నగదు కొరత.. మరో రెండు నెలలు ! | demonetisation: cash crunch to normalise by february, says arundhati bhattacharya | Sakshi
Sakshi News home page

నగదు కొరత.. మరో రెండు నెలలు !

Published Tue, Dec 27 2016 12:21 AM | Last Updated on Mon, Sep 4 2017 11:39 PM

నగదు కొరత.. మరో రెండు నెలలు !

నగదు కొరత.. మరో రెండు నెలలు !

అప్పటికి గానీ వ్యవస్థలోకి తగినన్ని నిధులు అందుబాటులోకి రావు
500 నోట్లు పెరిగితే పరిస్థితి మెరుగవుతుంది
ఎస్‌బీఐ చైర్మన్‌ అరుంధతి భట్టాచార్య


న్యూఢిల్లీ: డీమోనిటైజేషన్‌ దరిమిలా నగదు కొరత కష్టాలు ఈ నెలాఖరుతో తీరిపోతాయంటూ ప్రభుత్వం చెప్పినప్పటికీ..పరిస్థితి చక్కబడేందుకు మరింత కాలం పట్టేయనుంది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ చైర్మన్‌ అరుంధతి భట్టాచార్య స్వయంగా ఈ విషయం చెప్పారు. ప్రజలు ఎలాంటి ఆంక్షలు లేకుండా తమ డబ్బును విత్‌డ్రా చేసుకునేంతగా తగినన్ని నిధులు వ్యవస్థలోకి రావాలంటే మరో రెండు నెలలు పట్టేయొచ్చని ఆమె వెల్లడించారు. గడిచిన కొద్ది రోజులుగా పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ.. వ్యవస్థలో లిక్విడిటీ మెరుగుపడేందుకు రూ. 500 నోట్ల లభ్యత మరింతగా పెరగాల్సి ఉందని ఒక వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వూ్యలో ఆమె పేర్కొన్నారు.

గడిచిన కొన్నాళ్లుగా సుమారు రూ. 6 లక్షల కోట్లు వ్యవస్థలోకి వచ్చాయని, ఇందులో అధికభాగం రూ.2,000, రూ. 100 నోట్లు ఉన్నాయని అరుంధతి చెప్పారు. ప్రస్తుతం మరిన్ని రూ. 500 నోట్లు అందుబాటులోకి తేవడంపై దృష్టి సారించినట్లు వివరించారు. ‘రూ. 2,000 నోట్లు అధిక విలువ గలవి అయినప్పటికీ.. మార్పిడికి రూ. 500 నోట్లు అనువైనవి. కేవలం రూ. 2,000, రూ. 100 నోట్లతో చెల్లింపులు కొంత సమస్యాత్మకంగానే ఉంటున్న నేపథ్యంలో రూ. 500 నోట్లు కూడా పూర్తిగా అందుబాటులోకి వస్తే సమస్య పరిష్కారం కాగలదు’ అని ఆమె చెప్పారు.

వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి రావడానికి మరికొన్ని నెలలు పట్టేయొచ్చన్న అరుంధతి.. ఏటీఎం మెషీన్ల రీక్యాలిబ్రేషన్‌ పూర్తయిపోయినందున.. ఈలోగా ఏటీఎం విత్‌డ్రాయల్‌ పరిమితులను సడలించవచ్చని అభిప్రాయపడ్డారు. ’ఇరవై నాలుగ్గంటలూ పనిచేసే ఏటీఎంలు ప్రజలకు సౌకర్యంగా ఉంటాయి. తగినన్ని రూ. 500 నోట్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏటీఎం పరిమితులు కచ్చితంగా సడలించడం జరుగుతుంది. ఈ పరిమితులను పెంచడం వచ్చే రెండు నెలల్లో జరగవచ్చు’ అని ఆమె పేర్కొన్నారు.

ఎస్‌ఎంఈ ఖాతాలు మొండిపద్దులుగా మారొచ్చు..
త్వరలో వ్యాపారాలు మెరుగుపడకుంటే రోజువారీ కార్యకలాపాలపైనే ఎక్కువగా ఆధారపడే చిన్న, మధ్య తరహా సంస్థల (ఎస్‌ఎంఈ) ఖాతాలు మొండిబకాయిలుగా మారే అవకాశం ఉందని అరుంధతి పేర్కొన్నారు. ఒకవేళ వచ్చే నెలా, రెండు నెలల్లో అంతా సర్దుకుంటే.. ప్రతికూల ప్రభావాలు తాత్కాలికంగానే ఉండొచ్చని ఆమె చెప్పారు. కానీ ఆర్థిక బలం అంతగా ఉండని ఎస్‌ఎంఈ రంగ సంస్థలకు ఎంతో కొంత తోడ్పాటు అందించడం అవసరమని అరుంధతి తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం, నియంత్రణ సంస్థ, బ్యాంకులు తమ వంతు తోడ్పాటు అందించవచ్చని పేర్కొన్నారు. సమస్యాత్మక ఎస్‌ఎంఈ ఖాతాలను తక్షణమే పునర్‌వ్యవస్థీకరణ రుణాల జాబితాలోకి వేసేయకుండా చెల్లింపు గడువును కొంత పొడిగించే వెసులుబాటు కల్పించడం మొదలైన చర్యలు తీసుకోవచ్చని ఆర్‌బీఐకి సిఫార్సు చేసినట్లు అరుంధతి చెప్పారు.

ఉదాహరణకు ఏదైనా ఎస్‌ఎంఈ నిర్దేశిత 2.5 ఏళ్లలో చెల్లింపులు జరపాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్న పక్షంలో  పునర్‌వ్యవస్థీకరించడం కాకుండా రుణ చెల్లింపునకు అదనంగా మరో మూడు నెలలు వ్యవధినిచ్చే అంశం పరిశీలించవచ్చు అని అరుంధతి చెప్పారు. అలాగే, సరఫరాదారులందరినీ  ఒక్కతాటిపైకి తెచ్చి, డిజిటల్‌ లావాదేవీలు జరిపేలా ప్రోత్సహించాలంటూ పెద్ద పారిశ్రామిక ఖాతాదారులకు ఎస్‌బీఐ సూచిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇలాంటి సంస్థలకు బ్యాంకులు కాలక్రమేణా రుణ పరిమితులను కూడా పెంచవచ్చని చెప్పారు. ఎస్‌ఎంఈలను డిజిటల్‌ లావాదేవీలవైపు మళ్లించేలా ప్రభుత్వం పన్నులపరమైన ప్రోత్సాహకాలు, పన్ను నిబంధనలను సరళతరం చేయడం, పన్నులపరమైన ప్రోత్సాహకాలు ప్రకటించడం మొదలైన చర్యలు తీసుకోవచ్చని ఆమె సూచించారు.

బ్యాంకులకు వ్యయాల దెబ్బ..
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఏటీఎంల రీక్యాలిబ్రేషన్, మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు (ఎండీఆర్‌) ఫీజు రద్దు, ఏటీఎం లావాదేవీలపై చార్జీల రద్దు, సిబ్బందిపై ఖర్చులు మొదలైన వాటి కారణంగా బ్యాంకుల వ్యయాలు గణనీయంగా పెరుగుతాయని అరుంధతి చెప్పారు. వీటికి తోడు కొంత మేర వ్యాపార నష్టం కూడా తప్పదని ఆమె పేర్కొన్నారు. అయితే, డీమోనిటైజేషన్‌కి సంబంధించిన ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉన్నందున.. ఈ వ్యయాలు ఏ మేర ఉంటాయన్నదానిపై ఇంకా ఒక అంచనా లేదని అరుంధతి వివరించారు. డీమోనిటైజేషన్‌తో కుదేలైన రుణాల వ్యాపార విభాగంపై జనవరి మధ్య నుంచి మళ్లీ పూర్తి స్థాయిలో దృష్టిలో పెట్టనున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement