
బీమాకు డిజిటల్ ఊతం
⇒ డిజిటల్ లావాదేవీలతో పాలసీదార్లకు మేలు
⇒ కంపెనీలు సైతం దీనిపై ఫోకస్ చెయ్యాలి
ఇన్సూరెన్స్ గురించి అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఊహించని ప్రమాదాలేవైనా ఎదురైనప్పుడు కలిగే ఆర్థిక ఇబ్బందుల నుంచి బీమా (ఇన్సూరెన్స్) మనను కాపాడుతుంది. జీవిత బీమా కావొచ్చు.. ఆరోగ్య బీమా కావొచ్చు.. ఏ బీమా పాలసీలైనా మనల్ని విపత్కర పరిస్థితుల నుంచి కొంత మేర గట్టెక్కిస్తాయి. ప్రజల అవసరాలకు అనువైన పాలసీలను అందించడం బీమా కంపెనీల విధి. కాగా కొంతకాలంగా ఈ రంగం కొంచెం నెమ్మదించింది. ఉత్తేజానికి కొన్ని చర్యలు అవసరం. ఇందులో డిజిటలైజేషన్‌దే కీలక పాత్ర.
స్తబ్దతకు కారణాలు అన్వేషించాలి..
గత కొన్నేళ్లుగా బీమా రంగంలో వృద్ధి మందగించింది. దేశంలో వృద్ధికి చాలా అవకాశాలు అందుబాటులో ఉన్నా కూడా ఇన్సూరెన్స్ వ్యాప్తి తక్కువగానే ఉండటం ఆశ్చర్యకరం. దీనికి కారణాలేంటన్నది బీమా కంపెనీలు కచ్చితంగా అన్వేషించుకోవాలి. భారత్‌లో ఇన్సూరెన్స్ పాలసీలు చాలా మందికి ఇంకా చేరటం లేదు. పాలసీల విలువను కస్టమర్లకు అర్థమయ్యేలా వివరించేందుకు తగిన చర్యలు చేపట్టకపోవటమూ దీనికి కారణమే. ఇందుకోసం బీమా కంపెనీలు టెక్నాలజీని విరివిగా ఉపయోగించుకోవాలి. ప్రజలకు, బీమా కంపెనీలకు మధ్య ఉన్న దూరాన్ని భర్తీ చేయగలిగేది టెక్నాలజీనే.
దేశంలోని పరిస్థితులిపుడు ఇందుకు అనుకూలంగా కూడా ఉన్నాయి. యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా నిర్వహించే డిజిటల్ లావాదేవీల గణనీయంగా పెరుగుతున్నాయి. ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ ఏర్పాటవుతోంది. మరీ ముఖ్యంగా దేశంలో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో భవిష్యత్‌లో లావాదేవీలన్నీ క్రమంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి మారతాయి. ఇది ఇన్సూరెన్స్ రంగానికి బాగా కలిసొచ్చే అంశం.
డిజిటలైజేషన్‌తో కీలక మలుపు..
డిజిటలైజేషన్ వల్ల ఇన్సూరెన్స్ రంగంలోని పలు పనులు సరళంగా, సమర్థవంతంగా జరుగుతాయి. టెక్నాలజీ వాడటం వల్ల పాలసీలను మార్కెట్‌లోకి తీసుకురావడం, వాటిని విక్రయించడం, పేమెంట్ చెల్లింపులు, సర్వీసులు వంటి వాటిని సమర్థంగా నిర్వహించవచ్చు. కంపెనీలు ఇప్పటికే డిజిటలైజేషన్ వైపు అడుగులేశాయి. ప్రొడక్ట్ విక్రయం, కస్టమర్ వివరాల నమోదు వంటివి ఇప్పటికే డిజిటలైజ్ అయ్యాయి. ఇక్కడ పేమెంట్ చెల్లింపులపై దృష్టి కేంద్రీకరించాలి. డిజిటల్ లావాదేవీల వల్ల వీటి సమస్య కూడా సమసిపోతుంది. కస్టమర్ నుంచి కంపెనీకి డాక్యుమెంట్స్ చేరాక జరిగే తదనంతర కార్యకలాపాల్లో గత రెండేళ్ల నుంచి మంచి పురోగతి కనిపిస్తోంది. టెక్నాలజీ ద్వారా కన్సూమర్లలలో అవగాహన పెంచాలి. డిజిటలైజేషన్ వల్ల తగ్గే వ్యయాలను కస్టమర్లకు బదిలీ చేస్తే.. అప్పుడు వారికి తక్కువ విలువతో మంచి ప్రొడక్ట్‌ను అందించొచ్చు.