పెట్టుబడికి నయా రూట్..
బ్యాంక్ బ్యాలెన్స్ బాగా ఉండేలా చూసుకో.. స్టాక్ మార్కెట్లు.. షేర్లూ అంటూ రిస్కులు తీసుకోకు.. పదో పరకో ఉంటే బంగారాన్ని కొని దాచిపెట్టుకో .. అప్పుడూ, ఇప్పుడూ పెట్టుబడికి సంబంధించి కామన్‌గా వినిపించే సలహాలివి. అయితే, అన్నింటి ధరలు భగ్గుమంటూ భయపెడుతున్న ప్రస్తుత తరుణంలో కేవలం ఈ సాధనాలు మాత్రమే పట్టుకుని కూర్చుంటే పనయ్యే పరిస్థితి లేదు. మారుతున్న కాలాన్ని బట్టి పెట్టుబడి వ్యూహాలను మార్చుకుంటూ ఉండటం తప్పనిసరి. రేట్ల పెరుగుదలకు మించి రాబడులు అందించే సాధనాలతో రిస్కు చేయడానికి, కొంగొత్త వ్యూహాలతో దూకుడుగా దూసుకెళ్లేందుకు సై అంటోంది ప్రస్తుత తరం. ఈ నేపథ్యంలోనే అందుబాటులో ఉంటున్న సాధనాలపై, గతకాలం..ప్రస్తుతం మారుతున్న ఇన్వెస్ట్‌మెంట్ విధానాలపై ఈ కథనం.
మొత్తం కుటుంబంతో కలసి సరదాగా ఏ మాల్‌లోనో సినిమాకి వెళ్లాలంటే.. వెయ్యి నోటు సరిపోవడం లేదు. చదువుల ఫీజులు, వైద్యం ఖర్చులూ ఏటా పది, ఇరవై శాతం మేర పెరిగిపోతున్నాయి. ఎంత పొదుపు చేసినా, ఎంత ఆదా చేసినా ఈ ఖర్చులను ఎదుర్కొనేందుకు సరిపోవడం లేదు. అందుకే రిస్కు ఎక్కువున్నప్పటికీ మరింత ఎక్కువ రాబడినిచ్చే వాటిపై ఆసక్తి పెరుగుతోంది. మారుతున్న కాలాన్ని బట్టి ఆర్థికపరమైన నిర్ణయాలూ మార్చుకుంటూ ఉండాలి.
బంగారం.. ఈటీఎఫ్‌లు..
కొన్నాళ్ల క్రితం దాకా బంగారంలో ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఆభరణాలు, కడ్డీల రూపంలో మాత్రమే ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ మొదలైనవి వచ్చేశాయి. ఆభరణాల తరహాలో వీటికి మేకింగ్ చార్జీలు, తరుగుదల వంటి గొడవలు ఉండవు. ఎలక్ట్రానిక్ రూపంలో కొనుగోలు జరుగుతుంది కాబట్టి బంగారాన్ని భద్రపరచుకోవడం గురించి చింత ఉండదు. మంచి రేటు వస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించుకోవచ్చు. ధర తగ్గితే మళ్లీ కొనుక్కోవచ్చు.
పండుగల వేళ కాస్తయినా బంగారం కొనుక్కోవడం మంచిదని పెద్దాళ్లు చెబుతుంటారు. అలా కొనుక్కోవాలనుకుంటే.. అచ్చం బంగారంగానే కాకుండా.. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ రూపంలో కూడా ప్రస్తుతం కొనుక్కునే అవకాశం ఉంది. అయితే, ఒక్క విషయం.. వెండి, బంగారం, ప్లాటినం ఇలాంటివి ఆభరణాల రూపంలో తీసుకున్న పక్షంలో అలంకారానికి ఓకే గానీ.. ప్రధాన ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలుగా వీటిని మాత్రమే పెట్టుకుంటే చిక్కే. ఎందుకంటే డబ్బు ఎంత అవసరమైనా కూడా బంగారు ఆభరణాలను అమ్మాలన్నా, తాకట్టు పెట్టాలన్నా చాలా మందికి రుచించదు. కాబట్టి ఎక్కువగా ఆయా ఆభరణాలు అలంకారప్రాయంగానే ఉంటాయి. అలాగని, పెట్టుబడుల విషయంలో పుత్తడిని పూర్తిగా విస్మరించనూ లేము. కనుక, పోర్ట్‌ఫోలియోలో బంగారం వాటా ఐదు నుంచి పది శాతానికి మించకుండా చూసుకుంటే చాలు.
బీమా ప్రాధాన్యం..
గతంలో బీమాను పెట్టుబడి సాధనంగా కూడా భావించి.. ఏళ్ల తరబడి రకరకాల సంప్రదాయ పాలసీలు కట్టుకుంటూ వెళ్లేవారు. ఎప్పుడో ఇరవై ముఫ్ఫై ఏళ్ల తర్వాత పిల్లలకు ఉపయోగపడుతుందంటూ వివిధ పాలసీలకు బోలెడు ప్రీమియంలు పోసేవారు. తీరా చూస్తే సదరు పిల్లలు పెద్దయ్యాక.. లక్షో, లక్షన్నరో చేతికొచ్చేవి. అన్నేళ్ల పాటు కట్టిన ప్రీమియంలపై కేవలం అయిదారు శాతం వార్షిక రాబడి వస్తే ఉపయోగం ఏముంది.
అలాగే, పన్నుపరంగా ప్రయోజనాలు పొందే ఉద్దేశంతో తీసుకున్న పాలసీలు కొన్ని ఉంటాయి. వీటిని తక్షణావసరం కోసం తీసుకున్నా చివరిదాకా మోయక తప్పని పరిస్థితీ ఉండేది. ఇప్పుడు కూడా ఇలాంటి ఉదంతాలు ఉన్నప్పటికీ.. ప్రస్తుతం బీమాపై దృక్పథం మారుతోంది. దీన్ని ఇన్వెస్ట్‌మెంట్ సాధనంగా కాకుండా రిస్కు నుంచి రక్షణనిచ్చేదిగా పరిగణించడం మొదలైంది. పాలసీదారుకి అనుకోనిది ఏమైనా జరిగినా కుటుంబం ఆర్థికపరమైన కష్టాలు లేకుండా చూడటమే జీవిత బీమా ప్రధానోద్దేశం. దీనిపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో.. ఇందుకు అనుగుణంగా టర్మ్ పాలసీలకు ఆదరణ పెరుగుతోంది.
కనుక, రకరకాల పాలసీలు కాకుండా లైఫ్‌స్టయిల్‌ని బట్టి రూ. 50 లక్షలు, రూ. 1 కోటి దాకా టర్మ్ ప్లాన్లను తీసుకోవడం ద్వారా తక్కువ వ్యయాలతో కుటుంబానికి పెద్ద స్థాయిలో ఆర్థిక భద్రతనిచ్చినట్లు అవుతుంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో తక్కువ ప్రీమియాలకే టర్మ్ పాలసీలు దొరుకుతున్నాయి. వార్షికంగా సుమారు 8-15 వేలు ప్రీమియం కడితే (30-35 ఏళ్ల వ్యక్తి) దాదాపు ముఫ్ఫై ఏళ్ల పాటు రూ. 1 కోటి కవరేజీ ఇచ్చే టర్మ్ పాలసీలూ ఉన్నాయి.
ఈ స్థాయిలో కవరేజీ కోసం ఇతర పాలసీల్లోనైతే సుమారు రెట్టింపు స్థాయిలో ప్రీమియాలు ఉంటున్నాయి. కనుక టర్మ్ ప్లాన్లను తీసుకోవడం ద్వారా బోలెడు మిగులుతుంది. నెలకు రూ. 1,500 చొప్పున ఏదైనా మంచి ఈక్విటీ ఫండ్‌లో గానీ సుమారు ముప్ఫై ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తూ వెడితే.. కనీసం 15 శాతం రాబడి అంచనా వేసుకున్నా దాదాపు రూ. 1 కోటి పైగా నిధి తయారవుతుంది.
షేర్లు.. ఫండ్లు.. స్థిరాస్తి..
ద్రవ్యోల్బణం ధాటికి రూపాయి కరిగిపోతోంది. మొన్న రూపాయికి వచ్చిన వస్తువు..ఇప్పుడు పదిరూపాయలు పెడితే గానీ రావడం లేదు. రేపో ఎల్లుండో ఆ ధర ఇరవైకి పెరిగిపోతుంది. మరోవైపు సంప్రదాయ సాధనాల్లో ఇన్వెస్ట్‌మెంట్లపై వచ్చే రాబడులు మాత్రం ఆ స్థాయిలో ఉండటం లేదు. దీంతో మళ్లీ జేబు నుంచి పెట్టుకోవాల్సి వస్తోంది. కనుక, ధరల పెరుగుదలకు మించిన రాబడి వచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తేనే రిటైర్మెంట్ తర్వాత అవసరాలకు ఎంతో కొంత కూడబెట్టుకోగలిగేది.
ఇందుకోసం అప్పటి తరహాలో కేవలం సురక్షితమైన ఫిక్స్‌డ్ డిపాజిట్ల వంటి వాటిపై ఆధారపడితే సరిపోదు. రిస్కులు ఉన్నా దీర్ఘకాలంలో అధిక రాబడులు ఇచ్చే సత్తా ఉన్న ఏకైక సాధనం షేర్లే అన్నది ఫైనాన్షియల్ ప్లానర్ల మాట. ప్రస్తుతం నేరుగా షేర్లలో ఇన్వెస్ట్ చేసే అవకాశం లేని వారి కోసం మ్యూచువల్ ఫండ్స్ సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. నెలకు రూ. 1,500 కాకుండా మరింత దూకుడుగా రూ. 10,000-20,000 చొప్పున 30 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తూ వెడితే.. 15 శాతం రాబడితో ఏకంగా రూ. 10 కోట్ల పైచిలుకు పోగుపడే అవకాశముంది.
ఇది చక్ర వడ్డీ మహిమ. అయితే, ఇది జరగాలంటే సాధ్యమైనంత ముందు నుంచే ఈక్విటీలు, మొదలైన వాటిలో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాలి. క్రమక్రమంగా కేటాయింపులు పెంచుకుంటూ పోవాలి. ఇక ప్రాపర్టీల కొనుగోలు విషయానికొస్తే.. గతంలో దాదాపు ముఫ్పై అయిదు- నలభై ఏళ్ల వయసులో సొంత ఇంటి కొనుగోలు ఆలోచన చేస్తుండే వారు. ఇప్పటి తరం ఇరవైల నుంచే ప్లాన్ చేస్తోంది. మెట్రో నగరాల్లో భారీ రేట్లు పెట్టలేని పరిస్థితుల్లో చిన్న పట్టణాల్లోనూ, శివార్లలోనూ చౌకగా తీసుకుంటున్నారు. క్రమంగా వీటి విలువ పెరుగుతుంది కాబట్టి ఆ రకంగా ప్రయోజనాలు పొందుతున్నారు.
బ్యాంకు బ్యాలెన్సు..
గతంలో బ్యాంకు బ్యాలెన్స్‌కి ఎక్కువగా ప్రాధాన్యమిచ్చేవారు. అయితే ప్రస్తుతం ధరల భారాన్ని ఎదుర్కొనాలంటే బ్యాంకు ఖాతాల్లో డబ్బుపై వచ్చే రాబడి ఏమాత్రం సరిపోయే పరిస్థితి లేదు. లక్షల మొత్తాన్ని దాచి ఉంచినా.. వచ్చే రాబడి స్వల్పమే. పూర్తిగా సేవింగ్స్ ఖాతాలైతే నాలుగైదు శాతం మాత్రమే ఉంటోంది. కనుక ప్రస్తుతం అంతకు మించి రాబడులు ఇచ్చే సురక్షితమైన సాధనాలు మరికొన్ని వచ్చి చేరాయి. ఆ కోవకి చెందినవే లిక్విడ్ ఫండ్స్. వార్షికంగా చూస్తే ఇవి బ్యాంకు డిపాజిట్ల కన్నా మరింత అధిక రాబడులే ఇస్తున్నాయి. అలాగని, మరీ బ్యాంకుల్లో ఏమాత్రం ఉంచకూడదని కూడా కాదు. ప్రస్తుతం దాదాపు అన్ని బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ విధానాన్ని పాటిస్తున్నాయి. కాబట్టి వచ్చే జీతంలో మినిమం బ్యాలెన్స్‌కు పైబడి.. నెలవారీ ఖర్చులతో పాటు మరో 10 శాతం అదనంగానే ఖాతాలో ఉంచుకోవడం మంచిది. దీనివల్ల మినిమం బ్యాలెన్స్‌ను కదపాల్సిన అవసరం ఉండదు. పెనాల్టీలు కట్టుకోవాల్సిన సమస్యా తలెత్తదు. విహార యాత్రలు, బీమా ప్రీమియంలు మొదలైన వాటి కోసం కూడా లిక్విడ్ ఫండ్స్‌తో ప్లాన్ చేసుకోవచ్చును.