజినెస్ డెరైక్టర్ శైలేష్ గుప్తాతో కలిసి శుక్రవారమిక్కడ సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. చైనాలో రెండు కంపెనీలతో ఒప్పందం చేసుకుని లాంతర్లను రూపొందిస్తున్నట్టు చెప్పారు. సామాన్యుడికి అందుబాటు ధరలో లాంతర్లను అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టు వివరించారు.

ప్రభుత్వం తోడ్పాటు ఇస్తే..
అత్యంత నాణ్యమైన ఉత్పత్తులను తక్కువ ధరలో సరఫరా చేస్తున్నట్టు టోజన్ తెలిపారు. ‘తయారీ వ్యయం పెరిగితే సామాన్యుడికి భారం అవుతుంది. ప్రభుత్వం  తోడ్పాటు ఇస్తే హైదరాబాద్‌లో ప్లాంటు పెట్టేందుకు సిద్ధం. 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల యూనిట్లు విక్రయించాలన్నది లక్ష్యం. ఉత్పత్తుల ధర రూ.500-1,900 ఉంది. ఎస్‌కేఎస్‌తోసహా 12 సూక్ష్మ రుణ సంస్థలతో చేతులు కలిపాం. వినియోగదారులకు సూక్ష్మ రుణాలను ఇవి అందిస్తున్నాయి. ఈ సంస్థల సహాయంతో 40 శాతం అమ్మకాలు నమోదయ్యాయి. భారత్‌లో మూడింట రెండింతలు విస్తరించాం. దేశవ్యాప్తంగా కస్టమర్లను చేరుకుంటాం’ అన్నారు.

పాడైతే కొత్త లాంతర్..
ప్రస్తుతం నాలుగు రకాల పేటెంటెడ్ మోడళ్లను డిలైట్ విక్రయిస్తోంది. ప్రతి మూడు నెలలకో కొత్త మోడల్‌ను తీసుకొస్తోంది. రెండేళ్లలో ఉత్పాదనలో సాంకేతిక సమస్య వస్తే కొత్తది ఇస్తారు. ఉత్పత్తిని బట్టి ఒకసారి రిచార్జ్ చేస్తే 4 నుంచి 100 గంటల వరకు వెలుగునిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 15,000 మంది విక్రేతల ద్వారా ఉత్పత్తులను అమ్ముతోంది. వీరిలో 300 మంది భారత్‌లో ఉన్నారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్‌లోనూ విక్రయిస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement