
న్యూఢిల్లీ: పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాదారులు 34 కోట్ల మందికి త్వరలోనే డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఖాతాలను ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుతో అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. దీంతో పోస్టాఫీసు సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులు ఏ ఇతర బ్యాంకు ఖాతాలకు అయినా నగదు బదిలీ చేసుకోవచ్చని తపాలా శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఏడాది మే నాటికి అనుసంధానించుకునే అవకాశాన్ని ఖాతా దారులకు కల్పిస్తామని చెప్పారు.
ఖాతాదారులు ఆమోదం తెలియజేస్తేనే అనుసంధానించడం చేస్తామన్నారు. పోస్టాఫీసు 34 కోట్ల సేవింగ్స్ ఖాతాల్లో 17 కోట్ల ఖాతాలు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్, రికరింగ్ డిపాజిట్లకు సంబంధించినవి కాగా, మిగిలినవి రెగ్యులర్ ఖాతాలు. దేశవ్యాప్తంగా తపాలా శాఖకు 1.55 లక్షల బ్రాంచ్‌లు ఉన్నాయి. వీటిని పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుతో అనుసంధానించనుంది.
ఖాతాలను పోస్ట్‌పేమెంట్స్ బ్యాంకుతో అనుసంధానించిన తర్వాత ఇతర బ్యాంకుల మాదిరే అన్ని నగదు బదిలీ సేవలు వినియోగించుకోవడం వీలవుతుందని తపాలా శాఖ వర్గాలు తెలిపాయి. తపాలా శాఖ లోగడ జారీ చేసిన ప్రకటన మేరకు, ఈ నెలాఖరు నాటికి పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించి 650 శాఖలు కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment