యులిప్స్.. మ్యూచువల్ ఫండ్స్.. ఏవి ఉత్తమం?
యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్(యులిప్)లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? లేక మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్)లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? బిర్లా సన్‌లైఫ్ ఫ్రంట్‌లైన్ ఈక్విటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నాకు సెక్షన్ 80 సీ ప్రయోజనాలు అవసరం లేదు. కేవలం ఇన్వెస్ట్‌మెంట్ కోసమే ఈ ఫండ్‌ను ఎంచుకున్నాను. నా నిర్ణయం సరైనదేనా?
- ఆనంద్, హైదరాబాద్
బీమా కోసం కానీ, ఇన్వెస్ట్‌మెంట్ కోసం కానీ యులిప్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం సరైనది కాదు. మ్యూచువల్ ఫండ్స్‌ల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలోనే ఇన్వెస్ట్ చేయడం ఉత్తమమని చెప్పవచ్చు. సౌకర్యం, వ్యయాలు ఈ రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుంటే యులిప్‌ల కన్నా సిప్ విధానమే ఉత్తమం. యులిప్‌లకు సంబంధించి మొదటి 4,5 ఏళ్లలో అధిక వ్యయాలు చార్జీలుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక మ్యూచువల్ ఫండ్స్ గరిష్టంగా 2.5 శాతం చార్జీలను (ఈక్విటీ ఫండ్స్ అయితే 2.25 శాతం మాత్రమే) వసూలు చేస్తాయి. యులిప్‌లు అయితే స్కీమ్ ప్రారంభ సంవత్సరాల్లో కనీసం 5 నుంచి 6 శాతం చార్జీలను వసూలు చేస్తాయి.
మ్యూచువల్ ఫండ్స్ విషయంలో పెట్టుబడి వ్యూహాలు, పోర్ట్‌ఫోలియో తదితర అంశాలు పారదర్శకంగా ఉంటాయి. అంతేకాకుండా మ్యూచువల్ ఫండ్స్ పనితీరు, రాబడులు మీరు ఆశించిన విధంగా లేకపోతే వాటి నుంచి ఎప్పుడైనా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవచ్చు. యులిప్‌ల్లో అలా కాదు. మీ ఇన్వెస్ట్‌మెంట్స్ ఐదేళ్ల కాలానికి లాకిన్ అయి ఉంటాయి. ఇక మీ ఆర్థిక అవసరాలు, మీరు భరించగలిగే రిస్క్‌ను బట్టి ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. బిర్లా సన్‌లైఫ్ ఫ్రంట్‌లైన్ ఈక్విటీ ప్లాన్ అనేది లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఈక్విటీ ఫండ్. మా వాల్యూ రీసెర్చ్ దీనికి ఫోర్ స్టార్ రేటింగ్‌ను ఇచ్చింది. మీరు ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు.
ఒక మ్యూచువల్ ఫండ్‌కు సంబంధించి ఎగ్జిట్‌లోడ్‌లోని మార్పులను తెలుసుకునే వీలుందా? ఎగ్జిట్ లోడ్ మార్పుల వివరాలను ఇన్వెస్టర్లకు తెలియజేయాల్సిన బాధ్యత మ్యూచువల్ ఫండ్ సంస్థలకు లేదా?
- నిర్మల్ కుమార్, కొత్తగూడెం
మీరు మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసిన సమయంలో ఉండే ఎగ్జిట్ లోడ్.. మీ ఇన్వెస్ట్‌మెంట్ కాలానికి వర్తిస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎగ్జిట్‌లోడ్‌లో మార్పులు, చేర్పులు వచ్చినా వాటితో మీకేమీ సంబంధం ఉండదు. ఏదైనా స్కీమ్‌లకు సంబంధించి ఎగ్జిట్ లోడ్‌లో ఏమైనా మార్పులు, చేర్పులు చేస్తే సదరు మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఆ వివరాలను వార్తాపత్రికల ద్వారా తెలియజేయాలి. ఈ వివరాలను తమ వెబ్‌సైట్‌ల్లో కూడా పబ్లిష్ చేయాలి. అయితే నేరుగా ఇన్వెస్టర్లకు తెలియజేయాల్సిన తప్పనిసరి నిబంధన ఏదీ లేదు.
ఇలా చేయడం వ్యయంతో కూడుకున్నందున మ్యూచువల్ ఫండ్ సంస్థలకు ఈ వెసులుబాటు ఉంటుంది. ఇన్వెస్టర్లు తాము ఇన్వెస్ట్ చేసిన ఫండ్ రాబడుల గురించే కాకుండా తమ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ప్రభావం చూపే వ్యయాలు, చార్జీలపై కూడా ఒక కన్నేసి ఉంచడం మంచిది. ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు, లేదా మ్యూచువల్ ఫండ్స్ నుంచి తమ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకునేటప్పుడు తెలుసుకోవలసిన అన్ని వివరాలను (ప్రతీ స్కీమ్‌కు సంబంధించి) మా వెబ్‌సైట్ అందిస్తుంది
నా వయసు 54 సంవత్సరాలు. నా భార్య వయసు 50 సంవత్సరాలు. మాకు 16 సంవత్సరాల వయసున్న కూతురు ఉంది. మా ముగ్గురి కోసం నేను న్యూ ఇండియా ఎష్యూరెన్స్ నుంచి ఒక మెడిక్లెయిమ్ పాలసీ తీసుకున్నాను. ఒక్కొక్కరికి రూ.5 లక్షల కవర్ ఉండేలా ఏడాదికి రూ.35,000 ప్రీమియం చెల్లిస్తున్నాను. ఇదే కాకుండా రూ.10 లక్షలకు ఐసీఐసీఐ హెల్త్ ఫ్లోటర్ పాలసీ కూడా తీసుకున్నాను. ఈ రెండు పాలసీలకు గత ఏడు సంవత్సరాలుగా ఎలాంటి క్లెయిమ్స్ చేసుకోలేదు. ఈ హెల్త్ పాలసీల్లో కొనసాగమంటారా? వద్దంటారా? తగిన సలహా ఇవ్వండి?
- సదాశివరావు, విజయవాడ
ఈ వయసులో మెడిక్లెయిమ్ పాలసీల నుంచి వైదొలగడం సరైనది కాదు. మధ్య వయసు తర్వాత ఆరోగ్య పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉంటాయి. గత ఏడేళ్లుగా మీరు ఎలాంటి క్లెయిమ్ చేయలేదు. కాబట్టి లాయల్టీ అడిషన్స్, నో క్లెయిమ్ బోనస్‌లను మీరు అదనంగా పొందుతారు. ఈ పాలసీల్లోనే కొనసాగడం ఉత్తమం. కొత్తగా మీరు పాలసీ తీసుకుంటే ఈ ప్రయోజనాలు మీకు లభించవు. భవిష్యత్తులో కూడా మీరు ఎలాంటి క్లెయిమ్‌లు చేయాల్సిన అవసరం ఉండకూడదనే ఆశిద్దాం. ఒకవేళ వైద్య సాయం అవసరమైన పక్షంలో ఈ పాలసీలు మీకు తగిన విధంగా వైద్య ఖర్చులను తట్టుకోవడంలో భరోసాను ఇస్తాయని చెప్పవచ్చు.